త‌ప్పు చేస్తే చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు

 రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు 

కొవ్వొత్తుల ర్యాలీల‌తో నిజాలు దాగిపోవు 
 
త‌ప్పు చేయ‌క‌పోతే చంద్ర‌బాబు,లోకేశ్ పీఏలు ఎందుక‌ని విదేశాల‌కు పారిపోయారు ?

శ్రీ‌కాకుళం: త‌ప్పు చేస్తే చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గార మండలం, కొత్తూరు సైరిగాం గ్రామాల్లో మంత్రి గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  ధ‌ర్మాన మాట్లాడుతూ..తప్పు చేసి కొవ్వొత్తులు పట్టుకుంటే వదలరు. అలా అయితే తప్పుడు పనులు చేసిన అందరూ పెద్ద,పెద్ద దివిటీలు పట్టుకొని బయలదేరుతారు. అవినీతికి పాల్పడితే చట్టం ముందు ఎవ్వ‌రైనా సమానమే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌జాధనం దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విష‌యం కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పాయి. ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్,ఇన్కం ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ల‌లో కూడా నిజం అని తేలింది.

 జ‌ర్మ‌న్ కంపెనీ సీమన్స్ కూడా తేల్చి చెప్పింది. మాకు ఆ అగ్రిమెంట్ కూ సంబంధం లేద‌ని. కానీ ఆ  పేరుతో ఏర్పాటు చేసిన షెల్ కంపెనీలకు డ‌బ్బులు వెళ్ళాయి అని తేలింది. ఆ డబ్బు చంద్రబాబు,లోకేశ్ పీఏల‌కు వెళ్ళింది అని తేలింది. వారు ఇద్దరూ దేశం దాటి వెళ్లిపోయారు. వ్యూహాత్మకంగా డబ్బులు తప్పు దారి పట్టాయి. చంద్రబాబు దోషి అవునా,కాదా అన్న‌ది కోర్టు పరిధిలో ఉంటుంది. ప్రస్తుతం నిందితుడిగా ఉన్నారు. ఇందిరాగాంధీకి, పి.వి.న‌ర‌సింహారావుకూ, పక్క రాష్ట్రానికి చెందిన జయలలి తకూ, లాలూ ప్రసాద్ యాదవ్ కూ ఇలా అందరికీ ఒకటే చట్టం. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో చ‌ట్టం ముంద‌ర అంద‌రూ  సమానమే.

నాలుగేళ్ల క్రితం ఏర్పడిన ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలపై పౌరుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు గడప గడపకూ  మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నాం. నిద్ర పోయినట్టు నటిస్తున్న వారిని ఎంత లేపినా లేవ‌రు. అలానే పథకాలు 
అందుకొని కూడా మాకు ఏమీ రాలేదు అని కొంత మంది అంటుంటారు. కానీ అది నిజం కాదు. ఇవాళ లంచాలకు తావే లేకుండా పథకాలు అందిస్తున్నాం. సంబంధిత ప్ర‌ణాళిక అమలు చేస్తున్నాం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతోంది. ఎప్పుడూ కూడా ఇలాంటి పరిపాలన అందలేదు. ఇవాళ మీరంతా మండల హెడ్ క్వార్టర్ కి వెళ్ళే రోజులు పోయాయి. పరిపాలన గ్రామాల వద్దకే తీసుకు వచ్చాం. గ్రామ స‌చివాల‌యాలు ఏర్పాటు చేశాం. మహిళలకు మా ప్రభుత్వంలో పెద్ద ఎత్తున గుర్తింపు ఇచ్చి,పథకాలను వారి పేరిట అందిస్తున్నాం. వారి గౌరవం పెంచుతున్నాం.  ప్రతిపక్ష పార్టీ వారికి కూడా మేము పథకాలు అందిస్తున్నాం. పాల‌న‌లో మా పార్టీ స్టైల్ వేరు..

ఇవాళ ఏం చెప్పాలో తెలియక,ఏం విమ‌ర్శించాలో కూడా తెలియ‌క ప్రతిపక్షాలు నిత్యావసరాలు ధరలు పెరిగి పోతున్నాయి అంటున్నాయి. కరెంట్, నూనె,గ్యాస్,పప్పులు,ఉప్పులు అన్నీ,అన్నీ దేశం మొత్తం మీద పెరిగాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు..అన్నింటా ఇలానే ఉంది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాలుగున్న‌రేళ్ల పాల‌లో రెండేళ్లు క‌రోనా ఉంది. ఆ రోజు దేశం మొత్తం విల‌విల‌లాడితే ఒక్క మన రాష్ట్రంలోనే 9 సార్లు నిత్యావ‌స‌రాల‌ను ఉచితంగా ప్రభుత్వం మీ అంద‌రికీ అందించింది. వైరస్ సోకిన వారి ఇంటికి బంధువులు,స్నేహితులు వెళ్ళడానికే భ‌యపడితే,ఒక్క వ‌లంటీర్లు మాత్రమే బాధిత కుటుంబాల‌కు కావాల్సినవన్నీ చూశారు. నిత్యావ‌స‌ర స‌ర‌కులు ఇచ్చి వ‌చ్చారు. అలాంటి వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌ను తీసేయాలి అని ఒక్క పెద్ద మనిషి చెబుతున్నారు. అవగాహన లేకుండా మాట్లాడకూడదు.

