దమ్మూ, ధైర్యం ఉంటే అవినీతి నిరూపించు..

చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్‌ సవాల్‌

కోర్టులకు వెళ్లి తెచ్చుకున్న స్టేలు విత్‌ డ్రా చేసుకునే దమ్ము బాబుకు ఉందా..?

వచ్చే డిసెంబర్‌ నాటికి డీబీటీ ద్వారా సాయం రూ.2 లక్షల కోట్లకు చేరుతుంది

సెప్టెంబర్‌ 1వ తేదీన అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి

14 ఏళ్ల చంద్రబాబు పాలనలో గురించి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా..?

వల్లకాటికి వెళ్లిపోతున్న టీడీపీని లేపేందుకు ఎల్లో మీడియా ప్రయత్నం

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు వైయస్‌ఆర్‌

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని లాక్కున్న సెప్టెంబర్‌ 1వ తేదీని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడని, నిసిగ్గుగా, నిర్లజ్జగా మళ్లీ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతున్నాడని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. సెప్టెంబర్‌ 1వ తేదీని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలన్నారు. వల్లకాటికి వెళ్లిపోతున్న తెలుగుదేశం పార్టీని తాళ్లు, బుల్డోజర్లు, జేసీబీలతో లేపాలని పచ్చపత్రికలు, ఛానళ్లు తాపత్రయపడుతున్నాయని, టీడీపీని లేపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘సెప్టెంబర్‌ 1వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టి 27 సంవత్సరాలు అయ్యిందట. దాన్ని పండగ చేసుకుంటున్నాడు. 27 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును వెన్నుపోటు పొడిచి.. ఆ పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కి పండగ చేసుకుంటూ.. మళ్లీ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతున్నాడు. నిసిగ్గుగా, లజ్జగా.. నికృష్టుడు, దుర్మార్గుడు, దుష్టుడు.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున రోజును పండుగ చేసుకుంటున్నాడు. ఇది న్యాయమా..? ప్రజలంతా గమనించాలి. 

సెప్టెంబర్‌ 2వ తేదీ వైయస్‌ఆర్‌ వర్ధంతి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం అంటూ చంద్రబాబు డ్రామా మొదలుపెట్టాడు. మనసున్న మనిషి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయి.. 13 సంవత్సరాలు గడుస్తున్నా.. ఆయన్ను గుండెల్లో పెట్టుకొని సెప్టెంబర్‌ 2వ తేదీన ఆ మహనీయుడికి ఊరువాడా, ప్రపంచంలోని తెలుగు ప్రజలంతా జ్ఞప్తికి తెచ్చుకుని నివాళులర్పిస్తారు. 5 సంవత్సరాల 3 నెలల కాలమే ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినా.. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మహోన్నత కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో దేవుడిగా కొలువయ్యారు.

రూ.2 లక్షల కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడుతున్నాడు.. చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నా.. దమ్ముంటే, సత్తా ఉంటే అవినీతి నిరూపించాలని ఛాలెంజ్‌ చేస్తున్నా. డైరెక్ట్‌ బెనిఫిట్‌ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ప్రజలకు అందించే సాయం వచ్చే డిసెంబర్‌ నాటికి రూ.2 లక్షల కోట్లకు చేరుతుంది. సీఎం బటన్‌ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల అకౌంట్లోకి డబ్బులు వెళ్లే పరిస్థితి. చంద్రబాబు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా కలలోనైనా చేశాడా..? ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్లు ప్రజలకు చేరువయ్యాయి. 

శాండ్, మైన్, వైన్‌ దోపిడీ జరిగింది చంద్రబాబు ప్రభుత్వంలోనే. అవినీతి మీద కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నాడు. స్టేలు విత్‌ డ్రా చేసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా..?  బాబు అవినీతి మీద సీబీఐ ఎంక్వైరీ కోరుతే జైలుకు వెళ్లడం ఖాయం. సెప్టెంబర్‌ 1ని అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా జరపాలి. వైయస్‌ఆర్‌ను ప్రజల గుండెలనుంచి చంద్రబాబు తొలగించలేడు. ఆ మహనీయుడి పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు వంటి పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదు’ అని మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top