మా ఆవేద‌న ధ‌ర్మం.. మా కోరిక ధ‌ర్మం

విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి

అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉంది

అమరావతి ప్రాంతంలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదు

కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని రాష్ట్రానికి అవసరమా..? 

ఉద్య‌మానికి అవ‌స‌రం అయితే ముఖ్య‌మంత్రితో మాట్లాడి రాజీనామా చేస్తాం 

అమ‌రావ‌తిలో సెంటిమెంట్ ఉంటే లోకేష్ ఎందుకు ఓడిపోయాడు

ఉత్త‌రాంధ్ర‌కు చంద్ర‌బాబు ఏం చేశాడో స‌మాధానం చెప్పాలి..?

రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీకాకుళం: విశాఖకు పరిపాలన రాజధాని వస్తే మీకు వచ్చిన నష్టమేంటి?. ఉత్తరాంధ్రకు ఒక్కసంస్థనైనా చంద్రబాబు తీసుకువచ్చారా?. టీడీపీకి అండగా నిలిచిన ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేశారు అని రెవెన్యూ శాఖ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ఒకే చోట అభివృద్ధి జరిగితే మిగిలిన ప్రాంతాలు వెనుకబాటుకు గురవుతాయని, ఉత్తరాంధ్ర అనేక రంగాల్లో వెనకబడి ఉందన్నారు. కొంత మంది చేతుల్లో ఉండే రాజధాని రాష్ట్రానికి అవసరమా..? అని ప్రశ్నించారు. అందరికీ న్యాయం జరిగాలని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అన్ని ప్రాంతాల వారు నివసించే పరిస్థితి ఒక్క విశాఖలోనే ఉందన్నారు. అమరావతి ప్రాంతంలో వేరే వర్గం నివసించే పరిస్థితి లేదన్నారు. 
 
శ్రీ‌కాకుళంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాదరావు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఏం మాట్లాడారంటే.. 

"అభివృద్ధి చెందిన వారు చెంద‌ని వారి అవ‌కాశాల‌ను దెబ్బ తీయ‌వ‌చ్చు. ఎందుకూ అంటే వ్య‌త్యాసాలు వ‌స్తాయి. అభివృద్ధి బాగా చెందిన వారు ప్ర‌పంచంలో ఉన్న ఉన్న‌త టెక్నాల‌జీ వాడుకుంటారు. ఇంకా దేశంలో ఉన్న ప‌థ‌కాలు వాడుకుంటారు. ఇంకా వెనుక‌బ‌డిన ప్రాంతాల ఆస్తుల‌ను దోచుకుని తింటారు. మా ఆవేద‌న ఎవ‌రికి తెలుస్తుంది. ఇచ్ఛాపురం నుంచి సాలూరు వ‌ర‌కూ, సాలూరు నుంచి న‌ర్సీప‌ట్నం వ‌ర‌కూ, విశాఖ నుంచి ఇచ్ఛాపురం.. వ‌ర‌కూ ఉన్న ఆస్తులు ఎవ‌రివి..? 

ఆ ఆస్తుల‌కు అధిప‌తులు ఎవ‌రు ? 
ఇవ‌న్నీ ఈ ప‌రిశ్ర‌మ‌లు అన్నీ ఎక్క‌డి నుంచి వ‌స్తుంటాయి. అభివృద్ధి చెందిన వాళ్లు ఇక్క‌డున్న వారి ఆస్తుల‌న్నంటికీ అధిప‌తులు గా మారుతారు. ఒక హృద‌య‌విదార‌క విష‌యం ఏంటంటే.. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న భూ స్వామి ఇవాళ అక్క‌డ గేట్ కీప‌ర్ గా ఉన్నారు. ఈ ప్రాంతం బాగా నిర్ల‌క్ష్యానికి గురైంది. అభివృద్ధి చెందిన వారి చేతుల్లోకి ప‌రిశ్ర‌మ‌లు వెళ్లిపోయాయి. ముఖ్యంగా ఈ ప్రాంత ఆస్తుల‌న్నీ ఓ అభివృద్ధి చెందిన వారి చేతుల్లోకి చేరిపోయాయి. అందుకోస‌మే మా ప్రాంత వాసుల గుండెలు మండుతుంటాయి. మా ప్రాంత వాసుల ఆవేద‌నలు పెరిగిపోతున్నాయి. పాల‌కులు వీటిని రెక్టిఫై చేయాలి. ఆదేశ సూత్రాలు అనుసారం ఓ రాష్ట్రానికి ల‌భించిన సంప‌ద లేదా వ‌న‌రులన్న‌వి అన్ని ప్రాంతాల‌కూ స‌మానంగా అందించ‌గ‌లగాలి. స‌మానంగా పంచ‌గ‌ల‌గాలి.

