చంద్రబాబు దొరికిన దొంగ.. అందుకే బేల మాటలు

మీడియా స‌మావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ  

సీమెన్స్‌తో ఒప్పందంపై ఎందుకు మాట్లాడడం లేదు?

ఆ సంస్థ తన వాటా రూ. 3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు?

క్యాబినెట్‌ తీర్మానం, ఆ తర్వాత ఒప్పందంలో తేడా ఎందుకు?

సీమెన్స్‌ వాటా ఇవ్వకున్నా రూ. 371 కోట్లు ఎలా ఇచ్చారు?

వీటన్నింటిపై చంద్రబాబు, టీడీపీ నేతల సమాధానం ఏమిటి?

సూటిగా ప్రశ్నించిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఎక్కడా అవినీతికి తావునివ్వకుండా చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

ఏ అక్రమం దృష్టిలోకొచ్చినా ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం

అది మా ప్రభుత్వ నిబద్ధత. అంకితభావం

 తేల్చి చెప్పిన మంత్రి  బొత్స సత్యనారాయణ

చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ స్పీకర్‌ వ్యాఖ్యలు సరికాదు

పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శలు ఖండిస్తున్నాం

చంద్రబాబు వ్యవహారం ఎంత వరకు సబబు?

బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఏమిటా వ్యాఖ్యలు?

చంద్రబాబు తప్పు చేయలేదని పోచారం భావిస్తున్నారా?

అయితే ఆ విషయాన్ని ఆయన సీఎం కేసీఆర్‌తో మాట్లాడాలి

 ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స స్పష్టీకరణ

విజయవాడ:  మాజీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ.. అందుకే బేల మాటలు మాట్లాడుతున్నార‌ని మంత్రి బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు. దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు.  స్కిల్‌ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్‌ సీఎం దగ్గరకు వెళ్తుంది. దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. రిమాండ్‌ కొనసాగింపు సందర్బంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు. అందుకే ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాల‌న్నారు. శ‌నివారం విజ‌య‌వాడ‌లోని క్యాంపు కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

దొరికిన దొంగ:
    గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు. జ్యుడీషియల్‌ కస్టడీ. ఇప్పుడు ఆయన సీఐడీకి రెండు రోజుల రిమాండ్‌. మరోవైపు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌ హైకోర్టు తిరస్కరించడం.. అందరూ చూస్తున్నారు. నిన్న (శుక్రవారం) చంద్రబాబు వర్చువల్‌ విచారణలో ఏసీబీ జడ్జి ముందు ఆవేదన చెందారు. తాను నీతిమంతుడ్ని అని చెప్పుకొచ్చారు. దాన్ని ఎల్లో మీడియా బాగా హైలైట్‌ చేసింది. అదే సమయంలో మా ప్రభుత్వంపై ఉన్న ఆక్రోషం, చంద్రబాబుపై ప్రేమను చూపాయి.
    ప్రజా జీవితంలో ఉన్న వారు, పరిపాలన చేసే వాళ్లు, ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కడా అవినీతికి పాల్పడవద్దు. కానీ చంద్రబాబునాయుడుగారు ఎన్నో సందర్భాల్లో ఆయన వాటన్నింటినీ అతిక్రమించారు. కానీ ఎప్పుడూ దొరకలేదు. ఇప్పుడు దొరికి దొంగ అయ్యారు. దీంతో ఆయన బేలగా మాట్లాడుతున్నారు.

వీటికి సమాధానం చెప్పగలరా?:
    ఒక్క విషయం అడుగుతున్నాం. మీరు ఆరోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో.. దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు? మన ప్రభుత్వం వాటా రూ. 371 కోట్లు ఇచ్చారు. కానీ సీమెన్స్‌ కంపెనీ తన వాటాగా ఇవ్వాల్సిన దాదాపు రూ. 3 వేల కోట్లు ఎందుకు ఇవ్వలేదు? మరి అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసింది? దీనిపై చంద్రబాబు కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ అస్సలు ఎందుకు మాట్లాడడం లేదు?
    మరి ఒప్పందం చేసుకున్న డిజైన్‌ టెక్‌ కంపెనీ ఏ పద్ధతిలో ఎంపిక చేసుకున్నారు? ఏ విధానంలో ఆ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.
అవన్నీ అక్రమం అని చంద్రబాబుకు తెలియదా? అంటే తెలిసే ఆయన ఆ అక్రమానికి తెర లేపారు. 

