ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేకే టీడీపీ తప్పుడు ప్రచారం

వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు  

టీడీపీకి అనుకూలంగా ఉంటే అన్ని బావున్నట్టా? లేకపోతే అన్ని వ్యవస్థలూ నాశనమైపోయినట్టా?

చంద్రబాబు నీతి చంద్రికలు వల్లె వేయటం ఏంటి? మరి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఇలా చేయలేదేంటి?

రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు దక్కుతుంటే దాన్ని డైవర్ట్‌ చేయటానికే అసత్య ప్రచారానికి తెరదీశారు

సీఎం వైయ‌స్‌ జగన్ గ్రాఫ్‌ ప్రజల్లో పెరిగిపోతుంటే ఈర్ష్యతో బాబు అండ్‌ కో బురద జల్లుతోంది

పెట్రోల్‌, డీజిల్‌ ధరల్ని కేంద్రం పెంచితే.. రాష్ట్రంలో వైయ‌స్‌ జగన్ ను చంద్రబాబు విమర్శించటం ఏంటి?

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరను వంద దాటించి పండగ డిస్కౌంట్‌ ఇచ్చినట్టు రూ.5-10 తగ్గించటం ఏమిటి?

అడ్డగోలు సెస్‌లతో ప్రజలపై భారం మోపుతున్నారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాస్ ధరనూ కేంద్రం తగ్గించాలి

వంటగ్యాస్‌ ధర గతంలో ఎంత? ఇప్పుడు ఎంత? ప్రతి కుటుంబంపై ఎంతో భారం పడుతోంది

చంద్రబాబులా బీజేపీ నాయకులూ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. పెంచిన ధరల్ని ఇంకా తగ్గించాలి

 ఈ-క్రాప్‌ ఏర్పాటు ద్వారా అర్హులైన రైతులకు సున్నా వడ్డీ పథకం అందేలా చేశాం. మంచి చేసినా విమర్శలా?

గతంతో పోలిస్తే అర్హులైన రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ అవుతున్నాయి. ఇది ఈనాడుకు తప్పా? 

రైతులకు చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిల్ని కూడా సీఎం శ్రీ జగన్ గారి ప్రభుత్వం తీర్చింది. ఇది వాస్తవం కాదా?

ఎయిడెడ్‌పై అపోహలు వస్తే.. వాటిని సీఎం శ్రీ జగన్ తీర్చారు. అయినా, ప్రతిపక్షాలు రాజకీయం చేయాలనుకోవటం సరికాదు

 కాకినాడ‌: రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న అభివృద్ధికి, సంక్షేమానికి ఏదో రకంగా అడ్డుపడాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని దీంతో శ్రీ వైయ‌స్ జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక టీడీపీ తప్పుడు ప్రచారంకు దిగిందని కన్నబాబు మండిపడ్డారు. శ్రీ జగన్ గారిపైన అక్కసుతో, ఈర్ష్యాద్వేషాలతో కొంతమంది నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు. రోజురోజుకీ వైయ‌స్ జగన్‌ గారికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి బురద జల్లే కార్యక్రమాన్ని టీడీపీ చేస్తోందన్నారు. టీడీపీ వారి తోక పార్టీలు, మద్దతుదారులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఖ్యాతిని దెబ్బతీయాలని కుట్ర పూరితంగా ముందుకు వెళ్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

- చంద్రబాబు మాటల్లో ఫ్రస్ట్రేషన్ తప్ప ఇంకేమీ కనిపించట్లేదు. చంద్రబాబు ఏడుసార్లు గెలిచిన కుప్పంలోనే సరైన ఫలితాలు రావనే ఫ్రస్ట్రేషన్‌ ఆయన మాటల్లో కనిపిస్తోందని కన్నబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చాలా దుర్మార్గంగా దౌర్జన్యకాండ జరుగుతున్నట్లు, సామాన్యులు, ప్రతిపక్ష పార్టీలు బ్రతికే వీలులేని స్థితి ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోందని కన్నబాబు అన్నారు. 

