మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం

బాబు డైరెక్షన్‌లో పాదయాత్ర పేరుతో విశాఖ మీదకు దండయాత్ర 

విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే దానికి బాబే కారకుడు

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే పోలీసులు అనుమతి నిరాకరించారు

అమరావతి రాజధాని కాదని మా పార్టీ, మా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేదే సీఎం వైయస్‌ జగన్‌ ఆకాంక్ష

తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకున్నాడు

బాబు మాటలు వింటే కులీ కుతుబ్‌ షా ఉరేసుకుంటాడు

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల మీద దండయాత్రకు వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, అమరావతి వాసుల పాదయాత్ర వల్ల విశాఖలో ఎలాంటి అల్లర్లు, అలజడి ఏర్పడినా దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు డైరెక్షన్‌లో అమరావతి టు అరసవెల్లి పాదయాత్ర చేపట్టారని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆ యాత్రకు పోలీసులు అనుమతులు నిరాకరించారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా చేసే పాదయాత్రను ఉత్తరాంధ్ర ప్రజలు హర్షించరని, పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఊరుకోరన్నారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని, ప్రజలకు ఆమోదయోగ్యమైన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. 

విశాఖలో మంత్రి అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రాంతంపై చంద్రబాబు, ఆయన తాబేదారులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పార్టీ ఆఫ్‌ ఇండియా (సీపీఐ) చీఫ్‌ రామకృష్ణ, చంద్రబాబు కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి లాంటి వ్యక్తులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ ఏం మాట్లాడారంటే..

‘‘తెలంగాణ ప్రాంతం కోసం, ఉద్యమం కోసం, రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందో గుర్తుచేసుకోవాలి. తెలంగాణ ప్రాంతం కంటే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలు మరింత వెనుకబాటుతనంలో ఉన్నాయి. వాటికి మేలు జరగాలంటే కమిటీ ఇచ్చిన రిపోర్టును గుర్తుచేసుకోవాలి. అలాంటి ఉత్తరాంధ్ర, రాయలసీమకు గుర్తింపు తెచ్చేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని తీసుకుంటే.. దాని మీద ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, మంచి జరగకుండా తనకున్న మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చూశాం. 

అమరావతిలో నూతనంగా రాజధాని నిర్మాణం చేసి.. గతంలో చంద్రబాబు ఇచ్చిన రిపోర్టు ప్రకారమే 50 వేల ఎకరాలకు సంబంధించి రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు చేయాలని డీపీఆర్‌ ఇచ్చారు. అంటే 29 గ్రామాల్లోని 50 వేల ఎకరాలు తప్ప.. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేందకూడదా..? రాష్ట్రంలోని నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. అందుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పిల్లల భవిష్యత్తు మారుతుంది. రాష్ట్రంలోని ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో ఉన్న కేంద్రానికి, మిగిలిన రాష్ట్రాలకు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ ఆదర్శంగా నిలిచాయి. ఈ డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడితే.. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ప్రపంచ ఖ్యాతి పొందిన రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు ఇవేవీ అవసరం లేదా..? 

లక్ష కోట్ల రూపాయలు తీసుకెళ్లి 29 గ్రామాల మీద ఖర్చు చేస్తే చాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ, ఈ రాష్ట్రంలోని ఉన్న అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గుర్తింపు తీసుకురావాలి, ప్రజలకు మేలు జరగాలి, అన్ని ప్రాంతాలతో పాటు ఆ 29 గ్రామాలూ అనేది మా ప్రభుత్వ విధానం. అంతేతప్ప 29 గ్రామాలు మాత్రమే అభివృద్ధి చెందాలనేది ఈ ప్రభుత్వ విధానం కాదు. అమరావతి రాజధానిగా ఉండదని ఏరోజూ వైయస్‌ఆర్‌ సీపీ చెప్పలేదు. అమరావతి కూడా ఉంటుందనే మాట మా ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ సీపీ చెప్పింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందనేది వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ విధానం. 

