అనకాపల్లి: ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ డ్వాక్రా సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అనకాపల్లి మండలం తుమ్మపాలెం మేజర్ గ్రామ పంచాయతీలో మూడో విడత వైయస్‌ఆర్ ఆసరా కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనకాపల్లి మండలంలో 19,468 మంది పొదుపు సంఘాల లబ్ధిదారులకు 13.92 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో డ్వాక్రా సంఘాల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన హామీని సీఎం వైయస్ జగన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి మహిళ ధైర్యంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మహిళలను నమ్మించి మోసం చేశాడని మంత్రి అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పలేదని బుకాయించి మహిళలను నిలువునా ముంచాడని చంద్రబాబుపై మండిపడ్డారు. అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత తదితర పథకాల ద్వారా అర్హత గల వారందరికీ లబ్ధి చేకూరుస్తూ మహిళా పక్షపాతిగా నిలిచిన సీఎం వైయస్ జగన్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మహిళలందరిపై ఉందని మంత్రి అమర్‌నాథ్ విజ్ఞప్తి చేశారు. నాడు నేడు పథకం కింద పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మేలు చేకూర్చుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్య ,వైద్య రంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచ బ్యాంకు అధికారులు కొనియాడిన విషయాన్ని ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 65 లక్షల మందికి పెన్షన్ లు అందజేస్తున్నామని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు.కార్యక్రమం అనంతరం సీఎం వైయస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.