సచివాలయం: ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకాన్ని చంద్రబాబు రాజకీయం చేయాలని చూస్తున్నాడు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలు స్వాగతించగానే యూటర్న్ తీసుకుంటున్నాడని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రైతు భరోసా, ఇసుక, ఇంగ్లిష్ మీడియం ఇలా ప్రతీది రాజకీయం చేయాలని చూసి యూటర్న్ తీసుకున్నాడన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో 38 వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కొని వాటిని డెవలప్ చేయకుండా ఐదు సంవత్సరాలు గొర్రెలు కాశారా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. భూములు ఇచ్చిన రైతులంతా చంద్రబాబుపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. రూ.4900 కోట్లు ఖర్చు చేసి నాలుగు బిల్డింగ్ కట్టాడని, అవి కూడా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయన్నారు. అమరావతి పర్యటనకు వచ్చి రైతులకు ఏం సమాధానం చెబుతావు బాబూ అని నిలదీశారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిగా ఇచ్చే సాయం కేంద్రం డబ్బు అని చంద్రబాబు, ఎల్లోమీడియం ప్రచారం చేసిందని, హామీ ఇచ్చినదానికంటే రూ. వెయ్యి అదనంగా ఇవ్వడంతో రైతులంతా సంతోషంగా ఉన్నారని చంద్రబాబు దాన్ని పక్కకునెట్టారు. ఇసుక సమస్య అని రాజకీయం చేయాలని చూశారు. గత ప్రభుత్వం ఇసుకను దోపిడీ చేసిందని, దాన్ని అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ నూతన పాలసీని తీసుకువచ్చారు. వర్షాలు, వరదలు అధికం కావడంతో ఇసుక తీయలేకపోవడంతో ఆ విషయమై ప్రభుత్వంపై బురదజల్లేందుకు చంద్రబాబు కుట్ర చేశారు. వరదలు తగ్గి ఇసుక సరఫరా మెరుగుపడడంతో దాని నుంచి చంద్రబాబు వెనక్కుతగ్గాడు. అందరికీ విద్య అందుబాటులోకి రావాలని, సీఎం వైయస్ జగన్ విద్యలో సంస్కరణలు తీసుకువచ్చారు. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని నిర్ణయం తీసుకుంటే దాన్ని రాజకీయం చేయాలని చూశారు. ప్రజలంతా ఇంగ్లిష్‌మీడియం విద్యను కోరుకుంటే ఈ అంశంపై కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకొని ఎవరూ మాట్లాడొద్దని టీడీపీ నేతలకు ఇండికేషన్ ఇచ్చారని మంత్రి బొత్స గుర్తుచేశారు. నిన్నటి రోజున ప్రధాని మాతృభాష గురించి గవర్నర్ల సదస్సులో మాట్లాడితే దానికి కొన్ని పత్రికలు వక్రభాష్యాన్ని తీసుకువచ్చాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మాతృభాషకు మా ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి సీఎం వైయస్ జగన్ ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువస్తున్నారన్నారు. దానికి ప్రతిపక్షాలు, పచ్చ పత్రికలు ప్రభుత్వం తప్పు చేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నాయని మండిపడ్డారు. తప్పుడు కథనాలు రాసే పత్రికలు, మాట్లాడే నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చదవాలి. పేద, మధ్యతరగతి పిల్లలు ఇంగ్లిష్‌లో చదువుకోకూడదా..? అని ప్రశ్నించారు. పేదవారంటే ఎందుకంత కక్ష అని నిలదీశారు. గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే చాలా మంది వ్యతిరేకించారు. సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలని వైయస్ఆర్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారన్నారు. అంటిదే ఈ ఇంగ్లిష్ మీడియం కూడా.. పచ్చ పత్రికలు ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. అమరావతి పర్యటనకు వచ్చే చంద్రబాబు రాజధాని ప్రాంత ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ పూలింగ్ అని 38 వేల ఎకరాలు తీసుకున్న చంద్రబాబుకు వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కదా.. ఐదేళ్లు గొర్రెలు కాశారా..? బాధ్యత లేదా..? అని ప్రశ్నించారు. వేల కోట్లు ఖర్చు చెప్పుకుంటూ ఐదేళ్లలో రాజధానికి కేటాయించింది రూ.4900 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. అమరావతిలో నాలుగు బిల్డింగ్లు మాత్రమే కనిపిస్తాయని, అవి కూడా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు కాలపరిమితి 5 సంవత్సరాలు మాత్రమేనని, చంద్రబాబు 50 సంవత్సరాలు అనుకుంటున్నారేమో అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు విధానం నచ్చకే ప్రజలంతా ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు తీసుకున్న భూములను డెవలప్ చేసి ఇచ్చే విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమీక్షలో సీఎం అన్ని విషయాలపై ఆరా తీశారన్నారు. అమాయకుడు ఎవడు దొరికితే వాడిని ముంచేయడమే చంద్రబాబు విధానమన్నారు. బాబు వైఖరిపై అమరావతి రైతులంతా ఆగ్రహంగా ఉన్నారని బొత్స సత్యనారాయణ చెప్పారు. Read Also: పవన్ కళ్యాణ్ అరాచకవాదిలా ప్రవర్తిస్తున్నారు