అమరావతి: ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రతిపక్షం గందరగోళం సృష్టిస్తుందని ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని, ప్రాధాన్యత లేని వాటిపై ఖర్చు పెట్టిందని విమర్శించారు. కరోనా కారణంగా ఇప్పుడు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందని చెప్పారు. ప్రజల చేతిలో డబ్బులు ఉంటేనే ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని, అందుకే మా ప్రభుత్వం నగదు బదిలీ ద్వారా ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అప్పులపై మీడియాలో వచ్చిన కథనాలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను ఆయన చదివి.. ఎందువల్ల రాష్ట్రం అప్పులు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు. ఇదే అంశంపై కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు కూడా కామెంట్ చేశారని బుగ్గన అన్నారు. కాగ్ నెలవారీ సమాచారం ఏదైతే పబ్లిక్ డొమైన్‌లో పెడతారో వాటిని ఆధారంగా చేసుకొని ఈ కథనాలు వచ్చాయి. ఇలాంటి కథనాలపై మీడియా ద్వారా ప్రజలకు నిజనిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బుగ్గన తెలిపారు. ఏ కాగ్ రిపోర్టు ఆధారంగా వచ్చిన వార్తలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయో.. అదే రిపోర్టు ఆధారంగా సమాధానాన్ని ఇస్తున్నానని బుగ్గన తెలిపారు. – అప్పులు విషయానికి వస్తే.. 2020–21లో రూ.48,295 కోట్లు చూపారు. వాస్తవానికి ఫిబ్రవరి 2021 నాటికే రూ.73,912 కోట్లు చేయటం జరిగిందని కాగ్ నెలవారీ బులిటెన్‌లో ఉంది. ఇది వాస్తవమే. బడ్జెట్ అంచనాలు కంటే ఎక్కువ అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. కోవిడ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు.. దేశం, ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయమైతే కాదు. కొన్ని రాష్ట్రాలు మెరుగ్గా ఉండొచ్చు. మరి కొన్ని రాష్ట్రాలు మనకన్నా ఇబ్బందుల్లోనూ ఉండొచ్చు. ధనిక రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకల పరిస్థితి మనకంటే మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే వారికి అధిక ఆదాయాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ అప్పు చేయకుండా తక్కువ అప్పుతో నెట్టుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. – మన రాష్ట్రం 2014–15 పునర్విభజన జరిగినప్పటి నుంచి రెవిన్యూ లోటులో నడుస్తోంది. 2014–15 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాలనలోలో రాష్ట్రంలో పెద్దగా ఏమీ మెరుగవ్వలేదు. ఐదేళ్ల టీడీపీ హయాంలో ఏదైతే ఖర్చు, అప్పు చేశారో అది కేపిటల్ వర్క్‌పైన, హ్యూమన్ కేపిటల్ అభివద్ధికి అసంపూర్ణంగా ఖర్చు చేశారు. దీనివల్ల ఐదేళ్ల తర్వాత కూడా ఆ ఖర్చుల వల్ల వచ్చిన బెనిఫిట్ ఏమీ కనపడటం లేదు. ఇప్పుడు మనం అప్పు ఎక్కువ చేయటానికి కారణాలు ఉన్నాయి. కోవిడ్ వల్ల రాష్ట్ర రాబడి తగ్గిపోయింది. ఖర్చు విపరీతంగా పెరిగింది. మార్చి తర్వాత ఏప్రిల్, మే నెలల్లో దాదాపు ప్రతి రోజు వందల కోట్లలో కోవిడ్ నియంత్రణ కోసం ఖర్చు చేశాం. వ్యాపారసంస్థలు ఆగిపోయాయి. మరోవైపు ప్రజలకు ప్రభుత్వం ఏదో ఒక రూపంలో సహాయపడుతూ.. ఎకానమీ రోల్ చేయటానికి