చంద్రబాబు నీతి చంద్రికలు వల్లె వేస్తున్నారు. మరి ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ ఉన్నప్పుడు ఇలా చేయలేదేంటి?
- ఎస్‌ఈసీ పనితీరుపై చంద్రబాబు మాట్లాడుతూ నీతిచంద్రికలు వల్లిస్తున్నారు. ఎస్‌ఈసీ అంటే నిమ్మగడ్డ రమేశ్‌  కుమార్‌లా పనిచేయాలని చంద్రబాబు కోరుతున్నారు. ఇవాళ ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వారికి ఉన్న పరిధిలో పనిచేస్తుంటే.. స్టేట్‌ ఎలక్షన్ కమిషన్‌కే చంద్రబాబు హెచ్చరికలు చేస్తున్నారు. చేతగాకపోతే.. ఎస్‌ఈసీ రాజీనామా చేసి వెళ్లిపొమ్మన్న చంద్రబాబు ఇదే మాట నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు. ఆరోజున నిమ్మగడ్డ ఏం చేసినా ఎందుకు గొప్పగా కనిపించింది. టీడీపీకి కొమ్ముకాసేలా అధికార యంత్రాంగం పనిచేస్తే మొత్తం ప్రపంచం కళకళలాడుతున్నట్లా ఉంటుందా? చంద్రబాబు, టీడీపీ, సొంత మనుషులు బావుంటే చాలనే ఒకే ఒక్క సిద్ధాంతం తప్ప రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బావుండాలని ప్రజలు బావుండాలని ఏనాడైనా కోరుకున్నారా?.

ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేకే టీడీపీ తప్పుడు ప్రచారంకు తెరదీసింది
కుప్పంలో చంద్రబాబుకు ఉన్న బలం... బలుపా? వాపా?
ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏదో అరాచకాలు జరిగిపోవాలని చంద్రబాబు చిత్రీకరించాలని ప్రయత్నించటం సిగ్గు అనిపించటం లేదా అని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మా వాళ్లను కొడుతున్నారని, బెదిరించి నామినేషన్లు వేయించకుండా చేశారని చెప్పటానికి చంద్రబాబుకు సిగ్గు అనిపించటం లేదా అని కన్నబాబు అన్నారు. ఏళ్లపాటు కుప్పం నియోజకవర్గంకు ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబుకు ఉన్న అక్కడున్న బలం బలుపా? వాపా? అని కన్నబాబు ప్రశ్నించారు. 

కుప్పంలో ఏదో జరిగిబోతున్నట్లు ప్రచారం దేనికి బాబు?
చంద్రబాబు చేసే ప్రకటనల్లోనే వైరుధ్యం ఉంది. టీడీపీని నడపటానికి బాబు ఇబ్బందులు పడుతున్నారు
కుప్పంలో నామినేషన్లు వేయనివ్వటం లేదనే దుష్ప్రచారం చంద్రబాబు చేయటాన్ని ఏమనాలని కన్నబాబు ప్రశ్నించారు. ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అక్రమాలు చూసి అలాంటివి ఏమీ జరగకుండా కట్టుదిట్టకుండా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని చంద్రబాబే చెప్పారు. మొన్న ఏమో ఎన్నికల్లో బాయ్‌ కాట్ చేశామని కూడా చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు ఏమో ఆ ఎన్నికల్లో దౌర్జన్యాలు చేసి వైయస్‌ఆర్‌సీపీ గెలిచిందని కూడా చంద్రబాబే చెబుతారు. ఆయనకు ఆయనే వైరుధ్యంగా ప్రకటనలు ఇస్తారు.  అసలు ఒక నిలకడలేని మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీని నడపటానికి పడుతున్న తంటాలు, ఆపసోపాలు ప్రజలకు అర్థమైపోతున్నాయి. 