రాజ‌ధాని అంటే కాస్మోపోలిట‌న్ క‌ల్చ‌ర్ కు ద‌గ్గ‌ర‌గా ఉండాలి 
ఇవాళ్టికీ ఈ విధంగా కొంద‌రు చేస్తున్నారంటే తెలియ‌క కాదు తెలిసే చేస్తున్నారు. దీనిని అడ్డుకోవాలి. మా ఆవేద‌న ధ‌ర్మం..మా కోరిక ధ‌ర్మం ..మా గావుకేక ధ‌ర్మం .. ఇప్ప‌టికైనా వీటిని నిలువ‌రించాలి. కేంద్రం విభ‌జ‌న చ‌ట్టం కింద సెక్ష‌న్ 6 కింద ఓ క‌మిటీ ఏర్పాటుచేసింది. ఆ క‌మిటీ సిఫార‌సుల మేర‌కే విశాఖ‌ను రాజ‌ధాని చేయాల‌ని సూచించారు. ఎక్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఇక్క‌డే పెట్టుకోమ‌ని  చెప్పింది. కానీ మీరు ఎందుక‌ని మీ క్యాబినెట్ క‌మిటీ ఎందుక‌ని వేశార‌ని ? వాళ్ల‌పై మీ పెత్త‌నం ఉంటే నిష్ప‌క్ష పాతం గా చేయ‌గ‌ల‌రా ? మీరు ఆ రోజు విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న సెక్ష‌న్ 6 ను మార్పించాల్సింది. కానీ మీరు ఆ పని చేయ‌గ‌లిగారా ? ఇప్ప‌టిదాకా అభివృద్ధి చెందిన న‌గ‌రాల్లో కాస్మో పోలిట‌న్ అట్మాస్ఫియ‌ర్ ఉంటుంది. అక్క‌డ ఏ ప్రాంతం వారు అయినా ఏ మ‌తం వారు అయినా హాయిగా జీవించ‌గ‌ల‌గాలి. "

అందుకే లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ ను అమ‌రావ‌తి గా నిర్ణ‌యించాం
"ఆ విధంగా ఈ దేశ ప్ర‌జ‌లంతా సంస్కృతులంతా ఉండేది విశాఖ‌లోనే.. ! ఇది నాది అనేందుకు కానీ, ఇక్క‌డ గుత్తాధిప‌త్యం నాదే అనేందుకు సాధ్యం కాదు. ఏమంటే విజ‌య‌వాడ రాష్ట్రానికి మ‌ధ్య ఉందా ?? యాక్స‌ప్ట‌బుల్ క‌ల్చ‌ర్ ఉందా ? మీ అమ‌రావ‌తి కి అది లేదు. అదేవిధంగా మీ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా మీ మీ మ‌నుషులు భూములు కొనుగోలు చేశారు. అది సాక్షాత్తూ మా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర అసెంబ్లీలోనే చెప్పారు. దీని వ‌ల్ల బోలెడంత ప్ర‌మాదం ఉంది. ఇత‌రుల‌కు ఎవ్వ‌రికీ చోటు లేని న‌గ‌రాన్ని తీసుకుని రావాల‌ని మీరు తీసుకుని రావాల‌ని యోచిస్తున్నారు. అందుకే లెజిస్లేటివ్ క్యాపిట‌ల్ ను అమ‌రావ‌తి గా నిర్ణ‌యించాం."

