కర్నూలు: చంద్రబాబు దృష్టిలో ఇది రాళ్ల సీమ.. మాకు రతనాల సీమ అని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి నిలదీశారు. కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జన సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా చెప్పాలన్నారు. కరువు కారణంగా కాళేబరాలు కూడా పూడ్చిపెట్టిన ప్రాంతం రాయలసీమ అన్నారు. ఒక్క మగాడు సీఎం వైయస్ జగన్ హైకోర్టు కర్నూలుకు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలన్నారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు రూ.13 కోట్లు ఇస్తే వైయస్ఆర్ రూ.4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రజలకు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్ ఆకాంక్ష అని..చంద్రబాబు, ఆయన బంధువులు అభివృద్ధి చెందాలనేది మాత్రమే టీడీపీ ఆకాంక్ష అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఎద్దేవా చేశారు. మేధావులు అధ్యయనం చేసి వాళ్లు సూచించిన మేరకు సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే పార్టీలకు బుద్ది చెప్పేందుకే ఈ రాయలసీమ గర్జన నిర్వహిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు కుప్పంలో ఎటువంటి అభివృద్ధి చేయలేకపోయారని, కుప్పాన్ని సీఎం వైయస్ జగన్ అన్ని విధాలా అభివృద్ది చేశారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.