విజయవాడ: నారాయణ సిబ్బందే టెన్త్ పేపర్లు లీక్ చేశారని, ప్రశ్నాపత్రాలు వాట్సాప్‌లో పంపించి మాస్ కాపీయింగ్ చేయించి.. లబ్ధిపొందాలనే ప్రయత్నం చేశారని, ఈ కేసులో నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్‌ను కూడా అరెస్టు చేశామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నారాయణ అరెస్టుపై మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పేపర్ లీకేజీపై క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని పోలీసులను ఆదేశించామన్నారు. విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగానే.. పోలీసులు వారిపని వారు చేసుకుంటూపోతారన్నారు. పేపర్ లీకేజీకి సంబంధించి 60 మందిని అరెస్టు చేశామని, అందులో సుమారు 35 మంది ప్రభుత్వం, 22 మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారని చెప్పారు. వారిలో నారాయణ స్కూల్‌కు సంబంధించిన వైస్ ప్రిన్సిపల్, టీచర్లు కూడా ఉన్నారని వెల్లడించారు. అందరినీ విచారణ చేసిన తరువాత.. వాస్తవాలు తెలుసుకున్న తరువాతే పోలీసులు నారాయణను అరెస్టు చేశారని చెప్పారు.