రెండోస్థానం కోసమే ఆ రెండు పార్టీల పోటీ

తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు ఖాయం

ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌ ఎందుకు మాట్లాడరు

ఆలయాలను కూల్చిన పాపమే చంద్రబాబుకు శాపంగా మారింది

వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ విచారణలో ఉంది

తిరుపతి ఎంపీకి, పెట్రోల్‌ ధరలకు సంబంధం ఏంటో లోకేష్‌ చెప్పాలి

పవన్, లోకేష్‌ ఇద్దరూ అజ్ఞానపు సంత

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ధ్వజం

కాకినాడ: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయం అని,  రెండో స్థానం కోసం టీడీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీకి భయం పట్టుకుందని, అందుకే పరిషత్‌ ఎన్నికల నుంచి చంద్రబాబు తప్పుకున్నాడన్నారు. విభజన హామీల గురించి బీజేపీని పవన్‌ ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. తిరుపతిలో గెలిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని లోకేష్‌ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పవన్, లోకేష్‌ను చూసి ఇదో అజ్ఞానపు సంత అని జనం నవ్వుకుంటున్నారన్నారు. 

కాకినాడలో మంత్రి కన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో భారీ డైలాగ్‌లు చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడవన్నీ మర్చిపోయారా అని ప్రశ్నించారు. తిరుపతిలో మోదీ ప్రత్యేక హోదా హామీ పవన్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ ఎద్దేవా చేసింది పవన్‌కల్యాణ్‌కు గుర్తులేదా అని నిలదీశారు. పవన్‌ కల్యాణ్‌ మాట మీద నిలబడే వ్యక్తి కాదన్నారు.  విభజన హామీల గురించి బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీని ప్రశ్నించాల్సింది పోయి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఎలా విమర్శలు చేస్తారని మంత్రి కన్నబాబు ఫైరయ్యారు.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే వైయస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకుడు బీటెక్‌ రవికి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు పవన్‌కు తెలియదా? అని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదని ఫైరయ్యారు. వైయస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును సీఎం వైయస్‌ జగన్‌ సీబీఐకి అప్పగించారని చెప్పారు. వైయస్‌ వివేకా హత్యపై సీబీఐ విచారణ జరుగుతుందని పవన్‌ తెలుసుకోవాలన్నారు. పవన్‌ కల్యాణ్‌ మిత్రపక్ష పార్టీ ∙విచారణ చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

ఆనాడు సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంది చంద్రబాబు కాదా? టీడీపీ హయాంలో వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే పవన్‌ ఎందుకు ప్రశ్నించలేదు?. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. విజయవాడలో ఆలయాలను కూల్చిన పాపమే చంద్రబాబుకు శాపంగా మారిందన్నారు. అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తే కేంద్రం ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. ఆలయాలపై పవన్‌ కల్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో పవన్‌ కల్యాణ్‌ చెప్పాలన్నారు. గ్యాస్, పెట్రోల్‌ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో పవన్‌ చెప్పాలన్నారు. 

తిరుపతిలో గెలిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని లోకేష్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. తిరుపతి ఎంపీకి, పెట్రోల్‌ ధరలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. మోకాలుకు బోడిగుండుకు ముడిపెడదామనుకుంటే అది వారి అజ్ఞానమే తప్ప మరొకటి ఉండదన్నారు. పవన్, లోకేష్‌ను చూసి ఇదో అజ్ఞానపు సంత అని జనం నవ్వుకుంటున్నారని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top