సీమెన్స్‌ పెట్టుబడి ఎందుకు రాలేదు?:
    మేము సీమెన్స్‌ కంపెనీ మంచిది కాదని చెప్పడం లేదు. ఆ కంపెనీని తప్పు పట్టడం లేదు. కానీ మీరు ఆ కంపెనీతో ముందు చేసుకున్న ఒప్పందం ఏమైంది? ఆ కంపెనీ ఎందుకు పెట్టుబడి పెట్టలేదని మాత్రమే అడుగుతున్నాం? సీమెన్స్‌ కంపెనీ గుజరాత్‌లో ఒప్పందం చేసుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యాక్టివిటీ చేసింది. కానీ అందుకు చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు. అక్కడ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారు. పిల్లలకు శిక్షణ కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ సీమెన్స్‌ కంపెనీ ఏ పనీ చేయలేదు. వారు పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేదు. 

పోచారం వ్యాఖ్యలు ఖండిస్తున్నాం:
    నిన్న తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. కారణం చెప్పకుండా చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నాం. చంద్రబాబు తప్పు చేయలేదని ఆయన అనుకుంటే, ఆ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడాలి.

చంద్రబాబును అడగండి:
    మా ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా, చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఎక్కడ, ఏ అవకతవకలు జరిగినట్లు తెలిసినా, ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఆధారాలతో సహా నిరూపిస్తున్నాం. 
    ఈరోజు ఎల్లో మీడియా పేజీలకొద్తీ రాశాయి. వారినే అడుగుతున్నాను. వెళ్లి చంద్రబాబును అడగమనండి. ఏమయ్యా, సీమెన్స్‌ కంపెనీ ఒప్పందం ప్రకారం పెట్టుబడి ఎందుకు పెట్టలేదు? ఇక్కడ ఏ కార్యకలాపాలు నిర్వహించలేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేసిందని.. చంద్రబాబును అడగాలి.
    ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజాధనాన్ని కాపాడాలి. అంతేకానీ, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు.

 అంత పెట్టుబడి అవసరమా?:

    మేము సీమెన్స్‌ కంపెనీని ఏం అనడం లేదు. తమకు ఆ ఒప్పందంతో సంబంధం లేదని స్వయంగా సీమెన్స్‌ కంపెనీ చెప్పింది. ఆ మెయిల్‌ లేఖ కూడా మేము చూపాం. మీరు అడుగుతున్నారు కదా.. సీమెన్స్‌ కంపెనీ తమ పెట్టుబడి పెట్టకుండా, ఆ మొత్తం రూ. 2900
 కోట్లకు సాఫ్ట్‌వేర్‌ ఇచ్చారా?
    అసలు మన దగ్గర సెంటర్లు ఎక్కడున్నాయి? ఒక్కో సెంటర్‌కు రూ. 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. నిజంగా వాటికి అంత పెట్టుబడి అవసరమా? అసలు వాటికి సీమెన్స్‌ కంపెనీ, సాఫ్ట్‌వేర్‌ ఏమైనా ఇచ్చిందా? అవన్నీ చూద్దాం. సీమెన్స్‌ కంపెనీ కేవలం రూ. 55 కోట్ల సాఫ్ట్‌వేర్‌ మాత్రమే ఇచ్చింది. ఆ మొత్తం తమకు వచ్చిందిన సీమెన్స్‌ కంపెనీ కూడా చెప్పింది. 

వారు క్లియర్‌గా రాశారు:
    ఈ వ్యవహారంలో అధికారుల ప్రమేయం ఉంటే.. వారు బాధ్యులై ఉంటే, చర్యలు ఉంటాయి. ఈ క్షణం వరకు ఎవరైతే అధికారులు ఉన్నారో.. వారికి ప్రమేయం ఉందని తెలిస్తే.. చర్యలు తీసుకుంటాం. కానీ, ఆరోజు అధికారులు చాలా స్పష్టంగా రాశారు. నిధులు విడుదల చేయొద్దని రాశారు. అయినా అప్పటి సీఎం ఆదేశాల మేరకు నిధులు విడుదల చేశారు. అదే విషయాన్ని వారు స్వయంగా నోట్‌లో రాశారు.
ప్రేమచంద్రారెడ్డి ఏ రిలీజ్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు.
    మాకు ఎవరిపైనా ప్రేమ లేదు. ద్వేషం లేదు. ఎవరైనా తప్పు చేస్తే, చర్యలు తీసుకుంటాం. మీరు అంటున్నారు కదా.. ప్రేమచంద్రారెడ్డి రాశారని. ఉంటే చూపండి. మాకు ఎవరైనా ఒకటే. ఒప్పందంలో స్పష్టత లేదని, కాబట్టి ప్రభుత్వం నిధులు విడుదల చేయొద్దని అప్పటి అధికారులు కోరారు. అయినా, అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతో రూ. 371 కోట్లు ఇచ్చారు.
    దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. బ్లూబుక్‌ ఉంటుంది. అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తి (స్వయంగా సీఎం) నేరుగా ఆదేశిస్తే.. అధికారులు అమలు చేయక తప్పదు కదా?