ప్రభుత్వం పూనుకుంది. దీనివల్ల ఏర్పడ్డ షార్ట్‌ఫాల్ కోసం అదనపు అప్పు చేయటం జరిగింది. – ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది కాబట్టే సాధారణంగా స్థూల ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం (ఎఫ్‌ఆర్‌బీఎం) 3% అప్పు చేసుకోవటానికి పర్మిషన్ ఉంది. అయితే, ఈ సంవత్సరం మాత్రం 3%తో పాటు అదనంగా 2% అంటే 5% (ఎఫ్‌ఆర్‌బీఎం) అప్పు చేయటానికి కేంద్రం పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వచ్చిన తర్వాత ఖర్చు బాగా తగ్గించుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నాం. అదే సమయంలోనే ప్రజల్ని ఆదుకోవాలని వారికి అవసరమైన సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయ చర్యల్లో ఏమాత్రం తగ్గకూడదు. అది ఆరోగ్యపరంగా, ఎకానమీ రోల్ అయ్యేదాంట్లో ప్రభుత్వ సాయం తగ్గకుండా ఎకానమీ నిలబడాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. – కొన్ని రాష్ట్రాలు, వాళ్ల విధానాల కొద్దీ కోవిడ్ నేపథ్యంలో ఆదాయం లేదు కాబట్టి సంక్షేమం మొత్తం ఆపేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కానీ మన ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు ఆదాయం లేదు. ఖర్చు తగ్గించాలనే కాన్సెప్ట్ వద్దు. ఆదాయం లేకపోయినా ప్రజలకు సహాయం చేరాలి. ప్రజల బ్రతుకుదెరువును కాపాడాలి. తద్వారా ఆ డబ్బు మరొక్కసారి ఎకానమీలోకి రావాలి. సహాయ చర్యలూ తగ్గించకుండా కంటిన్యూ చేయటం జరిగింది. ఎంతో మంది ఆర్థిక శాస్త్రవేత్తల సూచన కూడా ఇది. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటామో.. అప్పుడు కేపిటల్ మనీని ఎకానమీలోకి పంపించాలి. అప్పుడు ఎకానమీ బూస్ట్ అప్ అయి పడిపోకుండా ఉంటుంది. – కేపిటల్ ఎక్స్‌పెండీచర్ మీద, రెవిన్యూ ఎక్స్‌పెండీచర్ మీద ఖర్చు పెట్టొచ్చు. మనది అభివద్ధి చెందిన దేశమూ కాదు. అభివద్ధి చెందిన రాష్ట్రమూ కాదు. మన దగ్గర రూ.10లు ఉంటే.. ఆ రూ.10లు కేపిటల్ వ్యయంలో కంటే.. ప్రజలను ఆదుకోవాలని వెల్ఫేర్ వ్యయంలో పెట్టడం జరిగింది. తద్వారా ప్రజలకు సహాయం అందజేయటం జరిగింది. ఆ డబ్బులు ఎకానమీలోకి పంపింగ్ చేయటం జరిగింది. దానికి డబ్బులు అవసరం వచ్చాయి. అందుకోసం అప్పు చేయటం జరిగిందని ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నామని బుగ్గన స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని బుగ్గన తెలిపారు. – రెవిన్యూ రాబడి చూస్తే.. 2019–20 జూన్‌లో రూ.3541 కోట్లు ఉంటే.. 2020–21 నాటికి రూ.5785 కోట్లకు పెరిగింది. ఎక్కడ నుంచి పెరుగుతుంది. కోవిడ్ సమయంలో మొత్తం వ్యవస్థ కూలిపోతే రాబడి ఎక్కడ నుంచి పెరుగుతుంది. ప్రభుత్వం ముఖ్యంగా పేదలకు అవసరం ఉన్నవారికి డబ్బులు అందజేయటం (మనీ పంపింగ్) వల్ల ఎకానమీ మెయింటైన్ అయింది. అదే విధంగా 2019–20 జులైలో రూ.3915 కోట్లు ఉంటే.. 2020–2021లో రూ.6583 కోట్లు. 2019–20 సెప్టెంబర్‌లో రూ.6964 కోట్లు ఉంటే.. 2020–21 సెప్టెంబర్‌లో రూ.4937 కోట్లు 2019–20 అక్టోబర్‌లో రూ.2458 కోట్లు ఉంటే.. 2020–21 అక్టోబర్‌లో రూ.10047 కోట్లు అని బుగ్గన తెలిపారు. ఒక నెల ఎక్కువ మరొక నెల తక్కువ, పెరగటానికి కారణం క్వార్టర్లీ రిటర్న్స్, ట్యాక్సేషన్ ఫైల్ చేసినప్పుడు ఆ నెల మాత్రం ఎక్కువ చూపుతుంది. ఓవరాల్‌గా మనం ఎకానమీని మెయింటైన్ చేయగలిగాం. – పన్ను ఆదాయం కాకుండా పన్నేతర ఆదాయం చూసినట్లైతే.. 