చంద్రబాబుకు సిగ్గు, ఎగ్గూ ఏమీ లేవు

బుర్ర పాడైపోయిందా.. చిల్డ్రన్స్‌ డే రోజు దీక్ష ఏంటీ..?

బాబుకు ఏపీలో ఇల్లు లేదని, ప్రజలకు రాజధాని లేకుండా చేశాడు

రాష్ట్రానికి అడ్రస్‌ లేకుండా చేసింది చంద్రబాబే..

2014 నుంచి 19 వరకు కార్మికుల పొట్టకొట్టి ఇప్పుడు మొసలికన్నీరు

కార్మికుల నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లాయంటే అది వైయస్‌ఆర్‌ వల్లే

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

సచివాలయం:  అ అంటే అమరావతి అని ఐదేళ్ల పాటు మాటలు చెప్పిన చంద్రబాబు ఇండియా మ్యాప్‌లో ఏపీకి రాజధాని లేకుండా చేశాడని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తప్పు చేసి తప్పించుకోవడానికి సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి అడ్రస్‌ లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేశాడని ధ్వజమెత్తారు. సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని ఎక్కడా అని కేంద్రానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారా..? అని గతంలో ప్రశ్నిస్తే కొందరు టీడీపీ నేతలు వచ్చి దబాయింపుడు మాటలు మాట్లాడారు కానీ సమాధానం చెప్పలేదన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుకు ఇల్లు, వాకిలి, అడ్రస్‌ లేదని, ప్రజలందరికీ లేకుండా చేశాడని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అడ్రస్‌ లేకుండా చేసి తప్పు నుంచి తప్పించుకోవడానికి ప్రస్తుతం ఉన్న సీఎం వైయస్‌ జగన్‌పై నిందలు వేస్తున్నాడన్నారు. చంద్రబాబు తోకలుగా ఉండి బీజేపీలో కొత్తగా చేరిన ఎంపీలు సుజనా చౌదరి లాంటి వారి జ్ఞానం ఏమైందో అర్థం కావడం లేదన్నారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నిర్వాకం వల్ల, వ్యక్తిగత పోకడల వల్ల, అవినీతి కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

నవంబర్‌ 14 నుంచి బాబు నిరాహార దీక్ష చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయని, బాలల దినోత్సవం నాడు దీక్ష చేయండి ఏంటీ..? చంద్రబాబు బుర్ర పాడైపోయిందా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు భవన నిర్మాణ కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే నవంబర్‌ 13, 15 తేదీల్లో చేయాలని సూచించారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాలు జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. 45 లక్షల ఇళ్లు నిర్మించారని, ఆంధ్రరాష్ట్రంలోని 13 జిల్లాలో 25 లక్షల ఇళ్లు నిర్మించారన్నారు. అంతకు ముందు 2003లో భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారన్నారు. వైయస్‌ఆర్‌ హయాంలో గృహ నిర్మాణ కార్యక్రమంతో పాటు ఎన్‌ఆర్‌జీఎస్‌ స్కీమ్‌ వల్ల వలసలు తగ్గాయని, అందరికీ ఉపాధి దొరికిందని చెప్పారు. భవన కార్మికులకు ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాయంటే.. వైయస్‌ఆర్‌ హయాంలోనే అని గుర్తు చేశారు. ఆ తరువాత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి, కార్మికులకు దురదృష్టకరమన్నారు. సీఎం అయిన వెంటనే చంద్రబాబు జీఓ విడుదల చేసి కార్మికుల పొట్టకొట్టాడని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నాడన్నారు. టిట్‌కో హౌసింగ్‌ స్కీమ్‌ పెట్టి ఒక్క ఇల్లు అయినా నిర్మించి ఇచ్చాడా అని ప్రశ్నించారు. అంతకుముందు నిర్మించిన ఇళ్లకు రెండుసార్లు గృహప్రవేశాలు చేసి లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రచారం చేసుకున్నాడన్నారు. చంద్రబాబు కార్మికుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు.

Read Also: ఆర్‌సీఈపీ నుంచి బయటకు రావడాన్ని స్వాగతిస్తున్నాం

Back to Top