అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరని గ్రహించి చంద్రబాబుకు అమ్ముడబోయారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర అన్నారు. జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయన్నారు. 72 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలోనే మూడేళ్ల వైయస్ జగన్ పాలనలో అన్ని ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. 4బీ అప్లికేషన్ జీయో ట్యాగ్ చేసే విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు త్వరితగతిన నిర్మిస్తామన్నారు. కాలనీల నిర్మాణాలు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కూడా గౌరవ ప్రదమన్నారు. మా నియోజకవర్గంలో ఇన్ని ఇళ్లు నిర్మించామని శాశ్వతంగా గుర్తుకు ఉండేలా ఉండే కార్యక్రమం. ఇది ఒక యజ్ఞం. ఈ కార్యక్రమంలో ఎన్ని అవరోధాలు, అడ్డంకులు, కోర్టుకు వెళ్లి కేసులు వేశారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని అడ్డుపడిన ఘటనలు మనం చూశాం. చంద్రబాబు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎక్కడో ఏదో ఎన్నిక జరిగితే..దానికి గుర్తు లేదు. పార్టీ సింబల్ లేదు. ఆ ఎన్నికలో గెలిచి ఏదో సంబరాలు చేసుకుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లు భ్రమలో ఉన్నారు. నిన్న జరిగిన ఎన్నికలో కూడా ప్రలోభాలు, మేనేజ్ చేయడం చూశాం. ఇంతకు ముందు వైయస్ఆర్‌సీపీ తరఫున 23 మంది ఎమ్మెల్యేలను దొడ్డిదారిన అమ్ముడపోయినా, తొణకని, బెణకని వైయస్ జగన్ నాయకత్వంలో మళ్లీ 151 స్థానాల్లో గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు కొనుగోలు చేస్తారు..అమ్ముడపోతారు. ఏ పార్టీ గుర్తు లేకుండా, సింబల్ లేకుండాగెలిచి సంకలు గుద్దుకుంటున్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో 2024లో వైయస్ఆర్‌సీపీ విజయదుందుబి మోగించబోతోంది. మళ్లీ వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాసి పెట్టుకోండి. చంద్రబాబు ఎలా వ్యవస్థలను మేనేజ్ చేశారో చూశాం. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేలను ఏ విధంగా ప్రలోభపెడుతారో అందరం చూశాం. వైయస్ జగన్ తమకు సీటు ఇవ్వరు అనుకున్న ఎమ్మెల్యేలే చంద్రబాబుకు అమ్ముడబోయారు. ఈ రోజు సంబరాలు చేసుకుంటున్నారు..కేరింతలు కొడుతున్నారు. కానీ వైయస్ఆర్‌సీపీ కంచుకోటను ఇంచుకూడా కదిలించలేదు. చంద్రబాబు కాదు..ఆయన అబ్బ వచ్చినా కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరని మంత్రి జోగి రమేష్ అన్నారు.