వైయస్‌ జగన్‌ పాలన ఓ చరిత్ర

మంత్రి బొత్స సత్యనారాయణ

మార్కెట్‌యార్డు కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు

సింగపూర్‌తో రాజధాని ఒప్పందం విరమించుకున్నాం

రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు దుష్ర్పచారం

ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ప్రతిపక్షం ఓర్వలేకపోతుంది

రైతులకు మేలు చేస్తే టీడీపీ తట్టుకోలేకపోతుంది

అనంతపురం: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన ఓ చరిత్ర అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మార్కెట్‌యార్డు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో మరో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్‌ప్రకటించారన్నారు. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్ని అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నామినేటేడ్‌ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్సిస్తామని పేర్కొన్నారు. పెద్ద మార్కెట్‌ యార్డులతో పాటు మిగతా మార్కెట్‌ యార్డులకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్కెట్‌ కమిటీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని, లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు నిర్ణయిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇంత పెద్ద ఎత్తున నామినేటేడ్‌ పదవుల్లో అవకాశాలు రాలేదన్నారు. చట్టాన్ని చేసి ఎన్నికలు అయిన ఆరు నెలల్లోనే అమలు చేయడం ఇదో చరిత్ర అన్నారు. ఇటీవల వర్షాలు, వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందన్నారు. ఇసుక తీర్చేందుకు కొత్తగా ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో ఇసుక అందుబాటులోకి వచ్చిందన్నారు. 
రాజధాని పేరుతో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. స్విస్‌ చాలెంజ్‌ లోపభూయిష్టమన్నారు. తెల్కార్‌ కమిటీ ఈ విధానం మంచిది కాదని చెప్పినట్లు గుర్తు చేశారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. సింగపూర్‌తో రాజధాని ఒప్పందం విరమించుకున్నామని తెలిపారు.  ఈ విరమణ వల్ల పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేదని సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ చెప్పినట్లు తెలిపారు.  రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ఈశ్వరన్‌ పేర్కొన్నట్లు చెప్పారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పెట్టుబడులు రావడం లేదని చెబుతున్నారన్నారు. పెట్టుబడుల రూపంలో అవినీతికి అవకాశం లేకుండా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎన్నో చట్టాలు చేశామన్నారు. ఏ మంచి కార్యక్రమం చేపట్టినా కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు బురద జల్లడమే లక్ష్యంగా పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయ వ్యవస్థలో పర్మినెంట్‌ ఉద్యోగాలు ఇస్తుంటే టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు.  ఉద్యోగాల నియామకాలతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రైతు భరోసా రూ.13,500 ఇస్తామంటే ఈ విషయంలో కూడా టీడీపీ రాద్ధాంతం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానితో కలిసి రైతు భరోసాగా అందజేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలోనే చెప్పామన్నారు. కౌలు రైతులను నుంచి అభినందనలు వచ్చాయన్నారు. రైతులకు మేలు చేస్తే టీడీపీ తట్టుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏది చేసినా ఒక దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రతి మూడేళ్ల కాల పరిమితితో లీడర్లను మార్చుకోవాలని పొదుపు సంఘాలకు చెబితే వారు స్వాగతించారన్నారు. ఇంగ్లీష్‌ మీడియంపై ప్రతిపక్షం అనవసర రాద్దాంతం చేస్తుందని, ప్రజలందరూ ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే వీరు వ్యతిరేకిస్తున్నారన్నారు. పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్‌ మీడియం అవసరమన్నారు. 

 

Read Also: గవర్నర్‌ను కలిసి సీఎం వైయస్‌ జగన్‌ దంపతులు

Back to Top