చంద్రబాబు బలహీనవర్గాల ద్రోహి

59 శాతం రిజర్వేషన్‌ ఇస్తే ఎందుకంత కడుపుమంట

బలహీనవర్గాలు తెలుగదేశం పార్టీని ఎప్పటికీ క్షమించరు

ఇన్నేళ్లు అధికారం ఇచ్చిన బీసీలకు బాబు ఇచ్చే బహుమానం ఇదేనా..?

బీసీలకు మేలు చేసే ప్రతీ అంశంలో టీడీపీ అడ్డుపడుతోంది

అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు

నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం ఇచ్చాం

కోర్టు తీర్పుకు లోబడే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్తాం

మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లిన చంద్రబాబు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ ద్రోహిగా మిగిలిపోయాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌. అంబేడ్కర్‌ స్ఫూర్తితో సమాజంలో వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం  సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్నారన్నారు. బడుగు, బలహీనవర్గాల మేలు కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి చంద్రబాబు అడ్డుతగులుతున్నాడన్నారు. బీసీలంటే చంద్రబాబుకు చులకన భావం అని, ఇన్నేళ్లు అధికారం ఇచ్చిన బీసీలకు చంద్రబాబు ఇచ్చే బహుమానం ఇదేనా అని ప్రశ్నించారు. బలహీనవర్గాలు తెలుగుదేశం పార్టీని ఎప్పటికీ క్షమించరని, చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి ఏం మాట్లాడారంటే..  ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో 59 శాతం బడుగు, బలహీనవర్గాలకు ఉండాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకొని జనాభా ప్రాతిపదికన ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నేతృత్వంలో నిర్ణయం తీసుకున్నాం. ఆ అంశంపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో తీర్పు వచ్చింది. 50 శాతానికి లోబడి ఎన్నికలకు వెళ్లాలని, నెలరోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలని తీర్పు ఇచ్చారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు లోబడి ఆ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. చట్టాన్ని గౌరవిస్తున్నాం.. తీర్పును గౌరవించి ముందుకువెళ్తాం.

అత్యధిక శాతం ఉన్న బలహీనవర్గాలకు న్యాయం చేయలేకపోతున్నామే అనే బాధ మా పార్టీకి, మా నాయకుడికి ఉంది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు కుయుక్తులతో, దుర్మార్గపు ఆలోచనలతో నిలిచిపోయిందనే బాధ ఉంది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చరిత్రహీనులుగా మిగిలిపోతారు. బలహీనవర్గాలకు ఎప్పుడు ఏ కార్యక్రమం చేద్దామన్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏం చేద్దామన్నా చంద్రబాబు మోకాలొడ్డుతున్నాడు. బీసీలంటే చంద్రబాబుకు చులకనభావం. ఓట్లు మాత్రం కావాలి.. వారికి న్యాయం జరగకూడదని కోరుకునే వ్యక్తి బాబు. ఎస్సీ, ఎస్టీ కులాల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని కించపరిచేలా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. ఇలాంటి వ్యక్తిని ఎవరూ క్షమించరు. హైకోర్టులో వాద్యం వేసింది ప్రతాపరెడ్డి అని టీడీపీకి చెందిన నాయకుడు. ఈ వ్యక్తి బాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎన్‌ఆర్‌జీఎస్‌ స్టేట్‌ కమిటీలో మెంబర్‌. రాష్ట్రంలో 59 శాతం రిజర్వేషన్‌ ఇస్తే ఎందుకు చంద్రబాబుకు కడుపుమంట. ఇదేనా చంద్రబాబు బీసీలకు ఇచ్చే బహుమానం.

వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అన్ని పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, మార్కెట్‌ కమిటీలు, దేవాలయ ట్రస్టు బోర్డుల్లో, నామినేటెడ్‌ కార్పొరేషన్‌లో, స్టాండింగ్‌ కౌన్సిల్, యూనివర్సిటీల్లో ఈసీ నియామకాల్లో కూడా 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో మార్కెట్‌ కమిటీ మంత్రిగా చేశాను.. 300 మార్కెట్‌ కమిటీలు ఉంటే.. వాటిల్లో చైర్మన్లుగా ఇద్దరు మహిళలు, నలుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ముగ్గురు మైనార్టీలు ఉండేవారు. ఇవాళ 216 మార్కెట్‌ కమిటీలకు 50 శాతం మంది చైర్మన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైయస్‌ జగన్‌ అవకాశం కల్పించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ విభజన చేయాలని చూస్తే అది చట్టం కాకుండా టీడీపీ అడ్డుకుంది. పేద విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌ మీడియం చదవాలని బిల్లు పెడితే.. అసెంబ్లీలో సమర్థిస్తారు. కౌన్సిల్‌లో వ్యతిరేకిస్తారు.. ఆ బిల్లును ఆలస్యం చేయాలని చూశారు. ఇవాళ స్థానిక సంస్థల రిజర్వేషన్లలో 59 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రభుత్వం కోరుకుంటే.. దాన్ని కోర్టులో టీడీపీ కార్యకర్తతో వాద్యం వేయించి అడ్డుకున్నారు. కోర్టుకు ఎందుకు వెళ్తున్నారని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు చెందిన టీడీపీ నేతలు ప్రశ్నించాలి.

జనాభా ప్రతిపాదకన 59 శాతం ఇస్తే తప్పేంటని పట్టుదలతో ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఏదో విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆపేయాలి.. గ్రామీణ, పట్టణాభివృద్ధి జరగకూడదు అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోంది. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసి అప్పులపాలు చేసింది కాకుండా.. ఎన్నికలకు సజావుగా వెళ్తుంటే.. వాయిదా వేయాలనే ఉద్దేశంతో వ్యవహరించాడు. చంద్రబాబు, టీడీపీ నేతలకు సిగ్గుండాలి. ఎందుకిలాంటి దుర్బుద్ధి పుడుతుందో అర్థం కావడం లేదు.

చంద్రబాబు బలహీనవర్గాల ద్రోహి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టీడీపీ శనిలా దాపురించింది. అమరావతిలో బలహీనవర్గాలకు 1251 ఎకరం ఇస్తామని చెప్పాం.. దానికి కూడా చంద్రబాబుకు కడుపుమంట. సీఆర్‌డీఏ చట్టం ప్రకారం 5 శాతం బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇవ్వాలని ఉంది. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండకూడదా..? దీనిపై జనాభా పరమైన సామాజిక సమతూల్యం దెబ్బతింటుందని చంద్రబాబు వాదిస్తున్నాడు. ఎక్కువమంది బీసీలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతూల్యం దెబ్బతింటుందా..? ఏరకంగా నీ వర్గం కోసం పాటుపడుతున్నావో తేటతెల్లమైంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత స్థానం కల్పించాలని సీఎం ముందుకు వెళ్తుంటే.. ప్రతీదానికి అడ్డుపడుతున్నాడు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాలు తీసుకుంటుంటే.. ఎందుకంత కడుపుమంట.

 

Back to Top