దౌర్జన్యాలు చేసి ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం వైయస్‌ఆర్‌సీపీకి లేదు
ఈ రాష్ట్రంలో దౌర్జన్యం చేసి ఎన్నికలు గెలవటానికి శ్రీ జగన్ గారికి కానీ వైయస్‌ఆర్‌సీపీలో ఏ ఒక్క నేతకూ లేవు. రాష్ట్రంలో సంక్షేమాన్ని, అభివృద్ధిని చేరవేస్తున్న సీఎం శ్రీ జగన్‌ గారి పట్ల ప్రజలు పెంచుకున్న ప్రేమే అత్యధికంగా మెజార్టీలు రావటానికి, అత్యధికంగా సీట్లు రావటానికి కారణమవుతోంది. ఆ నిజాన్ని గ్రహించలేక ఒక అబద్ధాన్ని చెప్పిందే చెప్పి నిజం అని నిరూపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. అసెంబ్లీ రద్దు చేసుకొని రండి.. అన్ని ఎన్నికల్లో మేమే గెలుస్తామంటారు. మరోవైపు ఏమో.. బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేయరు. చాలా వార్డుల్లో ఎన్నికల కంటే ముందే టీడీపీ అభ్యర్థులు విరమించుకుంటారు. నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ అభ్యర్థులు ఉపసంహరించుకుంటే అదీ వైయస్‌ఆర్‌సీపీ తప్పు చేసిందని చంద్రబాబు మాట్లాడటం సమంజసం కాదని కన్నబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీకి దౌర్జన్యం చేసి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని కన్నబాబు అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలే శ్రీ వైయ‌స్ జగన్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష
గతంలో కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో టీడీపీ ఏం చేసిందో వారికి తెలీదా? అలా వైయస్‌ఆర్‌సీపీ చేయదు
మొన్న కొనసాగిన ఎన్నికలకు 12 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలు కొనసాగింపే అని కన్నబాబు వివరించారు. లేకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, అక్కడక్కడ జరుగుతున్న బై ఎలక్షన్స్‌  కొనసాగింపే ఇది. ఒకవైపున 85%-90% స్థానాలను వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకొంది. ఇప్పుడు 12 మున్సిపల్ స్థానాలకు దౌర్జన్యాలు చేయాల్సిన ఖర్మ వైయస్‌ఆర్‌సీపీకి లేదని కన్నబాబు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆశీర్వదించటానికి ప్రజలు మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లితే తెల్లవారుజామునే పింఛన్, ఇంటికే రేషన్ వాలంటీర్లు ఇస్తున్నారని  శ్రీ జగన్ ప్రబుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని కన్నబాబు తెలిపారు. టీడీపీ చేసిన పనులే వైయస్‌ఆర్‌సీపీ చేస్తోందని అనుమానపడుతోంది. కాకినాడ కార్పొరేషన్‌, నంద్యాల ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎంత దుర్మార్గంగా వ్యవస్థలను వాడుకున్నారని కన్నబాబు మండిపడ్డారు. ఇంటెలిజెన్స్ నుంచి టీడీపీ వాడని వ్యవస్థ లేదని కన్నబాబు మండిపడ్డారు. అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌లా టీడీపీని నడుపుతారు. నిందలేమో వైయస్‌ఆర్‌సీపీపై వేస్తున్నారని కన్నబాబు అన్నారు. చంద్రబాబు నీతి చంద్రికల్ని నమ్మటానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు.  రాజకీయాలకు కాదేదీ కనర్హం అన్నట్లు చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయాలనే ఆలోచనతో బాబు ఉన్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. 

ఎయిడెడ్‌పై చంద్రబాబు దుష్ప్రచారం. రాజకీయ ప్రయోజనం కోసం తప్ప వాస్తవాలేంటో బాబుకు తెల్సు
ఎయిడెడ్ విద్యాసంస్థల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోదని కన్నబాబు అన్నారు. ఎవరైనా ఐచ్ఛికంగా అప్పగిస్తే తప్ప నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ఇంతకుముందు ఎయిడెడ్ సంస్థలు ప్రభుత్వానికి ఇచ్చినా, వెనక్కి అడిగితే ఇచ్చేస్తామని సీఎం శ్రీ జగన్ గారు ప్రకటిస్తే.. దాన్ని కూడా రాజకీయం చేయటంపై కన్నబాబు మండిపడ్డారు. 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లాఠీచార్జీ జరగలేదు అని చంద్రబాబు అనటం ఏంటి? ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఎంతో స్పష్టంగా చెబుతున్నా.. చంద్రబాబు వక్రీకరిస్తున్నారన్నారు. కోతికి కొబ్బరికాయలా రాజకీయ ప్రయోజనం కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. వాస్తవాలేంటో చంద్రబాబుకు తెలీదా అని కన్నబాబు ప్రశ్నించారు. 

