విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని ధ్వజమెత్తారు. నారా లోకేష్ గన్నవరం సభ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలను తిట్టడం కోసమే పెట్టినట్టుగా ఉందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా అసభ్యంగా మాట్లాడి కార్యకర్తలను రెచ్చగొట్టడమే తండ్రీకొడుకులు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. తాను కరకట్ట మీదున్న అక్రమ నివాసం వద్దకు వెళ్తే చంద్రబాబు పారిపోయాడనే విషయాన్ని లోకేష్ గుర్తుపెట్టుకోవాలన్నారు. లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. పాదయాత్ర అంటే ఏంటో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైయస్ జగన్ చేసిన పాదయాత్రల వీడియోలు చూసి నేర్చుకోవాలన్నారు. నడవలేని వృద్ధులు సైతం వైయస్ జగన్ పాదయాత్రకు వచ్చారని గుర్తుచేశారు. తండ్రీకొడుకులు యాత్రలు చేసినా, పవన్ వారాహి యాత్రలు చేసినా అధికారంలోకి రాలేరన్నారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ భీమవరంలో, చంద్రబాబు కుప్పంలో ఒంటరిగా పోటీ చేయాలని మంత్రి జోగి రమేష్ సవాల్ విసిరారు.