రామచంద్రాపురం: చంద్రబాబు భావజాలమే పవన్ పార్టీ అజెండా అని బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. పవన్ రాజకీయ నటనను ప్రజలెప్పుడో తిరస్కరించారుః సినిమా రంగంతో పాటే రాజకీయరంగం సరిసమానంగా ఉంటుందనే ఆలోచనతో సినిమా నటుడు పవన్‌కళ్యాణ్ పార్టీ పెట్టి ఉండొచ్చు. కానీ, ప్రజలు మాత్రం ఆయనలా ఆలోచించరు. తమకు ఏ నాయకుడైతే అండగా ఉండి అవసరాలు తీరుస్తారో వారినే నమ్ముకుని ఉంటారు. ఈక్రమంలో రాజకీయ నటనకు అడుగు వేసిన సందర్భంలోనే పవన్‌కళ్యాణ్ అనే సినిమా నటుడ్ని ప్రజలు తిరస్కరించారు. గతంలో ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యంలో పనిచేసి, ఆ తర్వాత 2012లో జనసేన పార్టీ ఏర్పాటు చేసుకుని ఇప్పటికీ పదేళ్లుగా తెగ కష్టపడుతున్నానని పవన్‌కళ్యాణ్ చెబుతున్నాడు. నిన్న కత్తిపూడి బహిరంగ సభలో ఆయన తన అభిమానుల్నే అవమానిస్తూ మాట్లాడాడు. సినిమా మీద మోజుతో ఇన్నాళ్లూ ఆయన అభిమానులుగా ఉంటూ కాస్తాకూస్తో జనసేనలో కూడా పనిచేసిన వారికి పవన్‌కళ్యాణ్ మానసికక్షోభను మిగిల్చారు. తన సభలకు భారీగా జనసమీకరణకు, వచ్చిన జనాలకు ఛాయ్, బిస్కెట్లు పంచడానికి అభిమానులు ఖర్చుపెట్టాలన్నాడు. దీనిపై వారంతా సభ బయటకొచ్చి బాధపడ్డారు. ఇదేంటి.. మన అభిమాన నాయకుడు కదాని ఇన్నాళ్లూ మనం జనసేనకు కష్టపడుతుంటే.. జనసమీకరణకు డబ్బులు ఖర్చుపెట్టమంటాడేంది అని వారు మథనపడుతున్నారు. బాబు పారితోషికం మిగుల్చుకునేందుకే పవన్ పాట్లుః పార్టీ కార్యక్రమాలకు అభిమానులు ఖర్చుపెడితే, మరి పవన్‌కళ్యాణ్ ఏం చేస్తాడు..? పదేళ్లుగా పార్టీని నడపడానికి తెగ కష్టపడ్డానని చెబుతున్న ఆ నాయకుడు చంద్రబాబు దగ్గర తీసుకున్న పారితోషికం గురించి బయటకు ఎందుకు చెప్పడు..? ఇప్పుడేమో, అభిమానులే ఖర్చుపెట్టాలంటున్నాడంటే.. బాబు చేతినుంచి తీసుకున్న పారితోషికం మిగుల్చుకోవడానికేననే అనుమానాలు వవన్ అభిమానుల్లో కలుగుతున్నాయి. ఒకపక్క డబ్బులేని రాజకీయాల్ని నడుపుతానంటూనే మరోపక్క తన అభిమానులకు డబ్బు ఖర్చు గురించి పిలుపునివ్వడంపై రాజకీయవర్గాలు విస్మయం చెందుతున్నాయి. నిజంగా, ఇన్నాళ్లూ పార్టీని నడపడానికి పవన్‌కళ్యాణ్ పాట్లు పడ్డారా..? లేదంటే, ఎవరైనా అభిమానులే స్పాన్సర్లుగా నిలబడ్డారా..? అని నిన్న బహిరంగ సభ వద్ద అనుకుంటున్నారని తెలిసింది. బాబు, లింగమనేని డీల్ తెలీదనుకుంటున్నారా..? సొంత డబ్బులతో పార్టీ ఆఫీసు కడతానంటున్నాడు. మరి, ఆ పార్టీ ఆఫీసు స్థలం ఎవరిచ్చారో కూడా పవన్‌కళ్యాణ్ చెప్పాలి కదా..? అసలు, పార్టీ కార్యాలయ ఏర్పాటు ప్రణాళిక చంద్రబాబుది అని.. మీకు స్థలాన్ని ఇచ్చింది లింగమనేని అని లోకమంతా తెలుసుకదా..? మరి, ఆ డీల్ గురించి ఎవరికీ తెలియదని బహుశా మీరు భావించి ఉండొచ్చు. కానీ, మీరు మాట్లాడే ప్రతీ మాట రాజకీయ అపరిపక్వతకు నిదర్శనంగా ఉన్నాయని విశ్లేషకులు టీవీ ఛానెళ్ల చర్చల్లో చెబుతున్నారు. పవన్, లోకేశ్ కామెడీ రాజకీయాలుః సామాజిక అంశాల పట్ల ఏమాత్రం అవగాహన లేని పవన్‌కళ్యాణ్ ఏవేవో సినిమా డైలాగులు చెప్పి ప్రజల నుంచి ఓట్లు సంపాదించుకోవాలను కుంటే అది ఆయన భ్రమగానే చెప్పాలి. ఎందుకంటే, ఈరోజు ఆయనతో పాటు అటు రాయలసీమలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు కొడుకు లోకేశ్ కూడా అవే సినిమా డైలాగులతో ప్రగల్భాలు పలుకుతున్నాడు. మరి, నేను ఈ సందర్భంగా ఆ ఇద్దరి గురించి ఒక పోలిక చెబుతాను. అదేమంటే, లోకేశ్ మంగళగిరిలో పోటీచేసి ఓడిపోయి..ఇప్పుడు రాష్ట్రమంతా టీడీపీని గెలిపిస్తానంటూ తిరుగుతున్నాడు. మరోవైపు పవన్‌కళ్యాణ్ కూడా గాజువాక, భీమవరాల్లో ఓడిపోయి తాను ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసురుతున్నాడు. రాజకీయాల్లో లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లది కామెడీ ఆటగా చూడాలని మేధావులు, విశ్లేషకులు అంటున్నారనేది గమనించాలి. కుప్పంలో ఇల్లుకట్టుకోవాలని ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా బాబు..? సొంతపుత్రుడు లోకేశ్, దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ కామెడీ రాజకీయాలు ఒకలా ఉంటే.. చంద్రబాబుకు మాత్రం కుప్పంలో వింత పరిస్థితి ఎదురవుతూ ఆయన బతుకే కామెడీగా మారే పరిస్థితులున్నాయి. ఈరోజు కుప్పం సభలో జనాల్లేక చంద్రబాబు విలవిలలాడుతున్నాడు. మా నాయకుడు జగన్ గారి దెబ్బకు ఇన్నాళ్లకు తాను కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు అనుకున్నాడంట. మరి, ఇన్నాళ్లూ కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని ఎందుకు గుర్తుకురాలేదు చంద్రబాబు..? అని ప్రశ్నిస్తున్నాను. దీనిపై ఆయన సమాధానం ఇవ్వాలి. ఎవరు ఆపుతారో చూస్తామంటూ పొలిటికల్ కమెడీయన్ల ప్రగల్భాలవిః కుప్పంలో చంద్రబాబు తను ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడంలేదంటూ.. తన ఇంటి నిర్మాణాన్ని ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్ విసురుతాడు. ఆయన కొడుకు లోకేశ్ మాత్రం తన పాదయాత్రను ఎవరు అపుతారో చూస్తానంటాడు. ఇక, దత్తపుత్రుడేమో తాను అసెంబ్లీలో అడుగుపెట్టడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. ఈ త్రిమూర్తులు చేసే కామెడీ కన్నా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరొక కామెడీ ఉంటుందా..? అని గమనించమంటున్నాను. వేణుమాధవ్, కళ్లు చిదంబరం, ఎంఎస్ నారాయణ గుర్తుకొస్తున్నారుః పార్టీని నడపడం చాలా కష్టంగా ఉంది. ప్రజల నా భావజాలాన్ని అర్థం చేసుకోకపోవడంతోనే నేను ఓడిపోయానంటూ వవన్‌కళ్యాణ్ మాట్లాడం చూస్తే కమెడియన్ వేణుమాధవ్ గుర్తొస్తున్నాడు. ఇక, చంద్రబాబును చూస్తే కళ్లు చిదంబరం, లోకేశ్‌నేమో ఎంఎస్ నారాయణగా పాదయాత్రలో కామెడీ చేస్తున్నాడు. నిజానికి, వీరంతా తమ భావజాలాల్ని పక్కనబెట్టి ప్రజల భావాల్ని, వారి అవసరాల్ని అర్థంచేసుకుంటే నాయకులయ్యే వారేమో.. ఆ విధంగా ఆ ముగ్గురు అర్ధం చేసుకోనందునే పొలిటికల్ కమెడియన్లుగా మారారని చెప్పుకోవచ్చు. చే..