పెట్రోల్‌ రేటు వంద పెంచి.. ఆషాఢం డిస్కౌంట్‌లా రూ.10 తగ్గించి పండగ చేస్కో అనటం ఏంటి?
ఇక, పెట్రోల్, డీజిల్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నెమ్మదిగా రూ.100లు దాటించింది. ఆషాఢం డిస్కౌంట్ సేల్‌లా రూ.10లు తగ్గించి పండగ చేస్కోండని అంటున్నారు. ఒక ఇష్యూ దొరికిందని చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది బీజేపీ అయితే.. శ్రీ జగన్ గారిని చంద్రబాబు విమర్శిస్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచింది ఎంత? చంద్రబాబు పెంచింది ఎంతో పారదర్శకంగా చెబుతున్నా వినిపించుకోవటం లేదు. ఒక పార్టీ అడ్డంగా పెట్రోల్, డీజిల్‌గా పన్నులు వేస్తే.. ఇంకో పార్టీ సెస్‌లు వేసి శ్రీ జగన్ ప్రభుత్వంపై నిందలేయటం ఏంటని కన్నబాబు నిలదీశారు. 

వంట గ్యాస్‌ను ఎక్కడ నుంచి ఎక్కడకు తీసుకెళ్లారు?
బీజేపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడటం తగ్గించుకోవాలి

ఇక వంట గ్యాస్‌ సంగతేంటి? మీరు అధికారంలోకి వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో, దేశంలో వంట గ్యాస్ సిలిండర్  ధర ఎంతుంది? ఇప్పుడు ఎంతుంది? వంటింటిపైన బీజేపీ వేస్తున్న భారం ఏమిటి? చంద్రబాబే అనుకుంటే..  బీజేపీ నాయకులు కూడా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రూ.70 ఉన్న పెట్రోల్‌ను రూ.110కు పెంచి రూ.10లు తగ్గించి పండగ చేస్కోండని అంటారు. ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ప్రజలు అనుకుంటారని భ్రమ పడుతున్నారు. పనిలో పనిగా చంద్రబాబు పెట్రోల్‌ బంకుల దగ్గర బంద్‌లు, హర్తాళ్లు అట. ప్రజల్ని ఏదో రకంగా నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కాదు. గతంలో మాదిరిగా ఏమీ లేరు. చాలా అవగాహనతో చైతన్యవంతంగా ఉన్నారు. కేంద్రం ఇచ్చేది ఎంతో, రాష్ట్రం ఇచ్చేది ఎంతో ప్రజలకు తెల్సు అని కన్నబాబు అన్నారు. 

పెట్రోల్‌పై పన్నుల్లో కేంద్రం వాటానే ఎక్కువ. రాష్ట్రాల వాటా తక్కువ
రూ.వంద దాటించింది కేంద్రమే కాబట్టి ఇంకా ధర తగ్గించే బాధ్యత కూడా కేంద్రానిదే

కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీగా రూ.47వేల కోట్లు, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్‌ డ్యూటీ సర్‌ఛార్జి కింద రూ.74,350 కోట్లు, రోడ్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కింద రూ.2 లక్షల కోట్లు, ఇవి కాకుండా ఇతరత్రా పన్నులు కలిపి రూ.15,150 కోట్లు. పెట్రోల్‌, డీజిల్ మీద రూ.3.35 లక్షల కోట్లు కేంద్రం పన్నులు వేస్తోంది. ఇందులో 41% రాష్ట్రాలకు రావాలి. కానీ 29 రాష్ట్రాలకు కలిపి రూ.19,475 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. అంటే 5.8% మాత్రమే ఇస్తున్నారు. రూ.3.34 లక్షల కోట్లు కాకుండా ఎక్సైజ్‌ డ్యూటీ మీద లెక్క కట్టి రూ.19,475 కోట్లు  మాత్రమే ఇస్తున్నారు. ఇదే.. రూ.3.34 లక్షల కోట్ల మీద లెక్కకడితే.. సగానికి ఇంచుమించు రావాలి. అలా ఇవ్వకుండా అడ్డదారుల్లో సెస్‌ వసూలు చేస్తున్నారు. రూ.70ల పెట్రోల్ పెంచి.. ఐదో పది తగ్గిస్తే.. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించిందనే భావన ప్రజల్లో వస్తుందనుకుంటున్నారు. ఇదే సాకుగా తీసుకొని చంద్రబాబు, ఆయన మద్దతుదారులు డ్రామాలు వేస్తున్నారు. ఒక డ్రామాలా టీడీపీ నడుపుతున్నారు తప్ప రాజకీయ పార్టీలా నడపటం లేదు. టీడీపీ బ్రతికుందో, ఎక్కడ ఏ స్థాయిలో ఉందో చంద్రబాబుకు తెల్సు. ఇంత దుర్మార్గంగా చేస్తుంటే.. జీవీఎల్ నరసింహారావు లాంటి వారి ట్వీట్లలోనూ వాస్తవాలు దాచి ట్వీట్లు ఇవ్వటం ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. పెంచింది దానితో పోలిస్తే తగ్గించింది చాలా తక్కువ. ప్రజలు ఏమీ సంతృప్తిగా లేరు. ఇంకా పెట్రోల్‌, డీజిల్ ధరల్ని కేంద్రం తగ్గించాలని కన్నబాబు అన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైయ‌స్‌ జగన్ ముందుకెళ్తున్నారు
బాబు హయాంలో పెట్రోల్‌పై 31%, డీజిల్‌పై 22.5% వ్యాట్‌ వేశారు

రాష్ట్రంలో పేదల, మధ్యతరగతి ప్రజల పక్షాన నిలబడిన నాయకుడుగా సీఎం శ్రీ జగన్ పేరు తెచ్చుకుంటున్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తున్నారు. సంక్షేమంలో సీఎం శ్రీ జగన్‌ గారిని కొట్టేవారే లేరు. ప్రతి కుటుంబానికి సీఎం శ్రీ జగన్ అందించే ఆర్థిక సాయం.. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో డబ్బులు వేశారు. కరోనా సమయంలోనూ చెప్పిన పనిని.. చెప్పిన పథకాన్ని తగ్గించకుండా నడిపారు. ఆ విషయాల్ని మరుగుపడేలా రాజకీయ లబ్ది కోసమే టీడీపీ, బీజేపీ చెరోపక్కన ఇవాళ్టికి రాజకీయ కార్యక్రమం చేశామనటం ఏమిటి అని కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్‌పై 31%, డీజిల్‌పై 22.5% వ్యాట్‌ వేశారు. అదే ఇప్పుడూ కొనసాగిస్తున్నాం. కోవిడ్ సమయంలో కష్టాలున్నాయని లీటరు రూపాయి అదనంగా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వ్యాట్ లేనట్టుగా శ్రీ జగన్ మాత్రమే వేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. మీరు నిజాలు చెబుతారా? దానికోసం ప్రకటనలు ఇచ్చి డబ్బులు వృధా చేస్తారా అంటారు. చంద్రబాబును బాకా ఊదే పత్రికలు అడ్డగోలుగా వక్రీకరణలు చేస్తుంటే ప్రభుత్వం నిజాలు చెప్పాలి కదా. మరి ప్రజలకు నిజాలు ఎలా తెలుస్తాయి. 