వారే బాధ్యులవుతారు:
    క్యాబినెట్‌ నిర్ణయం ఒక సమష్టి బాధ్యత. అయితే ఆ నిర్ణయం వెనక జరిగే లావాదేవీలు, ఆ నిర్ణయం అమలులో అవకతవకలు, అందులో జరిగే అవినీతికి.. మంత్రివర్గం బా«ధ్యత వహించదు. ఎవరైతే అందులో ఇన్‌వాల్వ్‌ అవుతారో వారే పూర్తిగా బాధ్యులవుతారు. ఇదీ నియమం.
    ఇక్కడ జరిగిన దోపిడి అదే. నిర్ణయం క్యాబినెట్‌ది అయినా, అమలులో చంద్రబాబు యథేచ్ఛగా నిబంధనలు తుంగలో తొక్కి, అవినీతికి పాల్పడ్డాడు.
    బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా అధికారులు వ్యవహరిస్తే, వారిపై చర్యలు ఉంటాయి. కానీ ఈ కేసులో అధికారులు నియమావళి ఉల్లంఘించ లేదు. నిధులు విడుదల చేయడం సరికాదని చెప్పారు. అదే విషయాన్ని నోట్‌లో కూడా రాశారు.

అప్రిసియేషన్‌ లెటర్‌ లేదు:
    రాష్ట్రంలో అప్పటి స్కిల్‌ సెంటర్ల సాఫ్ట్‌వేర్‌పై అప్రిసియేషన్‌ లెటర్‌ మేము ఇవ్వలేదు? ఎవరు చెప్పారు? మీరంటున్న ఆప్రిసియేషన్‌ లెటర్‌ ఎక్కడుంది? చెప్పండి. బాబు హయాంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా ఎంత మంది, ఏయే శిక్షణ పొందారు.. వివరాలు అందిస్తాం.

చాలా గౌరవంగా వ్యవహరించారు:
    చంద్రబాబు అరెస్టు తీరులో ఏం తప్పు చేశారు? ఆయనను బలవంతంగా లాక్కుని రాలేదు కదా? కొట్టలేదు కదా? చాలా గౌరవంగా వ్యవహరించారు. ఆయన నిద్ర లేచే వరకు వేచి చూసి, ఆ తర్వాత కూడా చాలా గౌరవంగా వ్యవహరించారు. పగలు అయితే అందరూ వస్తారు. హడావిడి చేస్తారంటే.. చంద్రబాబు కూడా ఒప్పుకున్నారు. రాత్రి పూట ఆయన దగ్గరకు వెళ్లినా, తెల్లవారే వరకు ఎదురు చూశారు.

ఎందుకంత ఆక్రోశం:
    రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నాం. సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నాం.
    రాష్ట్రం నుంచి పిల్లలు అమెరికా వెళ్లి, అక్కడ చక్కటి ప్రసంగాలు చేస్తుంటే.. దానిపైనా ఈరోజు ఎల్లో మీడియాలో ఆక్రోశంతో రాశారు. ఇదే మొదటిసారి. ఇలా పిల్లలు వెళ్లడం అని మేము ఏమైనా చెప్పామా? అధికారులు ఏమైనా చెప్పారా? ఆ విధంగా పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడం సరికాదు కదా? 

ఉద్యోగులు అర్ధం చేసుకోవాలి:
    సీపీఎస్‌ ఇబ్బందికరంగా ఉంది. పాత పెన్షన్‌ను కేంద్రం కూడా ఒప్పుకోవడం లేదు కాబట్టి.. వయా మీడియాగా కొత్త పెన్షన్‌ విధానం జీపీఎస్‌ రూపొందించాం. మాకు అవకాశం ఉన్నంత మేరకు ఉద్యోగులకు మేలు జరిగేలా చూశాం.
    ఓపీఎస్, సీపీఎస్‌.. రెండూ ముగిసిపోయిన అంశాలు. ఇప్పుడు ఉన్నది జీపీఎస్‌. సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు మేలు చేయాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం. లక్ష్యం. కాబట్టి దయచేసి అర్ధం చేసుకోవాలని ఉద్యోగులను కోరుతున్నాం. అభ్యర్థిస్తున్నాం.ఏమైనా ఒకటి, రెండు చిన్న మార్పులు కోరితే, తప్పకుండా పరిశీలిస్తాం. ఆ ఆప్షన్‌ ఎప్పుడూ ఉంటుంది.

మాకే అభ్యంతరం లేదు:
    రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి, తన ఉనికి కాపాడడం కోసం ఇక్కడ మద్యం విక్రయాల గురించి మాట్లాడుతున్నారు. ఏదో ఎంక్వైరీ కోరుతామన్నారు. కోరమనండి. మాకెలాంటి అభ్యంతరం లేదు అని మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
12

Back to Top