విశాఖ: ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులు అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం వేరు.. ఉద్యోగులు వేరు కాదనేది సీఎం వైయస్ జగన్ ఆలోచన అని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకునేవారు ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్య వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పారు. విద్యా కోసం రూ.12 వేల కోట్లు సీఎం వైయస్ జగన్ ఖర్చు చేస్తున్నారని తెలిపారు. 60 వేల క్లాస్ రూముల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు మా కుటుంబ సభ్యులే అన్నారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు చూస్తున్నాయని మండిపడ్డారు. మంగళవారం విశాఖలో నిర్వహించిన ఉపాధ్యాయుల దినోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో పాఠశాలల నుంచి సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ఒక్కటే అని తెలిపారు. ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెరగకుండా చూస్తున్నాం.. విద్యార్థులతో పాటు 20 వేల మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లు ఇచ్చాము అని ఆయన పేర్కొన్నారు. విద్య మీద ఖర్చు సంక్షేమం కాదు.. ఈ రాష్ట్ర అభివృద్ధికి పెడుతున్న పెట్టుబడి అని మంత్రి చెప్పారు. యూనివర్సిటీలో నియామకాలను దిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సబ్జెక్ట్ టీచర్ విధానం అమలు చేయాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రయత్నం జరుగుతున్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.. 10వ తరగతి ఫలితాల్లో ప్రయివేట్ స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన ఫలితాలు వచ్చాయని వివరించారు. ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం అయినా ఉంటుందా?.. అని ఆయన ప్రశ్నించారు. 8వ తేదీ నాటికి టీచర్ల ఖాతాలో జీతాలు పడతాయి.. ఈ సారి సాంకేతిక కారణాలతో జరిగిన అలస్యం వల్లే ఈ దుష్ప్రచారం జరుగుతోంది అని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.