తాడేపల్లి: కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం చేస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అధికారులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారని చెప్పారు. బాధ్యత గల ప్రతిపక్షం ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప..ప్రజలను భయాందోళనకు గురి చేయకూడదన్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నియంత్రణకు నిరంతరం రివ్యూలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి తగు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మంత్రులతో రివ్యూలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న బెడ్స్, ఆక్సిజన్ సరఫరాపై రివ్యూ చేస్తున్నారు. 104కు కాల్ చేసిస మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని సంక్షోభం దేశంలో ఉంది.ఇలాంటి సమయంలో అందరం కలిసి ముందుకు సాగాలి. కానీ టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు, లోకేష్‌ల తీరు మారడం లేదు. తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనాతో యుద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. అక్సిజన్, బెడ్లు లేవంటూ దుష్ర్పచారం చేయడం ప్రతిపక్షానికి తగదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్‌లు నిర్వీర్యంగా ఉన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు. విజయనగరం ఘటనపై ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటిన స్పందించింది. ఎక్కడా ఇబ్బంది లేకుండా రోగులకు వైద్యం అందించాం. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలి. ప్రజలు అప్పగించిన బాధ్యతను ప్రభుత్వం నూరు శాతం నెరవేరుస్తోంది. బాధ్యత గల ప్రతిపక్షంగా మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలి తప్ప..విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం తగదు. చంద్రబాబు ఏ రోజైనా పనికొచ్చే సలహా ఒక్కటైనా ఇచ్చారా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రభుత్వంపై, ఉద్యోగులపై తప్పుడు ప్రచారం చేయడం వారికి తగదు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పక్క రాష్ట్రాల విద్యార్థులతో మనం ఎక్కడా వెనుకబడకూడదనే ఉద్దేశ్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు నిర్వహిస్తున్నాం. టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని లోకేష్ డిమాండు చేస్తున్నారు. మా పిల్లలు చదవడం లేదా? మాకు భయం ఉండదా? ఇలాంటి లేనిపోని ఆరోపణలు మానుకోవాలి. లాక్‌డౌన్ ఆఖరి అస్త్రమని సాక్ష్యాత్తూ ప్రధాని నరేంద్రమోదీనే చెప్పారు. ఆయన్ను టీడీపీ నేతలు ప్రశ్నించగలరా?. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గోదావరి పుస్కరాల సందర్భంగా చంద్రబాబు సినిమా షూటింగ్ కోసం 29 మంది అమాయక భక్తులను పొట్టన పెట్టుకున్నారని, అది అప్పటి ప్రభుత్వ హత్య అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వైద్యం అందించడం లేదని మా ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదు. పక్క రాష్ట్రాల్లో కూడా కరోనా రోగులు చనిపోతున్నారు. అవి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల హత్యలని టీడీపీ నేతలు చెప్పగలరా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.