అసెంబ్లీ: విశాఖలో నిర్వహించిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్ర భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నాడని, కానీ, వచ్చే తరాల కోసం ఆలోచించే నాయకుడు సీఎం వైయస్ జగన్ అని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడారు. ‘‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. 25 దేశాల నుంచి ప్రతినిధులు జీఐఎస్‌కు వచ్చి ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన దిగ్గజ పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం. సింగిల్ విండో ద్వారా రికార్డు వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. జీఐఎస్‌లో కుదుర్చుకున్న ఎంవోయూల ద్వారా రాష్ట్రంలో కొత్తగా 6 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టిసారించాం. దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి వస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. ముఖేష్ అంబానీ, అదానీ రాష్ట్రానికి వస్తే టీడీపీకి వచ్చిన బాధేంటో అర్థం కావడం లేదు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదు. సీఎం వైయస్ జగన్ బ్రాండ్ చూసి రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. రాష్ట్రంలోని వైయస్ జగన్ ప్రభుత్వ పాలనపై పారిశ్రామిక వేత్తలకు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టే పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఒక చరిత్రాత్మకమైన కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ మంత్రిగా నడిపించినందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సీఎం వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు. దేవుడి ఆశీస్సులు, ప్రజల దీవెనలతో, పారిశ్రామిక వేత్తల సహకారంలో పారిశ్రామికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటిస్థానంలోకి వెళ్లేందుకు అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం’’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు.