సీఎంకు సవాల్‌ విసిరే స్థాయి లోకేష్‌కు ఉందా..?

లోకేష్‌ వల్లే టీడీపీ భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ నేతల మాట 

ఓటమి తప్పదని రాళ్ల దాడి అంటూ చంద్రబాబు డ్రామాలు..

ఏపీకి ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలో చెప్పండి.. నడ్డా..?

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు తాము సాటికాదని, పోటీపడలేమని బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఒప్పుకున్నాయని, తిరుపతి ప్రజలను ఓటు అడిగే హక్కు కూడా ఇరు పార్టీలకు లేవని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తికి మద్దతుగా నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలంలో మంత్రి వేణుగోపాల కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీ పక్షాన ఉన్నారన్నారు. సంక్షేమ పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటు ద్వారా మద్దతు తెలిపేందుకు తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు.. తన పాలనలో ఫలానా మంచి చేశానను అని చెప్పుకుని ఓటు అడిగే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు సవాల్‌ విసిరే స్థాయి లోకేష్‌కు ఉందా..? ధ్వజమెత్తారు. లోకేష్‌ వల్లే టీడీపీ భ్రష్టుపట్టిపోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కేడర్‌ మాట్లాడుకునే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు తన పాలనలో ‘సన్‌ క్షేమం’ తప్ప సంక్షేమం గురించి పట్టించుకోలేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో ఓటమి తప్పదని రాళ్ల దాడి అంటూ చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశాడని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. 

బీజేపీ గెలిస్తే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పేదవాడిని నిరుపేదగా మార్చడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు నడ్డా మాటల్లో కనిపిస్తుందన్నారు. పేదవాడు ఉన్నత స్థాయికి ఎదగాలంటే.. సంక్షేమ పథకాలు అందాలని, అలాంటిది సంక్షేమ పథకాలనే రద్దు చేస్తామని మాట్లాడుతున్నారంటే.. బీజేపీ కుటిల బుద్ధి ఏ విధంగా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలని ప్రశ్నించారు. 
 

తాజా వీడియోలు

Back to Top