2021 జనవరిలో రూ.2569 కోట్లు వచ్చింది. అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కూడా సమర్థవంతంగా ప్రభుత్వం తెచ్చుకోగలిగింది. 2019–20 జనవరిలో రూ.13,558 కోట్లు అయితే ఈ ఏడాది 2020–21కి రూ.24,420 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రం తెచ్చుకుంది. టీడీపీ గతంలో కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్తులు. ఇద్దరు బీజేపీ మంత్రులు ఇక్కడ, ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్రంలో ఉన్నారు. ఎప్పుడూ ఏడుపే. మాకు ఢిల్లీ సహకరించలేదని ఏడుపే. ఎప్పుడూ వాళ్ళు సాధించామని చెప్పిన దాఖలాలు లేవు. ఏదో పడిపోయింది.. అన్న భయాందోళనలు సష్టించి దానిపై నటించడం తప్పు. ఈరోజు గమనిస్తే.. 2019–20లో రూ.2700 కోట్లు, 2020–21లో రూ.14828 కోట్లు. 2019–20 మేలో రూ.3789 కోట్లు 2020–21 మేలో రూ.10,061 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయటం జరిగింది. – పేదవారిని, మధ్యతరగతి వారిని కాపాడలనే ఉద్దేశంతో డీబీటీ ద్వారా నగదు బదిలీని ప్రభుత్వం చేయటం జరిగింది. ఎక్కడా మధ్యవర్తి లేకుండా నేరుగా నగదు పంపిణీ చేయటం జరిగింది. మీరు సహాయం చేస్తారా అని ప్రతిపక్షం మాట్లాడుతున్నారు. మాట్లాడటానికి ఏమీ లేక.. అప్పు.. అప్పు అని మాట్లాడుతున్నారు. వడ్డీ విషయానికి వస్తే పోయిన సంవత్సరం జనవరికి రూ.13,222 కోట్లు కడితే.. ఈ సంవత్సరం రూ.15,131 కోట్లు కట్టడం జరిగింది. జీతభత్యాల విషయానికి వస్తే పోయిన సంవత్సరం జనవరికి రూ.29,829 కోట్లు అయితే ఇప్పుడు 33,578 కోట్లు. మీరు గమనించినట్లైతే ఎక్కడెక్కడ అవసరమో అక్కడ పెంచటం జరిగింది. ఎకానమీని మెయింటైన్ కోసమే ఇవన్నీ చేయటం జరిగింది. ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితిల్లోనూ ఎకానమీలోకి డబ్బును పంపిణీ చేయటం జరిగింది. దానివల్ల ఏదో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో చేస్తున్నాం? ఎందుకోసం చేస్తున్నాం? వేరే మార్గం ఉందా? ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. – స్థూల ఉత్పత్తిలో వేరే రాష్ట్రాల అప్పులతో పోల్చినట్లైతే ఆంధ్రప్రదేశ్ 32.7 శాతం ఉంది. ఇది నిజమే. మామూలుగా 28% ఉండాల్సింది. 32% వచ్చింది. కానీ మిగతా రాష్ట్రాలు కూడా చూస్తే.. కేరళ 30.3%, పంజాబ్ 38.7%, రాజస్థాన్ 34.5%, ఉత్తర ప్రదేశ్ 33.1%, వెస్ట్ బెంగాల్ 34.7% ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక తప్ప ప్రతి రాష్ట్రమూ అప్పుల్లోనే ఉన్నాయి. సమస్య ఉంది. సమస్యలేదని ఎవ్వరూ చెప్పటం లేదు. వాటిని బయటపడేది ఎలా అని చూస్తున్నారు. స్థూల ఉత్పత్తిలో భాగంగా చూస్తే ఏప్రిల్, మే, జూన్ (2020–2021) త్రైమాసికంలో –12.96కి పోయింది. ఇది కేవలం ఒక్క ఏపీకి మాత్రమే కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. రెండో త్రైమాసికానికి వచ్చేసరికి –9.9, మూడో త్రైమాసికానికి –5.5, నాలుగో త్రైమాసికానికి –3.15, యావరేజ్ –7.66 వచ్చింది. ప్రతిపక్షాలు ఎక్కువైందంటే.. అవుతుంది, ఎందుకు కాకుండా పోతుంది. రాబడి లేదు. పన్నులు లేవు, అన్నీ బంద్. లాక్‌డౌన్. – రెవిన్యూ లోటు విషయానికి వస్తే.. 