తాడేపల్లి: పోలవరం మాదిరిగానే.. అమరావతిని కూడా చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నాడు.. అమరావతి పేరు చెప్పి అమెరికా వరకు చంద్రబాబు దోపిడీకి తెగబడ్డాడు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. అమరావతి పాదయాత్ర కాదు.. అది చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీ శవయాత్ర అన్నారు. అమరావతి ముసుగులో కొంతమంది పనిగట్టుకొని రాజకీయ యాత్రలు చేస్తున్నారని, సెలెక్ట్ చేసి, ఎలెక్ట్ చేసి, కలెక్ట్ చేసే దిక్కుమాలిన యాత్రకు తెరతీశారన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని, చంద్రబాబుకు తాళ్లు, మోకులు కట్టి బుల్డోజర్లు, క్రేన్లతో లాగినా లేవలేకపోతున్నాడని అమరావతి పేరుతో రాజకీయ యాత్రను సృష్టించారన్నారు. తాడేపల్లిలోని వైయస్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ ఏం మాట్లాడారంటే..
‘‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని రాష్ట్రమంతా ముక్తకంఠంతో చెబుతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు, కోస్తాంధ్ర ప్రజలు.. అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి. అన్ని ప్రాంతాల్లోని ప్రజలు అన్నదమ్ములు వలే కలిసి బ్రహ్మాండంగా ముందుకువెళ్లాలని సీఎం వైయస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భావితరాల భవిష్యత్ కోసం, రాబోయే రోజుల్లో ప్రాంతాల మధ్య విభేదాలు, ప్రజల మధ్య అసమానతలు, ఉద్యమాలు రాకుండా విశాలమైన హృదయంతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు పలికారు.
2019 ఎన్నికల తరువాత ఏ ఎన్నిక జరిగినా.. అది విజయవాడ గడ్డ అయినా, గుంటూరు గడ్డ మీద అయినా కూడా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. అంటే అన్నీ ప్రాంతాల ప్రజలు సీఎం వైయస్ జగన్ నిర్ణయాన్ని శభాష్ అని మెచ్చుకుంటూ మద్దతు తెలిపారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం జరిగిందని ఆమోదం తెలిపారు.
ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, అమరావతి పేరును ఏటీఎంగా మార్చుకున్నాడు. అధికారంలో ఉన్నప్పుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి దోచుకుతిన్నాడు. ఈరోజు మళ్లీ అదే అమరావతి పేరుతో కోట్లు దండుకుంటున్నాడు. అమరావతి పేరు చెప్పి అమెరికా వరకు వసూళ్లకు తెరలేపాడు. అమెరికా వెళ్లి అమరావతిని నాశనం చేశారు.. మన సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకుంటూ చందాల పేరుతో దోచుకుతింటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని ఎలా ఏటీఎంగా మార్చుకున్నాడో అలాగే అమరావతిని కూడా ఏటీఎంగా మార్చుకొని అమెరికా వరకు దండుకుంటున్నాడు. అధికారంలో ఉన్నప్పుడూ దోపిడే.. లేకపోయినా దోపిడే.. అమరావతి ఉద్యమంలో ఆడవారు ఎందుకు..? మగవారు, రైతులు లేరా..? చంద్రబాబు సెలక్ట్ చేసినవారంతా ఎవరూ..? ఏ కులం, ఏ సామాజిక వర్గం..? చంద్రబాబు ఒక సామాజిక వర్గాన్ని అడ్డంపెట్టుకొని దారుణంగా వ్యవహరిస్తున్నాడు.
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా సంతోషంగా ఉన్నారు. మా కుటుంబం బాగుందని, సీఎం వైయస్ జగన్ పాలనలో మా పిల్లలు చదువుకుంటున్నారని, మాకు చేయూత, ఆసరా, రైతుకు భరోసా కల్పిస్తున్నాడని ప్రజలంతా భావిస్తుంటే.. చంద్రబాబు అమరావతి పేరుతో డ్రామాలు ఆడుతున్నాడు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కావాలని బాబు ప్రయత్నం. అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎవరికి ఉపయోగం. ప్రజలంతా సీఎం వైయస్ జగన్ పక్షాన నిలబడ్డారు. దళారీ వ్యవస్థ లేకుండా, వివక్ష లేకుండా బటన్ నొక్కగానే డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయని సంతోషపడుతున్నారు. చరిత్ర పుటల్లో సీఎం నిలిచిపోతారని ప్రజలంతా భావిస్తున్నారు’’ అని మంత్రి జోగి రమేష్ అన్నారు.