జిల్లాల ఏర్పాటులో అభివృద్ధిలో భాగం
"అదేవిధంగా మిగిలిన చోట్ల ప్రాంతీయ అస‌మానతలు రానివ్వ‌కుండా చేసేందుకు క‌ర్నూలులో న్యాయ రాజ‌ధానిని, విశాఖ‌లో  అడ్మిన్ క్యాపిట‌ల్ ను ఏర్పాటు చేయాలని భావించాం.  మ‌రి ! మీరు (చంద్ర‌బాబు) అమ‌రావ‌తిని గొప్ప న‌గ‌రంగా మారుస్తాం అని అన్నారు  క‌దా ! మ‌రి మీ అబ్బాయి (లోకేశ్ ) కి అక్క‌డ యాక్సెప్టెన్స్ ఉందా ? ఆయ‌న ఆ వేళ ఓడిపోయారే ! మీ అబ్బాయిని త‌క్కువ చేసి మాట్లాడ‌డం లేదు. అందుకే మేం ఈ విధంగా 3 రాజధానుల కోసం మాట్లాడుతున్నాం. ఇక మేం ఉత్త‌రాంధ్ర‌కు ఏం చేయ‌లేదు అని అంటున్నారు. 3 జిల్లాల‌ను ఆరు జిల్లాలుగా చేశాం. జిల్లాల ఏర్పాటు అభివృద్ధిలో భాగం. " 

కేంద్రం 23 సంస్థ‌లు ఇచ్చినా  కూడా శ్రీ‌కాకుళంలో ఒక్క సంస్థ లేదు
"ప్ర‌తి జిల్లాకూ ఓ మెడిక‌ల్ కాలేజ్,అదేవిధంగా ఐటీడీఏల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. ఉద్దానం నీటి ప్లాంటుకు ఏడు వంద‌ల కోట్లు వెచ్చించాం. ఆ విధంగా కిడ్నీ ప్ర‌భావిత ప్రాంతాల‌కు వంశ‌ధార నీరు అందించ‌బోతున్నాం. గ్రౌండ్ వాట‌ర్ క‌న్నా స‌ర్ఫేస్ వాట‌ర్ అన్నది ఈ స‌మ‌స్యకు ప‌రిష్కారం ఇస్తుంద‌ని సీఎం భావించి, సంబంధిత చ‌ర్యలు చేపట్టాం. అదేవిధంగా ఇక్క‌డ డ‌యాల‌సిస్ సెంట‌ర్లను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప‌లాస‌లో మ‌ల్టీ స్పెషాల్టీ ఆస్ప‌త్రి ఏర్పాటు కృషి చేస్తున్నాం. 

అభివృద్ధి లేదు అన‌డం స‌బ‌బు కాదు 
కేంద్రం 23 సంస్థ‌లు ఇచ్చినా కూడా శ్రీ‌కాకుళంలో ఒక్క సంస్థ లేదు. విభ‌జ‌న త‌రువాత ప‌రిహారం కింద కేంద్రం ఇచ్చిన  సంస్థ‌ల‌లో ఈ ప్రాంతానికి ఎనిమిది సంస్థ‌లు రావాలి. కానీ రాలేదు. ఉత్త‌రాంధ్ర కు మేం ఏం చేయ‌లేదు అని అంటున్నారు సబ‌బు కాదు. మేం వ‌చ్చి ఎంత కాలం అయింది .. మూడేళ్లు. ఈ కాలంలోనే క‌రోనా కార‌ణంగా ఆర్థిక ప‌రిస్థితులు అనుకూలంగా లేవు. అయిన‌ప్ప‌టికీ చేశాం. నాడు నేడు ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా ఎంపిక  చేసిన పాఠ‌శాల‌ల రూపు మార్చాం. మీరు వంశ‌ధార ప్రాజెక్టు పూర్తి చేయించ‌గ‌లిగారా ?  మీరు చేయ‌డం ఏంటి? ఆ ప‌నులు ఎప్పుడో  వైఎస్సార్ హ‌యాంలో ప్రారంభం అయ్యాయి. త‌రువాత మీరు అధికారంలోకి వ‌చ్చాక వంశ‌ధార ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిన ప‌నులు క‌నీసం ఐదేళ్ల‌లో పూర్తి చేయ‌లేక‌పోయారు. వంశ‌ధార ప్రాజెక్టుకు సంబంధించి నేర‌డి వ‌ద్ద బ్యారేజీ ఆల‌స్యం అవుతుండ‌డం తో ఇందుకు ప్ర‌త్యామ్నాయంగా 180 కోట్ల రూపాయ‌లతో 19 టీఎంసీల నీరును  2ల‌క్ష‌ల యాభై వేల ఎక‌రాల‌కు అందించేందుకు కృషి చేస్తున్నాం. వ‌చ్చే ర‌బీసీజ‌న్ కు నీరందించ‌నున్నాం. గొట్టా వ‌ద్ద లిఫ్ట్ ఇరిగేష‌న్ తో ఇవ‌న్నీ సాధ్యం చేయ‌నున్నాం.