1.8 ఉంటుందని బడ్జెట్ అంచనాల్లో పెట్టాం. మొదటి త్రైమాసికంలో 10.5, రెండో త్రైమాసికానికి –7.7, మూడో త్రైమాసికానికి –1.8, నాలుగో త్రైమాసికానికి –2.4, యావరేజ్ –5 వచ్చింది. త్రైమాసికానికి త్రైమాసికానికి బాగు అవుతున్నామో.. లేదో చూడాలి. జీఎస్టీ వసూళ్ళలో దేశంలోనే ఏపీ రెండవ స్థానం· – జీఎస్టీ వసూళ్లలో జూన్ నుంచి డిసెంబర్ (2020–21) వరకు చూస్తే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. కోవిడ్ నుంచి రికవరీ అయిన తర్వాత రూ.16,169 కోట్లు వచ్చాయి. (గతేడాది రూ.14,290 కోట్లు) అంటే 8% వద్ధిని జీఎస్టీ వసూళ్లలో రాష్ట్రం నమోదు చేసింది. మన సిద్ధాంతం ప్రకారం.. ఏదో ఒకరూపంలో ప్రజలకు ఉపయోగపడేలా నగదు పంపిణీ చేశాం. అది తిరిగి పన్ను రూపంలో మనకు వస్తోంది. జీఎస్టీ వసూళ్లలో నెలవారీగా చూస్తే ఏప్రిల్ నెలలో భారతదేశం –71 ఉంటే, ఆంధ్రప్రదేశ్ –78 ఉంది. మే నెలలో భారతదేశం –38 ఉంటే, ఆంధ్రప్రదేశ్ –42 ఉంది. జూన్ నాటికి భారతదేశం –9 ఉంటే, ఆంధ్రప్రదేశ్ +6కు వచ్చింది. జులైలో భారతదేశం –14 ఉంటే, ఆంధ్రప్రదేశ్ –0.01కి వచ్చింది. ఆగస్టులో భారతదేశం –12కు ఉంటే.. ఆంధ్రప్రదేశ్ –7.5 వచ్చింది. సెప్టెంబర్‌కు భారతదేశం 3.88 మైనస్ నుంచి ప్లస్‌లోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ 7.86కు వచ్చింది. అక్టోబర్ నెలలో భారతదేశం 10.2 వద్ధి నమోదు చేస్తే.. ఆంధ్రప్రదేశ్ 25.6కు వచ్చింది. అక్టోబర్ నెలలో అర్థ సంవత్సర రిటర్న్స్ ఫైల్ చేసి ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కువగా ఉండి ఉండవచ్చు. ఆ తర్వాత నవంబర్‌లో భారతదేశం 1.4 అయితే, ఆంధ్రప్రదేశ్ 12.4గా నమోదు అయింది. డిసెంబర్‌లో భారతదేశం 11.5కి వస్తే.. ఆంధ్రప్రదేశ్ 13.5గా జీఎస్టీ వసూళ్లు నమోదు అయింది. దేశం యావరేజ్ కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వసూళ్లు వచ్చాయి. దేశంలోనే ఎక్కువ వసూళ్లు చేసిన రాష్ట్రంగా నిలిచింది. ఇది ఎలా సాధ్యమైంది? కోవిడ్ సమయంలో పరిశ్రమలు బంద్, సర్వీసులు బంద్ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే. ఇబ్బందికరమైన నిర్ణయం అయినా ప్రభుత్వం డబ్బులు పేదవారికి ఏదో ఒకరూపంలో చేరాలని ఆడబ్బు ఎకానమీలో రొటేషన్ జరగాలని.. ఆ డబ్బును పంపింగ్ చేయటం జరిగింది. వ్యవసాయాభివద్ధిలో ముందున్నాం· – స్థూల ఉత్పత్తి చూసినట్లైతే... వ్యవసాయరంగంలో దేశం 3గా ఉంటే రాష్ట్రం 4.16గా ఉంది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే. మ్యానిఫ్యాక్చురింగ్ ఇండస్ట్రీ దేశం –8.2 ఉంటే ఏపీ –3.26 ఉంది. సర్వీసెస్ భారతదేశం –8.1 ఉంటే ఏపీ –6.7గా ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లనే అన్నింటిలోనూ రాష్ట్రం మెరుగ్గా ఉన్నాం. ఆ నిర్ణయాల్లో కొంతవరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాబట్టి చేయాల్సి వచ్చింది. – కష్టకాలంలోనూ కేపిటల్ ఎక్స్‌పెండీచర్‌ను రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. 