చంద్రబాబు కళ్లకు గంతలు కట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నారు. కరోనా వంటి కష్టకాలంలో ఆర్థిక ఒత్తిళ్లు ఎలా ఉన్నా పథకాలు అమలు చేస్తూ.. ఎక్కడ అవకతవకలు లేకుండా జరుగుతున్నాయి. అబద్ధాలు ఇలా వండివార్చకుండా సంయమనం పాటించాలనే సంగతి చంద్రబాబుకు తెలీదా. అంత జ్ఞానం ఉందా? ఏదో ఒకటి ఇవాళ శ్రీ జగన్ గారిని, వైయస్‌ఆర్‌సీపీని తిట్టి నిద్రపోవాలనే ప్రయత్నం తప్ప చంద్రబాబు, టీడీపీ, బీజేపీ వాదనలు అన్నీ డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. గ్యాస్ ధరల సంగతేంటి? గ్యాస్ ధరల్ని అడ్డగోలుగా పెంచారు. ప్రతి మహిళపైనా భారం పడుతోంది. వాటి సంగతేంటని కన్నబాబు నిలదీశారు. 

మంచి చేసినా తప్పుగా చిత్రీకరించటం సరికాదు
సున్న వడ్డీ పథకంపై అవాస్తవాలు ప్రచారం చేయటం ఏంటి? 
ఈ-క్రాప్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో సున్న వడ్డీ రాయితీ వేస్తున్నాం
వ్యవస్థ మంచిగా నడుస్తుంటే వాటిని పక్కదారి పట్టించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారు. దానికి కొన్ని పత్రికలు సహకరిస్తున్నాయి. జీరో వడ్డీ చిక్కిపోయిందని ఈనాడులో కథనం వచ్చింది. తప్పులు జరుగుతుంటే చెబుతారు తప్ప తప్పులు చేయండని ఏ పత్రికా రాయదు. మంచి సిస్టంను వ్యతిరేకించటానికి ఈనాడుకు నోరెలా వచ్చిందో అర్థంకావటంలేదని కన్నబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లక్షలోపు రుణాలకు సున్న వడ్డీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ రైతు పంట పండించారో తెల్సుకోవటం కోసం ఈ క్రాప్ విధానం ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతి రైతు తన పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తే దానికి అవసరమైన ఉచిత బీమా పథకం, వైయస్‌ఆర్‌ పెట్టుబడి సాయం, సున్నా వడ్డీ పంట రుణాల సదుపాయం, మార్కెటింగ్ సౌకర్యం నిజమైన రైతులకు అందాలని ఈ క్రాప్‌ పెట్టి రైతాంగానికి అనుసంధానం చేయటం జరిగింది. ఆ ప్రకారం చేసిన తర్వాత సున్న వడ్డీ పంట రుణాల మొత్తం తగ్గింది. దీనికి అమెరికా, హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేసుకుంటూ.. రైతు కాని వారు భూములు చూపించుకొని రుణాలు తీసుకుంటున్నారు. ఈ క్రాప్ ప్రకారం ఖరీఫ్  పంట రుణాలు తీసుకొని (2020-21) సకాలంలో చెల్లించిన వారు 6.67 లక్షల మందని తేలింది. దానికి రూ.112.71 కోట్లు రైతుల పొదుపు ఖాతాల్లో వేయటం జరిగింది. 2019 సీజన్‌ ప్రారంభమైనప్పుడు 17 నవంబర్ 2020న 14.26 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ కింద 289.68 కోట్లు వారి ఖాతాల్లో వేయటం జరిగింది. 2021 ఏప్రిల్ 20న 5.56 లక్షల మందికి రూ.98.36 కోట్లు చెల్లించాం. మళ్లీ ఆగస్టులో 6.67 లక్షల మంది రైతులకు రూ.112 కోట్లు చెల్లించాం. ఈ పంట నమోదు చూస్తే సుమారు 3.51 లక్షల రైతులు ఈ క్రాప్‌తో వ్యాలిడేషన్ కాలేదు. వారు నిజంగా పంటలు పండించటం లేదు. వారిని తగ్గించిన తర్వాత వచ్చిందే 6.67 లక్షలు. ఈ 6.67 లక్షల మందిని వదిలేసి 3.51 లక్షల మందికి సున్న వడ్డీ ఇస్తే చంద్రబాబు, ఈనాడు  ప్రశ్నించవచ్చు. కానీ రైతుల ముసుగులో రుణాలు తీసుకుంటే వాటిని కట్టడి చేస్తే తిడుతున్నారు. ఇదేమిటో అర్థం కావటం లేదు. మంచి చేస్తుంటే తిడుతున్నారని కోతలు విధించారని తిడుతున్నారని కన్నబాబు ఆశ్చర్యం వేసింది. 

