సీబీఐ విచారణకు నేను రెడీ.. నా సవాల్‌కు మీరు సిద్ధమా..?

సోమిరెడ్డి, టీడీపీ నేతలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌

రేవ్‌ పార్టీలో నాకు సంబంధించిన వారు ఉన్నారని నిరూపించగలరా..? 

రేవ్‌ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ నేత సోమిరెడ్డిది

మీడియా సమక్షంలో రేపు బ్లడ్‌ శాంపిల్స్‌ ఇస్తా.. సోమిరెడ్డి ఇవ్వడానికి సిద్ధమేనా..?

మహిళా డాక్టర్‌ను ఏ విధంగా సోమిరెడ్డి హింసించాడో జమీన్‌ రైతు పత్రికలో రాశారు 

నా స్టిక్కర్‌ కలర్‌ జిరాక్స్‌ తీపించి సోమిరెడ్డే కుట్ర చేశాడా..? అని నా అనుమానం

విజయవాడ: ‘నాపై రెండు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి, మూడోసారి కూడా ఓడిపోబోతున్నాడని తెలిసి, అక్కసుతో నాపై దుష్ప్రచారం చేస్తున్నాడు, రేవ్‌ పార్టీలు, రేప్‌ పార్టీలకు వెళ్లే అలవాటు టీడీపీ నేత సోమిరెడ్డికే ఉంది’ అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. అసలు సోమిరెడ్డిది నోరేనా, మనిషి జన్మేనా అని అనుమానం కలుగుతుందన్నారు. బెంగ‌ళూరు రేవ్‌ పార్టీలో తన, తనకు సంబంధించిన వాళ్లు, తన బంధువుల పాత్ర ఉన్నట్లు నిరూపించాలని సోమిరెడ్డికి, టీడీపీ నేతలకు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. రేవ్‌ పార్టీపై తనపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి కాకాణి తీవ్రంగా ఖండించారు. 

మంత్రి కాకాణి ఇంకా ఏం మాట్లాడారంటే..
జమీన్‌ రైతు అనే పత్రికలో 2019లో సోమిరెడ్డి గురించి ఒక ఆర్టికల్‌ రాశారు. ‘మన ఎమ్మెల్యేల్లో ఇంతటి నీచులు ఉన్నారా..? ఎమ్మెల్యేలలో కామ పిశాచి’ అని సోమిరెడ్డి గురించి ఆర్టికల్‌ రాశారు. ఇది సోమిరెడ్డి జీవిత చరిత్ర. మహిళా డాక్టర్‌ను ఏ విధంగా హింస పెట్టాడో ఆ ఆర్టికల్‌ రాశారు. సోమిరెడ్డి లాంటి నీచుడి వల్ల ఎంతోమంది మహిళలు రోడ్డుకెక్కారు, ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి, ఎంతోమంది కుటుంబ సభ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మాట మాట్లాడేముందు స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం సోమిరెడ్డి నేర్చుకోవాలి.  

బెంగ‌ళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి నా పాత్ర, నాకు సంబంధించిన వారి పాత్ర, నా బంధువుల పాత్ర ఏమైనా ఉందా..? ఎక్కడైనా ఒక ఆధారం ఉందా..? ఏ ఆధారం లేకుండా సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేస్తున్నాడు. రేవ్‌ పార్టీలో నా పాస్‌పోర్టు దొరికిందని మాట్లాడుతున్నాడు.. నా పాస్‌పోర్టు మీడియాకు చూపించాను.. దొరికిన పాస్‌ పోర్టు మీడియాకు చూపించే ధైర్యం సోమిరెడ్డికి ఉందా..? గోవర్ధన్‌రెడ్డి కారు అని మాట్లాడుతున్నాడు.. నా స్టిక్కర్‌ కలర్‌ జిరాక్స్‌ తీపించి సోమిరెడ్డే కుట్ర చేశాడా..? అనే అనుమానం కలుగుతుంది. నీచ చరిత్ర కలిగిన సోమిరెడ్డి నాపై ఆరోపణలు చేస్తున్నాడు. 

సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా.. రేవ్‌ పార్టీలో నాకు సంబంధించినవాళ్లు ఉన్నారని నిరూపించాలి, మీకు చేతనైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు కూడా నేను సిద్ధం. సోమిరెడ్డికి 24 గంటలు సమయం ఇస్తున్నా.. నా బ్లడ్‌ శాంపిల్‌ ఇస్తా.. నువ్వు శాంపిల్‌ ఇవ్వడానికి సిద్ధమేనా..? రేపు మీడియా సమక్షంలోనే నెల్లూరులోనే బ్లడ్‌ శాంపిల్స్‌ ఇద్దాం.. ఎవరు నీతిమంతుడు, ఎవరు తాగుబోతు అనేది అర్థం అవుతుంది’ అని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. 
 

Back to Top