2019–20లో రూ.6800 కోట్లు కేపిటల్ ఎక్స్‌పెండీచర్ కింద ఖర్చు చేయటం జరిగింది. కోవిడ్ సంవత్సరంలో జనవరి నెలకు రూ.19,000 కోట్లు కేపిటల్ ఎక్స్‌పెండీచర్ కింద ఖర్చు చేయటం జరిగింది. కేపిటల్ ఎక్స్‌పెండీచర్‌తో పాటు రెవిన్యూ ఎక్స్‌పెండీచర్ ఎక్కువగా ఖర్చు చేయటం జరిగింది. ప్రత్యేకంగా పేదవారిని కాపాడుకోవటం కోసమే అప్పు ఎక్కువ చేయటం జరిగింది. దీనిని తప్పు చేశారని అనటం సరికాదు. సుమారుగా చూస్తే ముఖ్యమైన సంక్షేమ పథకాల్లో అమ్మ ఒడిలో 44.48 లక్షలు మంది లబ్దిదారులకు రూ.6,500 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయటం జరిగింది. తద్వారా ఆ కుటుంబాలకు, ఆ పిల్లలకు మంచి జరుగుతుందని ప్రభుత్వం ఖర్చు చేసింది. జగనన్న వసతి దీవెనలో 15.50 లక్షల మందికి రూ.2,400 కోట్లు, జగనన్న విద్యాదీవెన 18.80 లక్షల మందికి రూ.3,000 కోట్లు, 54 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా రూ.3950 కోట్లు, వైయస్‌ఆర్ చేయూత ద్వారా 24.55 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4500 కోట్లు, వైయస్‌ఆర్ ఆసరా ద్వారా 88 లక్షల మందికి రూ.6500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయటం జరిగింది. గతంలో వ్యవసాయ రంగంలో బీమా అనేది లేదు. రైతు కట్టాల్సిన వాటా కూడా ప్రభుత్వమే ఇప్పుడు కడుతోంది. ఐదేళ్లు, పదేళ్ల తర్వాత అలవాటు అయిన తర్వాత రైతులే కట్టుకుంటారని, దానికి అలవాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వమే కడుతోంది. ఇచ్చిన డబ్బంతా ఎకానమీలోకి వచ్చింది. బీజేపీ గెలుపు కోసం చంద్రబాబు ప్రచారమా..? – నిన్న చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల క్యాంపెయిన్‌కు కర్నూలు వెళ్లి ఏవేవో మాట్లాడారు. అసలు చంద్రబాబు ఎవరి కోసం క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు పక్కన టీజీ వెంకటేష్ కొడుకు. టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నారు. టీజీ వెంకటేష్ కొడుకుతో కలిసి చంద్రబాబు ప్రచారం చేయటం ఏంటి? ఎవరి తరుపున క్యాంపెయిన్ చేస్తున్నారో ఎవరు మీ పార్టీలో ఉన్నారు. మీ పార్టీలో ఉన్నారా? లేదా అన్న లెక్క, అంచనా కూడా చంద్రబాబుకు లేదు. ప్రజల్లోకి వెళ్లి ఇన్ని లక్షల మందికి ఇన్ని రకాలుగా ప్రభుత్వం ఉపయోగపడుతోంది తప్పు అని చంద్రబాబు చెప్పగలరా? అవినీతి జరుగుతోందని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు అంటే ఇస్తున్నవన్నీ డీబీటీనే. మధ్యలో మనిషే లేడు. ఏదీ లేదు కాబట్టి.. అప్పు ఎక్కువ. పేదవానికోసం, మధ్యతరగతి వారి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. ఏం పీకుతారో.. ప్రజలు ఎన్నికల్లో చూపిస్తూనే ఉన్నారు· – మేనిఫెస్టోలో చెప్పిన నవరత్నాలను సంపూర్ణంగా అమలు చేయటం జరిగింది. గతంలో చంద్రబాబు సంపూర్ణ రుణమాఫీ అని చెప్పారు. అది రూ.87 వేల కోట్లకు వచ్చింది. దాన్ని శాస్త్రీయంగా రకరకాలుగా పెట్టి రూ.24 వేల కోట్లకు బాబు తగ్గించారు. చంద్రబాబు ఐదేళ్లలో రుణమాఫీ కింద రూ.15 వేల కోట్లు కూడా చెల్లించలేదు. 