బాబు ఇవ్వని వడ్డీ రాయితీని వైయ‌స్‌ జగన్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది
చంద్రబాబు హయాంలో చూస్తే 2014-15లో రూ.45.33 కోట్లు, 2015-16లో రూ.31.97 కోట్లు, 2016-17లో రూ.254 కోట్లు, 2017-18లో 187కోట్లు, 2018-19లో రూ.167 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చారు. అంటే వారు ఇచ్చింది ఎంతో చూడండి. 2014-18 వరకు టీడీపీ ప్రభుత్వం రైతులకు రూ.1180 కోట్లు బకాయిలు పడింది. ఈ మొత్తాన్ని శ్రీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 38.42 లక్షల మంది రైతులకు 688.28 కోట్లు డీబీటీ ద్వారా చెల్లించారు. చంద్రబాబు ఎగ్గొడితే.. ఆ బాకీలు శ్రీ జగన్ ఇస్తే ఆయన్ను విమర్శించటం ఏంటని కన్నబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదైనా రాసేటప్పుడు మూలాల్లోకి వెళ్లరా? వాస్తవాలు ఏంటో చెప్పరా అని కన్నబాబు నిలదీశారు. 

వైయ‌స్‌ జగన్ గ్రాఫ్‌ పెరుగుతుంటే ఓర్వలేక చంద్రబాబు అండ్‌ కో బురద జల్లుతున్నారు
వైయ‌స్ జగన్ ప్రభుత్వంపై ఈర్ష్య, అసూయ ద్వేషం రోజురోజుకీ చంద్రబాబు, ఆయన మద్దతుదారుల్లో పెరిగిపోతోంది. ఎందుకంటే ఎవరైనా అధికారంలో వచ్చిన తర్వాత గ్రాఫ్ పడిపోతుంది. కానీ శ్రీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన గ్రాఫ్‌ పెరుగుతూ పోతోంది. అందుకనే శ్రీ జగన్ గారి మీద ద్వేషం, అసూయ, బాధ, కోపం, ఉక్రోషం చంద్రబాబుకు పెరిగిపోతోంది. పెట్రోల్‌,డీజిల్‌ ధరల్ని కేంద్రం పెంచితే.. రాష్ట్రంలో శ్రీ జగన్ గారిని చంద్రబాబు విమర్శించటం ఏంటని కన్నబాబు మరోసారి నిలదీశారు. వడ్డీ రాయితీ కింద రైతులకు అన్యాయం జరగకుండా సిస్టంలు సరిచేసి, చంద్రబాబు పెట్టిన బకాయిల్ని రైతుల ఖాతాల్లోకి నేరుగాజమ చేసి వైయ‌స్‌ జగన్‌ గారు తీరిస్తే దాన్ని కూడా తప్పు పట్టడం ఏంటని కన్నబాబు ప్రశ్నించారు. 

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ నాయకత్వంలో ఎస్‌ఈసీ ఎలా పనిచేసిందో రాష్ట్రమంతా చూశారని కన్నబాబు అన్నారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే చంద్రబాబు తిట్టడం సరికాదని కన్నబాబు హితవు పలికారు. టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తే అంతా సుభిక్షంగా ఉన్నట్లు లేకపోతే మిగతా వారంతా మనుషులు కాదు, వ్యవస్థలు కానట్టు చంద్రబాబు, టీడీపీ చిత్రీకరించాలని చూస్తున్నారని కన్నబాబు మండిపడ్డారు.  

Back to Top