అన్ని ప్రాంతాల అభివృద్ధికీ కట్టుబ‌డి ఉన్నాం 
పొరుగున ఉన్న విజ‌య‌న‌గ‌రానికి ఏం చేయ‌లేదు అంటున్నారు. గుర‌జాడ వ‌ర్శిటీ ఏర్పాటుకు చ‌ట్టం చేసింది ఈ ప్ర‌భుత్వం.. అదే విధంగా స్పెష‌ల్ ఆస్ప‌త్రుల ఏర్పాటుకు కృషి చేసింది మేము. అన్ని ప్రాంతాల అభివృద్ధికీ మేం క‌ట్టుబ‌డి ఉన్నాం. పార్ల‌మెంట‌రీ క‌మిటీ చెప్పిన మాట‌లు పాటించ‌లేదు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ప్ర‌యివేటు వ్య‌క్తిది ఆ భూమి.. కోర్టు ప‌రిధి లో ఇష్యూ ఉంది. ఇందులో మేం చేసేది ఏంటి ? కంట్మెమ్ట్ ప్రొసీడింగ్స్ వ‌స్తాయి అని తెలిసి కూడా ఇదే విష‌యాన్ని క్యాబినెట్ లో పెట్ట‌డం జ‌రిగింది. ఇందులో మేం చేసేది ఏంటి ? 

చంద్ర‌బాబు వ్యాఖ్యలు అర్థర‌హితం 
క్యాపిట‌ల్ అన్న‌ది మా బ‌తుకు పోరాటం.. రాకపోతే ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు రావు. ఇది కొన‌సాగడానికి వీల్లేదు. ఇందుకోసం పోరాటం చేయాల్సి ఉంది. ఇది ఎవ‌రి జాగీరు కాదు. రాజధాని వ‌ద్దంటే ఈ ప్రాంతాలు ద్రోహులుగా మారుతారు. వికేంద్రీక‌ర‌ణ భావ‌న అన్న‌ది గాంధీ చెప్పారు. అంబేద్క‌ర్ చెప్పారు. ఇందులో ఏ విచిత్రం లేదు. మీరు చెబుతున్న‌ది క్లోజ్డ్ మోడ‌ల్. ఓపెన్ మోడ‌ల్ కాదు. అందుకే విప‌క్షాలు ఈ ప్రాంత ప్ర‌జ‌ల మ‌నోభావాలకు వ్య‌తిరేకంగా మాట్లాడే ప‌ద్ధ‌తి విర‌మించుకోవాలి. శివ‌రామకృష్ణ‌న్ క‌మిటీ నివేదిక‌లో వ‌చ్చినటువంటి ప్ర‌తిపాద‌న‌లు ఇవి. వాటిని అమ‌లు చేయాల్సిందే. కానీ మీరు మాత్రం క్యాబినెట్ క‌మిటీ వేసి, మీకు అనుగుణంగా క‌మిటీ రిక‌మెండేష‌న్స్ ఇచ్చారు. 1995లో ముఖ్య‌మంత్రి అయిన వ్య‌క్తి (చంద్ర‌బాబు) ఈ ప్రాంతం అభివృద్ధి చెంద‌లేద‌న‌డం భావ్యం కాదు. 

ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి న్యాయం జ‌రిగిందేకు సాగే ఉద్యమం కోసం అవసరమైతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్య‌మంత్రితో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటా. నిరంతర పోరాటం చేయాల్సి ఉంది. పదవులు అంత ముఖ్యం కాదు``అని ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు.

తాజా వీడియోలు

Back to Top