2019లోనూ చెల్లింపులు చేయలేదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లోనూ రుణమాఫీ ప్రస్తావనే లేదు. ఆశ్చర్యకరమైన పద్ధతిలో చంద్రబాబు, ఆయన కుమారుడు ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఏం పీకుతారు.. అని మాట్లాడుతున్నారు. ఏందా ఆ భాష? పబ్లిక్ చూస్తున్నారు కాబట్టే రిజల్ట్స్ ఇలా వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాలకు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం, అభిమానం ఉందో ఎన్నికల ఫలితాల ద్వారా తెలిసిపోతోంది. – కర్నూలులో క్యాంపెయిన్ చేస్తూ నేను కథలు చెబుతానని, అక్రమంగా సంపాదిస్తానని చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఒక విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెబుతాం. మరి, దానికి అంత చులకనగా విమర్శలు చేస్తారా? లేకపోతే చంద్రబాబులా వచ్చీరాని ఇంగ్లీషులో మాట్లాడాలా? ఆమాటను చంద్రబాబును చెప్పమనండి. మైనింగ్‌లో అక్రమంగా సంపాదించలేదు. మైనింగ్ వ్యాపారంలోకి 1918లో మా ముత్తాత వచ్చారు. 100 సంవత్సరాల నుంచి మైనింగ్ వ్యాపారం చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ పాత ఇన్నోవా కారులోనే తిరుగుతున్నాను. ఈ విషయం చంద్రబాబు తెల్సుకోవాలి. కానీ, చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు రెండు ఎకరాల రైతు. కానీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు చంద్రబాబు పెట్టారు. ఎవరిది నీతి..? అన్నది చంద్రబాబు ఒకసారి చూసుకోవాలి. మా ఊరుకు చంద్రబాబు వచ్చి మా ఇల్లు చూడాలి. చంద్రబాబు నారావారిపల్లెలో ఇల్లు కానీ, హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇల్లు కట్టిన మాట వాస్తవం కాదా.. అని బుగ్గన ప్రశ్నించారు. నీతి గురించి చంద్రబాబు మాట్లాడతారా? పక్కన ఉన్నవారు స్లిప్ అందిస్తే మాట్లాడటమే. నేను హైదరాబాద్‌లో ఇప్పటికీ అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నాను. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు పెడుతున్నాం – కర్నూలుకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించటంపై బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం కర్నూలుకు హైకోర్టు పెడతామని సీఎం ప్రకటన చేశారు. అంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరైనా తీసుకోగలరా? 1937లో జరిగిన శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు కర్నూలులో పెట్టాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అవునా? కాదా? బెంగుళూరు–హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ డిక్లేర్ చేసి 9వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కట్టడం కోసం ప్రభుత్వం పూనుకుంది. ఈ విషయం చంద్రబాబుకు తెల్సా? గత ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్–బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌ను చంద్రబాబు ఎందుకు సాధించలేకపోయారు. కానీ, ఈ ప్రభుత్వం సాధించింది. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో లక్షలాది మందికి ఉపాధి కల్పించటానికి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తోంది. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు సిద్ధం కాకముందే చంద్రబాబు కొబ్బరికాయ కొట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల తరబడి కష్టపడి ఎయిర్‌పోర్టును సిద్ధం చేసింది. కర్నూలు ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి మార్చి 28న మొట్టమొదటి ఫ్లైట్ టేకాఫ్ కాబోతోంది. 