ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమే

సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి కమిటీ వేశారు

చ‌ర్చ‌ల‌కు పిలిచినా రాక‌పోవ‌డం బాధాక‌రం

నాలుగుమెట్లు దిగి మాట్లాడుతామన్న మాటను అలుసుగా తీసుకోవద్దు

జీతాలు ఏ ఒక్కరికీ రూపాయి కూడా తగ్గే పరిస్థితి లేదు

ఘర్షణ వాతావరణం వద్దు.. సమస్యను సద్భావంతో పరిష్కరించుకుందాం

ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సత్యనారాయణ అప్పీల్‌

సచివాలయం: ఉద్యోగులకు సమస్య వస్తే తమకు వచ్చినట్టేనని, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, సమస్య ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడాలని, పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీఆర్సీ ప్రకటన చేసిన తరువాత కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.. అంశాలపై క్లారిఫికేషన్‌ కావాలని ఉద్యోగ సంఘాలు అడిగిన వెంటనే  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగుల అభ్యంతరాలు, అపోహలు, అంశాలను పరిశీలించడానికి మంత్రుల కమిటీ ప్రయత్నం చేస్తున్నా గత ఐదు రోజులుగా ఉద్యోగ సంఘాలు చాలా మొండివైఖరితో వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ పదం వాడుతున్నానని అపార్థం చేసుకోవద్దని, ఎందుకంటే ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగం.. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ఉన్న 3.50 లక్షల ఉద్యోగులు, మరో 3 లక్షల మంది పెన్షనర్లు కానీ బయటివారు కాదు.. అందరూ ఒక కుటుంబం.. ప్రభుత్వంలో అంతర్భాగమని చెప్పారు. ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు చర్చలకు రావాలని పదే పదే కోరుతున్నామని, నాలుగు మెట్లు దిగైనా మాట్లాడతామని చెప్పామన్నారు. వారు ఆ మాటను అలుసుగా తీసుకుంటున్నారో అర్థం కావడం లేదని, ఎవరి ధర్మ, ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించాలని చెప్పారు. 

ఉద్యోగ సంఘాలు రాజకీయ ఆలోచనతో ఉన్నారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఎన్నో ఉద్యోగ సంఘాల పోరాటాలు చూశాం కానీ, ఇలాంటి వైఖరి ఎప్పుడూ చూడలేదని, ఏదైనా సమస్య ఉంటే దాన్ని చర్చల ద్వారానే ∙పరిష్కరించగలమన్నారు. రాష్ట్రం తాలూకా పరిస్థితిని అర్థం చేసుకొని మంచి ఆలోచనతో ఉండాలని కోరారు. 

ఒకటవ తేదీ వచ్చే జీతాల పే స్లిప్‌లో చూసుకోమంటే జీతాలు పెరిగాయో.. తగ్గాయో ప్రజలకు చూపించొచ్చు కదా..? ఉద్యోగుల జీతాలు ఏ ఒక్కరికీ రూపాయి కూడా తగ్గే పరిస్థితి లేదన్నారు. సమస్యలు ఉంటే చర్చలతో పరిష్కారం తెచ్చుకోవాలని మరోసారి కోరారు. ఎలాంటి అపోహలకు వెళ్లొద్దని, ఘర్షణ వాతావరణం వద్దని, సమస్యను సద్భావంతో పరిష్కరించుకునేందుకు కమిటీ సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్యోగులకు, వారి సంఘాలకు మరోసారి అప్పీల్‌ చేశారు. 
 

Back to Top