విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని వనరులను, అవకాశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధ్యక్షతన ప్రపంచస్థాయి వేదికపై వివరించామని, మూడు ప్రధానమైన సంస్థలు దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. దావోస్ పర్యటనలో అనేక సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌లో చర్చించారని, ప్రపంచస్థాయి వేదికలపై రాష్ట్ర ప్రగతిని ఫోకస్ చేశామన్నారు. విశాఖను యూనికార్న్ హబ్‌గా తయారుచేయాలనే లక్ష్యంతో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ చర్చించారన్నారు. గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దావోస్ పర్యటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వైయస్ జగన్ ప్రపంచస్థాయి వేదికపై వివరించారు. ఐదు రోజుల పాటు జరిగిన సదస్సులో మన రాష్ట్రానికి సంబంధించిన పెవిలియన్‌ను దావోస్‌లో ఏర్పాటు చేశాం. అనేకమంది ప్రపంచస్థాయి ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు వచ్చి సీఎంను కలిశారు. ఏపీలోని వనరులు, అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని సీఎం వైయస్ జగన్ వారికి వివరించారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీకి అవకాశం ఉన్న విశాఖపట్టణాన్ని యూనికార్న్ హబ్‌గా చేయాలని.. మనదేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నూతనంగా ఆవిర్భవించిన ఈజ్ మైట్రిప్, ఓయో రూమ్స్ సంబంధించిన వారు, స్టార్టప్స్ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో బ్రేక్‌ఫస్ట్ మీటింగ్‌ను సీఎం వైయస్ జగన్‌తో ఏర్పాటు చేశాం. విశాఖలో ఆదిత్య మిట్టల్ రూ.1000 కోట్లతో వారి ప్రాజెక్టును విస్తరించబోతున్నారు. ఇది త్వరలోనే జరగబోతుంది. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం కాంగ్రెస్‌లో ప్రపంచస్థాయి నాయకులతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. మూడు ప్రధాన అంశాలపై సీఎం వైయస్ జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్‌లో సీఎం వైయస్ జగన్ సుదీర్ఘంగా చర్చించారు. హెల్త్ సిస్టమ్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్, డీకార్బోనైజ్డ్ ఎకానమీ మీద ప్రపంచస్థాయి ప్రతినిధులతో సీఎం చర్చించారు. డీకార్బోనైజ్డ్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ ఇవాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా నిర్వహించాం. ఇందులో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఆదిత్య మిట్టల్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, డీకార్బోనైజ్డ్ ఎకానమీకి ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచి కాబోతుందని వివరించాం. దావోస్ టూర్‌కు ముందు కర్నూలులో సీఎం వైయస్ జగన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇది దాదాపు 5200 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు. దావోస్‌లో ప్రధానంగా డీకార్పోనైజ్డ్ ఎకానమీకి సంబంధించి అదానీ, గ్రీన్‌కో, అరబిందో మూడు ప్రధానమైన ఇండస్ట్రీస్ దాదాపు రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ చేసుకున్నాయి. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ 5200 మెగావాట్ల కెపాసిటీ. రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన డీపీఆర్ ప్రకారం ఆంధ్రరాష్ట్రంలో పంప్ స్టోరేజ్, సోలార్, విండ్ ప్రాజెక్టులు చేయడానికి దాదాపు 29 ప్రాంతాలను ప్రభుత్వం గురించింది. తద్వారా 30 వేల మెగావాట్లు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందని సదస్సులో సీఎం చెప్పారు’’ అని మంత్రి గుడివాడ అమర్ వివరించారు.