1972లో పి.వి.నరసింహారావు కాలేజీ స్థాపించారు. సిల్వర్ జూబ్లీ కాలేజీ స్థాపించారు. మెరిట్ స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ కోసం ప్రత్యేక కోర్సు కోసం ఆ కాలేజీ స్థాపించారు. ఈరోజు ఈ ప్రభుత్వం ఆ గొప్ప ఆలోచన మీద గౌరవంతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టడానికి సిద్ధమైంది. నంద్యాల హైవే, బెంగుళూరు హైవే లింకప్ చేస్తూ.. ఎన్‌హెచ్ 340బి కొత్త ఎన్‌హెచ్ ఈ ప్రభుత్వం సాధించింది. ఇన్ని చేస్తే.. మీరు ఏం చేశారని చంద్రబాబు అడుగుతారా? గాజులదిన్నె ప్రాజెక్టుకు నీరు లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా 3.50 టన్నుల టీఎంసీ నీరు విడుదల చేశాం. – తుంగభద్ర పుష్కరాలు వస్తే... గతంలో చంద్రబాబులా ఆర్భాటం, అల్లరి, అవినీతి చేయలేదు. కర్నూలు, నందికొట్కూరు, కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో జరగరానివి జరగకుండా కోవిడ్ సమయంలో ప్రతి రూపాయి ఖర్చు పెడుతూ.. రూ.200 కోట్లు రోడ్లకు, ఘాట్లకు ఖర్చు చేయటం జరిగింది. అదే చంద్రబాబు గతంలో కష్ణా పుష్కరాలు పబ్లిసిటీ కోసం పి.వి.సింధుకు ఘాట్ల దగ్గర మెడల్ ఇస్తారు. వేల మంది చూస్తారని చంద్రబాబు ఘాట్ల దగ్గర పి.వి.సింధుకు మెడల్ ఇచ్చారు. అదే ఘాట్లలో సాయంత్రం అయ్యాక స్థూల ఉత్పత్తి గురించి భక్తులతో చంద్రబాబు మాట్లాడారు. అదీ ఆయన మేధస్సు. ఎవరైనా స్లిప్పులు ఇస్తే.. నీతి, అవినీతి గురించి మాట్లాడటం. రామన్ పిళ్లై అనే అతను పెట్రోల్ కనుక్కొన్నాను అంటే వెళ్లి రూ.10 లక్షలు కూడా ఇచ్చారు. ఎందుకు అంటే పబ్లిసిటీ ఎక్కడ మిస్ అవుతానో అనేలా చంద్రబాబు వ్యవహరించారు. –మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ – ఎక్సైజ్ ఏమీ తగ్గలేదు. రేటు పెంచి ఆదాయం మెయింటైన్ కావాలి. సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ట్రాన్స్‌పోర్టు, మైన్స్, ఫారెస్ట్‌లు నుంచి ఆదాయం వస్తుంది. ఎక్సైజ్ విషయంలో ప్రజలు తాగేది తగ్గాలి. రేటు పెరగటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా ఉంది. ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం ఎస్క్రో చేసి తద్వారా వాడుతున్నాం. – కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఎఫ్‌ఆర్‌బీఎంను 2శాతం అదనంగా తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. మనకు ఈ సంవత్సరం 4, వచ్చే సంవత్సరం 3.5, ఆ పై సంవత్సరం 3 తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడూ లేని విధంగా 12 లక్షల కోట్ల రుణాలు అప్పుల్లో ఉంది. కోవిడ్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా ముందు బ్రతికించి తర్వాత పరిస్థితులను చక్కదిద్దాలని చూస్తున్నారు. – కార్పొరేషన్లు నడవటానికి లోన్లు తీసుకుంటారు. లక్ష కోట్లు వరకు కార్పొరేషన్ల మీద లోన్లు ఉన్నాయి. గత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు రుణాలు చేసింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.40 వేల కోట్లు కార్పొరేషన్ల మీద రుణాలు చేసింది. గత ప్రభుత్వం సివిల్ సప్లైస్ కోసం తీసుకొని, పసుపు–కుంకుమ వంటి పథకాలకు వాడేశారు. మనం అలా కాకుండా ఏమేరకు తీసుకుంటున్నామో ఆ మేరకు ఖర్చు చేస్తున్నాం.