రైతులు, వ్యవసాయాన్ని రాజకీయంగా చూడొద్దు

రైతులకు ఎంత చేసినా తక్కువే

మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

రైతుల సంక్షేమానికి త్రిముఖ వ్యూహం అవసరం

తొలి కేబినెట్‌లోనే రైతు భరోసా పథకంపై నిర్ణయం

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

అమరావతి: రైతులు, వ్యవసాయాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, రైతులకు ఎంత చేసినా తక్కవే అవుతుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వమని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం వ్యవసాయంపై సభలో మంత్రి మాట్లాడారు. 2014–2019 వరకు రాష్ట్రంలో 1160 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. 454 కేసులకు మాత్రమే రైతుల ఆత్మహత్యలుగా పరిగణించారని తెలిపారు. 706 కేసుల్లో పునఃపరిశీలన జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. జిల్లా కలెక్టర్‌ బాధిత కుటుంబ సభ్యులను కలిసి వాస్తవమైతే 24 గంటల్లో పరిహారం అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి రూ.7 లక్షలు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. ఈ డబ్బంతా కూడా వారి కుటుంబానికే చెందే విధంగా చర్యలు తీసుకుందన్నారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని చెప్పారు.

ప్రమాదవశాత్తు మరణిస్తే..వైయస్‌ఆర్‌ బీమా పేరుతో రూ.7 లక్షల పరిహారం అందించే కార్యక్రమాలు తీసుకున్నామన్నారు. తాత్కాలిక ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తుందని చెప్పారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని, నిధుల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ముఖ్యమంత్రి మొదటి కేబినెట్‌ మీటింగ్‌లో చెప్పినట్లు గుర్తు చేశారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. శనగ రైతులకు రూ.330 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఒక్కో రైతుకు ఎకరానికి రూ.9 వేలు అదనంగా వచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడు లేని విధంగా పేపర్‌ మిల్లుకు బకాయిలు పడితే ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పింది. ఫామ్‌ అయిల్‌ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సీఎం చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. పొగాకు రైతులకు ధరలు పడిపోతే సీఎం తక్షణమే అధికారులతో చర్చించి గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడ ఏ పంట నష్టపోతున్నా ప్రభుత్వం స్పందిస్తోందన్నారు.

రాష్ట్ర చరిత్రలో మొదటిసారి వ్యవసాయ మిషన్‌ ఏర్పాటు చేశారని, దానికి చైర్మన్‌గా సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి నెల వ్యవసాయ మిషన్‌ సమావేశం జరుగుతుందన్నారు. వచ్చే మూడు నెలల్లో ఏ పంటలు వేస్తున్నారు. ఎక్కడ సమస్యలు ఉన్నాయోగుర్తించాలని సీఎం  ఆదేశించినట్లు చెప్పారు. ధరలు పడిపోతే ఏం చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేశారన్నారు. రైతుల విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వెళ్తుందన్నారు. వచ్చే ఏడాది నుంచి పాడి పరిశ్రమలో రైతులకు దన్నుగా ఉండేందుకు లీటర్‌కు రూ.4 ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు. రైతులకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రైతులపై ఒత్తిడి తగ్గించడమే మా ప్రభుత్వ ఆలోచన అన్నారు. ప్రతి దాన్ని రాజకీయంగా చూస్తే తప్పులేదు కానీ, వ్యవసాయాన్ని రాజకీయ దృష్టితో చూస్తే తప్పు అవుతుందన్నారు. ఎవరో డిమాండు చేసేంతవరకు ఆగాల్సిన అవసరం లేదన్నారు. మీరే రైతు సమస్యలను గుర్తించాలని సీఎం సూచించినట్లు చెప్పారు. విత్తన కంపెనీలతో, ఎరువులు, పురుగు మందుల వ్యాపారులతో ఎంవోయులు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

ప్రతి నియోజకవర్గంలో ఒక ల్యాబోరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో ఉన్న ఇన్‌పుట్‌ సబ్సిడీలను చెల్లించాలని మా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ప్రకృతి వైఫరీత్యాల కోసం రూ.2 వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతుల నుంచి బలవంతంగా రుణాలు వసూలు చేయవద్దని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతిపక్షం కూడా వ్యవసాయంపై సహకారం అందించాలని మంత్రి కోరారు.
 

Back to Top