పాదయాత్ర చేస్తామని, ఉత్తరాంధ్ర ప్రాంతం మీద దండయాత్ర చేస్తామని మాట్లాడుతున్నారు. విశాఖ ప్రాంతానికి రాజధాని వద్దు అని చెప్పిన తరువాత చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ప్రజలు వెనక్కు పంపించారు. విశాఖ ప్రాంత ప్రజల మీద దండయాత్రకు వస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. కోర్టులో అనుమతి వచ్చిందని ఇప్పుడే విన్నాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని వారు కోర్టుకు చెప్పి ఉండకపోవచ్చు. అఫిడవిట్‌లో అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని చెప్పి ఉంటారు. విశాఖలో జరిగే పరిణామాలకు బాధ్యత చంద్రబాబుదే అని గుర్తుపెట్టుకోండి.

చలిచీమలకు రెక్కలు వచ్చినా, గాడిదకు కొమ్ములు వచ్చినా, ముసలివాడికి పిచ్చి వచ్చినా ఎక్కువకాలం నిలబడవని విశాఖ ప్రాంతంలో ఒక సామెత ఉంది. హైదరాబాద్‌ నేనే కట్టానని పిచ్చిపట్టినట్టుగా చంద్రబాబు మాట్లాడుతుంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు.. చివరకు చార్మినార్‌ కూడా నేనే కట్టాను అని చంద్రబాబు చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు మాటలు వింటే కుతుబ్‌ షా కూడా ఉరివేసుకుంటాడు. 

హైటెక్‌ సిటీ నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశాడు. ఆ బిల్డింగ్‌ నిర్మాణం జరిగింది.. దానికి కొబ్బరికాయ కొట్టినందుకు హైటెక్‌సిటీ నేనే కట్టానని చంద్రబాబు చెబితే ఎలా..? నిజంగా బాబు వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెంది ఉంటే తెలంగాణలో నీ పార్టీ పరిస్థితి ఏంటీ..? గడిచిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఊసే లేదు. చివరకు హైదరాబాద్‌లో మిగిలింది ఎన్టీఆర్‌ భవన్, దాని వాచ్‌మన్‌ తప్ప.. ఏమీ లేదు. మంచిచేస్తే మన గురించి నలుగురు చెప్పుకోవాలి తప్ప.. మన గురించి మనమే చెప్పుకునే నాయకుడిని చంద్రబాబును మాత్రమే చూస్తున్నా. 

ఈ రాష్ట్రంలోని పేదల బతుకులతో రియలెస్టేట్‌ చేయొద్దు. అమరావతి అనేది వివాదం.. వాస్తవం ఏంటంటే.. పేదవాడిని చంపి ఉన్నవాడిని పైకి తీసుకురావాలనే చంద్రబాబు ఆలోచన వాస్తవం అని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కనీసం 20–30 మీటర్లు పునాదులు తవ్వితే తప్ప పిల్లర్లు వేసుకోలేని పరిస్థితుల్లో అమరావతి ఉంది. అమరావతితో పాటు గుంటూరు, విజయవాడ ప్రాంతాలను కూడా చంద్రబాబు అన్యాయం చేశాడు. 

చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను ఏపీ ప్రజలకు దూరం చేశాడు. బాబు మాత్రం సొంతిల్లు కట్టుకొని దగ్గరయ్యాడు. ఏపీలో సొంత ఇల్లు కూడా లేని నాయకుడు చంద్రబాబు. ఓటు లేని, కనీసం ఒక ప్రాంతం గుర్తించలేని వ్యక్తులను తీసుకువచ్చి.. ప్రసంగాలు చేసి విశాఖ మీద దండయాత్ర చేయడానికి వస్తే ఈ ప్రాంత ప్రజలు చూస్తూ ఊరుకోరు. పాదయాత్ర ముసుగులో విశాఖలో అల్లర్లు సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. దానికి బాధ్యడు చంద్రబాబే’ అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. 

 

Back to Top