ఈ నాలుగేన్న‌రేళ్లలో,ఇతర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు సైతం ఆంధ్రప్ర‌దేశ్ ను  ఆదర్శంగా తీసుకుంటున్నాయి. 75 ఏళ్లలో ఎప్పుడూ లేని మార్పు అందరూ చూస్తున్నారు. మన రాష్ట్రంలో విద్యా వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన మార్పు చూస్తున్నారు. వైద్య వ్యవస్థలో మార్పులు చూస్తున్నారు..అన్ని ఆస్ప‌త్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసిన ఘనత మనది. ఆ విధంగా వైద్యుల‌ను,ఇత‌ర సిబ్బందిని నియ‌మించాం. అలానే ప్ర‌భుత్వాస్ప‌త్రుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఖ‌ర్చు చేస్తున్నాం. అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు ఏర్పాటు చేశాం. జ‌గనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మీ గ్రామంలోనే వైద్య పరీక్షలు జరిపి, 175 రకాల మందులు అందుబాటులో ఉంచుతూ, అవ‌స‌ర‌మ‌యిన వారికి అందిస్తున్నాం. ఒక‌ప్పుడు రోగిని వైజాగ్ కు రిఫ‌ర్ చేసేశారు. కానీ ఇప్పుడు రిమ్స్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాం. 900 బెడ్స్ ను అందుబాటులో ఉంచాం.
 
జిల్లాలో ర‌బీ పంటకు నీరు అందించాలి అని వంశ‌ధార అధికారులను ఆదేశించాం. 14 ఏళ్లలో చంద్రబాబు చేయని పని మన జిల్లా రైతాంగం కోసం జగన్  చేశారు. నేర‌డి బ్యారేజీ నిర్మాణం విష‌య‌మై నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొలగించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో సంప్రదించారు. నేరుగా వెళ్లి చ‌ర్చ‌లు జ‌రిపారు. ప్రాజెక్టు లేట్ అవుతుంది అని గొట్టా ద‌గ‌ర్గ ఓ ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి డిజైన్ చేయించారు. ఇది పూర్తయితే జిల్లాలో పంటలకు  నిరంతరం సాగునీరు అందుతుంది. మూడు పంట‌లు పండుతాయి. ఇవాళ నీ పొలానికి వస్తున్న నీరు జగనే ఇస్తున్నారు. మీ జీవన ప్రమాణాలు పెరిగేందుకు జ‌గ‌నే కార‌ణం అయ్యారు.

బడులకు వెళ్తున్న మీ పిల్లను ఓ సారి చూడండి. ఎవరిచ్చారు..ఆ టెక్స్ట్ బుక్స్ ? ఎవరిచ్చారు..ఆ బెల్ట్.. ? ఎవరిచ్చారు.. నోట్ బుక్స్ ?  ఎవ‌రు ఏర్పాటు చేశారు డిజిటల్ క్లాస్ రూమ్స్ ? ఎవరు చేశారు మ‌న బడుల్లో కీల‌క మార్పులు.. ? ఇవ‌న్నీ సీఎం జగనే చేశారు..వీట‌న్నింటినీ మీరు గుర్తించాలి. పాల‌న‌లో వ‌చ్చిన ప్ర‌తి మార్పునూ గ‌మ‌నించాలి. మేలు చేసే ప్ర‌భుత్వానికే మ‌ద్ద‌తుగా నిల‌వాలి. గార మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఐక‌మ‌త్యంగా ఉన్నారు.  

కొత్తూరు సైరిగాం గ్రామంలో సంక్షేమ పథకాల ద్వారా రూ.11.50 కోట్లు అందించాం. మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం లేకుండానే ప‌థ‌కాలు అందించాం. అలానే అభివృద్ధికీ ప్రాధాన్యం ఇచ్చాం. ఈ గ్రామంలో రోడ్డు ప‌నుల‌ను త్వరలో పూర్తి చేస్తాం.. 

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డిసిఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ మూర్తి, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపి గొండు రఘురాం, మండల వైఎస్ఆర్సీపీ ఆధ్యకులు పీస గోపి, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, వైస్ ఎంపిపి అరావల రమ కృష్ణ, సర్పంచ్లు మార్పు ఆది నారాయణ, మార్పు పృథ్వి, పీస శ్రీహరి,  పార్టీ నేతలు అరంగి మణీ, యాళ్ళ నారాయణ, కోయ్యాన నాగబుషన్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top