నారా భావజాలంతో పవన్‌కళ్యాణ్ః ప్రజల భావజాలాన్ని అర్ధంచేసుకుని, వారి అవసరాలు తీర్చే నాయకుడుగా గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని పవన్‌కళ్యాణ్ గమనించుకోలేదు. పార్టీ పెట్టి ఇన్నాళ్లూ గడచినా.. ఇప్పటికీ తన భావజాలాన్నే ప్రజలు అర్థంచేసుకోవాలంటూ తిరుగుతున్నాడు పవన్‌కళ్యాణ్. ఆయన పోరాటపటిమకు స్ఫూర్తి చేగువేరా అని చెప్పుకుంటున్నాడు. వాస్తవానికి పవన్ దృష్టిలో ‘చే’ అంటే చంద్రబాబు. ‘గువేరా’ కాకుండా ‘నారా’ అని చెప్పుకోవాలి. ఆర్నెల్లకోమారు షూటింగులు ముగించుకుని చంద్రబాబు ఇచ్చిన పొలిటికల్ స్క్రిప్టును ఇక్కడ చదవడం.. బాబు భావజాలమే తన భావజాలమని ఊదరగొట్టి హైదరాబాద్‌కు వెళ్లడం రివాజుగా ఉంటుందనేది ప్రజలు అభిప్రాయానికొచ్చారు. నీకు నువ్వే అడ్డుపడుతున్నావు పవన్‌కళ్యాణ్ః ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తానంటూ సవాల్ విసురడమెందుకు పవన్‌కళ్యాణ్..? ప్రజలు నిన్నెందుకు గెలిపించలేదో.. నీ నాయకత్వాన్ని ఎందుక అంగీకరించడం లేదో వాళ్లు నీకెప్పుడో చెప్పారు. కానీ, నువ్వే ప్రజల్ని అర్ధం చేసుకోవడంలేదు. మీ ఆలోచనంతా చంద్రబాబును గెలిపించాలి.. ఆయనకు అధికారం కట్టబెట్టాలని ఉందనేది లోకమంతా తెలుసుకదా..? మరి, అలాంటప్పుడు ప్రజలు నిన్నెందుకు గెలిపించాలి..? నిన్నెందుకు అసెంబ్లీ దాకా పంపాలి..? ఇందుకు సమాధానం చెప్పు. పవన్‌కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు తనకు తానే అడ్డుపడుతున్నాడనేది నిజం. దీన్ని ఆయన గ్రహించి అర్ధంచేసుకోవాలని మేధావులు కూడా చెబుతున్నారు. ప్రశ్నిస్తానన్న నోరు ఎందుకు మూగబోయిందిః ఈరోజు పవన్‌కళ్యాణ్ రాజకీయాల్లోకొచ్చిందే మా జగన్ గారిని దుమ్మెత్తిపోయడానికి అన్నట్లు మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రంలో సుభిక్ష పరిపాలనను అర్ధంచేసుకునేంత శక్తిసామర్థ్యాలు పవన్‌కు లేవు కనుకనే జరుగుతున్న ప్రతీ మంచిని తూలనాడుతున్నాడు. అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, విద్యాదీవెన తదితర పథకాలతో పాటు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల పని విధానం, ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌లు పంపిణీ చేయడం, రైతుభరోసాకేంద్రాలు, నాడు నేడుతో ప్రభుత్వపాఠశాలల అభివృద్ధి, పేదపిల్లలకు ఇంగ్లీషు విద్య, రాష్ట్రంలో 30లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్లస్థలాల పంపిణీ ఇలా.. అనేక మంచి కార్యక్రమాలనేవి పవన్‌కళ్యాణ్‌కు నచ్చడం లేదట. ఒక్క చంద్రబాబు అధికారంలోకొస్తేనే తనకు నచ్చుతుందట. మరి, గతంలో బాబుతో పొత్తుకుదుర్చుకుని గెలిపించి 2014 నుంచి 2019 వరకు జరిగిన అరాచకాలన్నింటిని భరించి.. ఏమాత్రం ప్రశ్నించకుండా ఎందుకు నోరుమూసుకున్నావని సూటిగా నిలదీస్తున్నాను. సమాధానం చెప్పగలవా..? ఈరోజుకు పవన్ మాటల్లో ఆనాడు బాబు పాలన దుర్మార్గాల్ని ఎందుకు వినిపించలేకపోతున్నాడని అడుగుతున్నాను. జనసేన కార్యాచరణ ఎందుకు..? అవసరమేంటి..? ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన కార్యాచరణ చెబుతున్నాడంటున్నాడు ఈ పవన్‌కళ్యాణ్. అదేంటి..? నేను ముఖ్యమంత్రిని కాదు. చంద్రబాబు జెండానే నా అజెండా అని మోసుకుంటూ తిరుగుతానని ప్రజలకు చెప్పుకున్న వ్యక్తి. మరలా, మా పార్టీ కార్యాచరణ అనడంలో అర్థమేంటి..? పవన్‌కళ్యాణ్ మాటలు నమ్మడానికి ప్రజలంతా పిచ్చోళ్లా..? మరి, ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో 650కి పైగా హామీలిచ్చి ఏమీ అమలు చేయకుండా విద్యార్థులు, మహిళలు, రైతులు, కర్షకులు, కూలీలందర్నీ మోసం చేశాడు. అలాంటప్పుడు బాబును, ఆయనకు అధికారం కట్టబెట్టాలంటున్న పవన్‌కళ్యాణ్‌ను ప్రజలెలా నమ్ముతారని.. ఆమాత్రం గ్రహించలేరా అని గుర్తుచేస్తున్నాను. కాపులకు రిజర్వేషన్ అంశంపై జగన్ గారి మాటల్ని వక్రీకరించిః జగ్గంపేట సభలో ఆనాడు జగన్ గారు కాపులకు రిజర్వేషన్ అమలు అంశం నా పరిధిలోది కాదు. అది కేంద్రం పరిధిలోని అంశమని చెబితే.. దాన్ని ఈరోజు పవన్‌కళ్యాణ్ వక్రీకరిస్తున్నాడు. కులాలతో తనకెటువంటి సంబంధంలేదని, తాను కులరాజకీయాల్ని చేయనంటూనే మరోవైపు కాపుల్ని రెచ్చగొట్టాలనే ప్రయత్నం పవన్‌కళ్యాణ్ ఎందుకు చేస్తున్నట్లు..? ఈ విషయాన్ని కాపులంతా అర్థంచేసుకోవాలి. ఆరోజు జగన్ గారు నిజాన్ని నిర్భయంగా చెప్పారు కనుకనే ఈరోజు కాపులతోనే కలిసి ధైర్యంగా ముందుకెళ్తున్నారు. బాబులాగా అబద్ధాలు చెప్పడం మా జగన్‌గారికి తెలియదని మరోమారు స్పష్టం చేస్తున్నాను. తుని ఘటనప్పుడు ముద్రగడ పద్మనాభంను ఆయన కుటుంబాన్ని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసినప్పుడు పవన్‌కు బాధ కలగలేదా..? తునిఘటనను రాజకీయంగా వాడుకునేందుకు రాయలసీమ నుంచి జగన్ గారు మనుషుల్ని పంపారని ప్రచారం చేసిన సంగతి వపన్‌కు తెలియదా..? ఇవన్నీ దాచిపెట్టి ఆయన కులరాజకీయాలు చేయాలని తపన పడుతుండటాన్ని మేం ఖండిస్తున్నాం. కాపులంతా వైయస్ జగన్ గారి వెంటే నడుస్తున్నారుః దశాబ్ధాలుగా మోసం చేసిన చంద్రబాబు పన్నాగాల్ని గ్రహించిన కాపుసోదరులంతా .. నిజం మాట్లాడిన జగన్ గారి వెంటే నడిచి ఆయన్ను గెలిపించుకుని ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి అనేక కీలక పదవుల్లో కాపుసోదరులున్నారు. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.30వేల కోట్లు కాపుసోదరులకు అందిన మాట వాస్తవమే కదా..? అలాగే, వారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాల్లో తుని ఘటన కేసులు గానీ, ఆ తర్వాత జరిగిన అల్లర్లలో గానీ పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకున్న ఘనత జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వానిది. ఇవ్వన్నీ పరిశీలించుకుని రాష్ట్రంలో జరుగుతున్న సుభిక్షమైన పరిపాలనను అర్ధంచేసుకుని పవన్‌కళ్యాణ్ ఇప్పటికైనా తనకు తాను సరిదిద్దుకుంటే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని హితవుపలుకుతున్నాను,