తాడేపల్లి: టీడీపీ రెండు రోజుల మహానాడు ఆత్మస్తుతి..పరనిందలా సాగిందని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మహానాడు ద్వారా ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. రెండేళ్లుగా సీఎం వైయస్ జగన్‌పై విమర్శలకే చంద్రబాబు పరిమితమయ్యారని మండిపడ్డారు.ఓటుకు కోట్లు కే సులో చంద్రబాబు ‘‘మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ’’ అన్న వ్యాఖ్యలు ప్రపంచం మొత్తం వినిందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ప్రజలను మేనేజ్ చేసే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారన్నారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం వైయస్ జగన్ ఒక కమిట్‌మెంట్‌తో, ఆలోచనతో ముందుకెళ్తున్నారని చెప్పారు. కోవిడ్ నియంత్రణకు ప్రతిక్షణం సీఎం వైయస్ జగన్ శ్రమిస్తున్నారని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను 99 శాతం పూర్తి చేశారని వివరించారు. అవినీతికి అవకాశం లేకుండా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వరా లక్షా 20 వేల కోట్లను నేరుగా ప్రజలకు అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దేని చెప్పారు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలనే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారు. మనవాళ్లు బ్రిప్‌డ్ మీ..ఐయామ్ విత్ యూ అన్న చంద్రబాబు వాయిస్ క్లియర్‌గా ఉంది. ప్రపంచమంతా ఈ వ్యాఖ్యలు వినింది. ఫోరెన్సిక్ రిపోర్టు కూడా అది చంద్రబాబు వాయిస్ అని నిర్ధారించింది. వ్యవస్థలను గురించి తప్పు పట్టడం లేదు కానీ..సాక్ష్యాధారాలు కళ్ల ముందు కదలాడుతున్నా..ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కేసు పెట్టడంతో చంద్రబాబు భయంతో అర్ధరాత్రి అమరావతికి పారిపోయి వచ్చాడు. వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడంలో చంద్రబాబు దిట్ట. ప్రజలను మేనేజ్ చేయడం కూదరదు కాబట్టే 2019లో టీడీపీని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. ఇదీ చంద్రబాబు చరిత్ర..ఈ చరిత్రను మరిచిపోయి..మహానాడు అంటూ జూమ్‌లో మీటింగ్‌లు పెడుతున్నారు. సిగ్గుండాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు చూసి సిగ్గుపడాలి. దాచుకోవడం, దోచుకోవడమే పనిగా పెట్టుకుని చంద్రబాబు పాలన సాగించారు. ఈ రెండేళ్లలో ప్రధాన ప్రతిపక్షంగా విధానపరమైన కార్యక్రమాలు ఒక్కటి కూడా చేయలేదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసింది లేదు. కులాలు, మతాల మీదా, దేవుడి మీద, రథాల మీదా అభూత కల్పనలు సృష్టించి అసమానతలు సృష్టించేందుకు ఈ రెండేళ్లు చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. దేశం, ప్రపంచమంతా కూడా కరోనాతో పోరాడుతున్న నేపథ్యంలో..ఎవరి స్థాయిలో వారు కరోనా నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు పాత్ర కరోనా నియంత్రణలో ఏముంది?. మా ముఖ్యమంత్రి ఒక కమిట్‌మెంట్‌తో, మంచి ఆలోచనతో ప్రతి నిమిషం, ప్రతి గంట వెంట వెంటనే స్పందిస్తూ, సూచనలు ఇస్తూ పర్యవేక్షిస్తున్న తీరు దేశంలోనే అన్ని రాష్ట్రాలకు సీఎం వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారు. టెస్టింగ్, ట్రేసింగ్, వ్యాక్సినేషన్ అంశాల్లో సీఎం వైయస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలు ఆదర్శంగా ఉన్నాయి. ప్రతి అంశాన్ని ఇష్యూ చేయాలని హైదరాబాద్‌లో కూర్చొని తండ్రి కొడుకులు తాపత్రయ పడుతున్నారు. ఇవాళ మహానాడు పేరుతో తండ్రీ కొడుకుల తీరు చూస్తే నవ్వొస్తోంది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా ఇలాగే ప్రవర్తించారు. కార్యకర్తలపై ఏమాత్రం నమ్మకం లేకుండా పార్టీని నడుపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. సుమారు రూ.1.20 లక్షల కోట్లు ప్రజలకు నేరుగా అందజేసిన ఘతన సీఎం వైయస్ జగన్‌ది. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారికి ఈ ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పడంలో గర్వపడుతున్నాం. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓ శ్వేత పత్రం విడుదల చేశారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ.27 వేల కోట్లు కావాలని చెప్పిన వ్యక్తి ..ఐదేళ్లలో రూ.69 వేల కోట్లు ఖర్చు చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన కట్టబెట్టారు. చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి పునరావాసం కల్పించలేకపోయారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రగాల్భాలు పలికారు. ఏకవచన ంతో సవాలు విసిరారు. ఎందుకు పూర్తి చేయలేకపోయారు. మీరు చేయలేకపోయారు కాబట్టే ప్రజలు వైయస్ జగన్‌కు అధికారం కట్టబెట్టారు. చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు. టీడీపీ బా«ధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్లే ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికీ చంద్రబాబులో మార్పు రాలేదు. మహానాడులో ప్రజల సమస్యలేవీ కూడా చర్చించలేదు. చంద్రబాబు భజనకే వారి నేతలు కట్టుబడ్డారు. మహానాడులో చంద్రబాబు, లోకేష్ భజన తప్ప..ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం లేదు. ప్రజా సమస్యలపై స్పందిస్తే బాగుండేది. మేం చెప్పిందే జరగాలి. మేం చెప్పిందే రాజ్యాంగం అన్నట్లు చంద్రబాబు మీడియా అనుకుంటుంది. అది కరెక్ట్ కాదు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం పాలన సాగుతోంది. చంద్రబాబు బెదిరింపులకు మేం భయపడం. మా ప్రభుత్వం ఆడంభరాలకు, హంగులకు పోకుండా పాలన సాగిస్తోంది. ఎక్కడ సమస్య ఉత్పన్నమైనా వెంటనే స్పందిస్తున్నాం. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా మేం చట్టాలు చేస్తున్నాం. ప్రతి చట్టంలోనూ సామాన్యుడికే మేలు జరిగేటట్లు చూశాం. సామాన్యుడు తలెత్తుకునే తిరిగేలా ఈ ప్రభుత్వం పని చేస్తోంది. వైయస్ జగన్ ఎవరిని మేనేజ్ చేసిన వ్యక్తి కాదు. ప్రజా బలంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. కళ్లకు కట్టినట్లు డబ్బు కట్టలు టేబుల్ మీద పెట్టి ఎమ్మెల్యేలను కొంటూ..ముఖ్యమంత్రి స్థాయిలో ఫోన్ చేసి..మీతో ఉంటానని హామీ ఇచ్చిన వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా అంకితభావంతో ముందుకు వెళ్తున్నాం. బాధ్యతతో పని చేస్తున్నాం.రెండేళ్ల సీఎం వైయస్ జగన్ పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు. మున్ముందు ఇంకా సంక్షేమ పాలన సాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.