తాడేపల్లి: చంద్రబాబుకి రాజకీయంగా ఇబ్బంది వచ్చినప్పుడు పనిచేసే పొలిటికల్ టూల్ లా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. అందుకోసం ఆయన దగ్గర మేత తిని వైయస్‌ఆర్‌సీపీ గురించి నోటికొచ్చినట్టు కూతలు కూస్తున్నాడని గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ పరిశీలకుడు పొతిన మహేష్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర ప్రజలందరికీ చేరిందని, దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే పవన్ కళ్యాన్ సంబంధం సందర్భం లేకుండా మధ్యలో వచ్చి వైయస్‌ఆర్‌సీపీ నాయకుల గురించి నోటికొట్టి మాట్లాడి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని వివరించారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే స్పష్టత ఉండదని, సినిమా భాషలో ఆయన మైండ్ సెట్ గురించి చెప్పాలంటే ఓపెనింగ్ లో ఓవరాక్షన్, ఇంటర్వెల్‌లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా ఉందని చెప్పారు. సింగపూర్‌లో అమలు చేసే కేనింగ్ పనిష్మెంట్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న జనసేనలో ఎమ్మెల్యేల దగ్గర నుంచే మొదలుపెట్టాలని సూచించారు. చంద్రబాబుకి సపోర్టు చేయడానికి జనసేన పార్టీ పెట్టి ఆ పార్టీ కార్యకర్తలతో టీడీపీ జెండాలు మోయిస్తున్న పవన్ కళ్యాణ్‌కి ఆత్మాభిమానం ఉందా అని ప్రశ్నించారు. పిల్లనిచ్చిన మామ నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కున్న చంద్రబాబు, చిరంజీవి ద్వారా సినిమాల్లోకి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాన్.. సొంతంగా పార్టీ పెట్టి సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చిన వైయస్ జగన్ పేరెత్తే అర్హత కూడా లేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ఈ 18 నెలల కాలంలో ప్రజల కోసం తాను చేసిన ఒక్క మంచి పని ఉన్నా చూపించాలని పవన్ కళ్యాన్‌కి సవాల్ విసిరారు. ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తున్నా, 18 లక్షల మంది జాబ్ కార్డులు తీసేసినా నోరు మెదపని పవన్ కళ్యాణ్ ప్రజల బాగోగులు అంటూ డ్రామాలాడుతున్నారని, ముందుగా తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని పోతిన మహేష్ హితవు పలికారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● పాలన చేతకాక వైయస్‌ఆర్‌సీపీని తిడుతున్నాడు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైయస్ జగన్ గారు ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాత్రం వైయస్‌ఆర్‌సీపీ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వారి ప్రవర్తన చూస్తుంటే అధికారంలో ఉన్నది టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వమా లేక వైయస్‌ఆర్‌సీపీనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. వైయస్ జగన్ గారు ప్రెస్‌మీట్ పెట్టి లేదా ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ ఏనాడూ ఒక్కదానికీ సమాధానం చెప్పకపోగా చంద్రబాబుకి వకాల్తా పుచ్చుకుని మరో 15 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండాలని కోరడం చూస్తుంటే ఆయనకు ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలా? చంద్రబాబు అధికారంలో ఉండటం కావాలో అర్థంకావడం లేదు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూల్ లా మారిపోయాడు. ఆయనకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు పవన్ బయటకొస్తాడు. ఒకపక్క సొంత పార్టీని, ఇంకోపక్క ప్రజలను మభ్యపెడుతున్నాడు. పాలన చేయడం చేతకాకనే ఇలా వైయస్‌ఆర్‌సీపీని తిట్టి పబ్బం గడుపుతున్నాడు. ● చంద్రబాబు ఆదేశాలతో డైవర్షన్ పాలిటిక్స్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. అధికారంలో వస్తే మెడికల్ కాలేజీలు కట్టబెట్టేలా చంద్రబాబు ఎన్నికలకు ముందే ఒక ఒప్పందం చేసుకుని ఆ విధంగా ఇప్పుడు ముందుకుపోతున్నాడు. మళ్లీ అధికారంలోకి రావడం కలలో మాటేనని వారికి అర్థమైంది అందుకే ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా ఆయన వెనక్కి తగ్గకుండా దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు పవన్ కళ్యాణ్ వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై బూతులతో విరుచుకు పడుతున్నాడు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని కోటికి పైగా సంతకాలు చేసిన ప్రజలను అవమానించేలా పవన్ కళ్యాణ్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన వ్యక్తి ప్రశ్నించడమే మర్చిపోయాడు. ఆయన డ్రామాలు గుర్తించలేని స్థితిలో ప్రజలున్నారని పవన్ కళ్యాణ్ భ్రమపడుతున్నాడు. ● సంబంధం, సందర్భం లేకుండా వైయస్‌ఆర్‌సీపీని తిట్టడమే పని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమిస్తుంటే సంబంధం, సందర్భం లేకుండా మధ్యలో వచ్చి మా పార్టీ నాయకులను బూతులతో తిట్టడానికి పవన్ కళ్యాణ్ కుదుర్చుకున్న డీల్ ఏంటి? ప్రైవేట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ముసుగులో అవినీతికి పాల్పడిన వారిపై వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని చెబితే పవన్ కళ్యాణ్ ఎందుకు అంతలా రెచ్చిపోతున్నాడు? వైద్యారోగ్య శాఖతో సంబంధం లేకుండా పవన్ ఎందుకు ఊగిపోతున్నాడు? ప్రైవేటీకరణతో ఆయనకు ఏంటి సంబంధం? అవినీతి పరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైయస్ జగన్ గారు అన్న మాటల్లో తప్పేంటో పవన్ చెప్పాలి. ప్రైవేటీకరణ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి చంద్రబాబుతో కుదిరిన డీల్ ఏంటి? దేశంలో ఒక పార్టీ మరో పార్టీతో పొలిటికల్ డీల్ కుదుర్చుకున్న దాఖలాలు లేవు. అలాంటిది జనసేన ఒక్కటేనేమో. రాబోయే 15 ఏళ్లకు తెలుగుదేశం పార్టీతో పవన్ కుదుర్చుకున్న డీల్ లాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? ● వైయస్‌ఆర్‌సీపీని తిడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? రాష్ట్రంలో వ్యవసాయరంగం కుదేలైంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నారు. హాస్టల్స్ లో విద్యార్థులను నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందడం లేదు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా గిరిజన విద్యార్థులు రోగాలబారిన పడి చనిపోతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారు. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ ప్రతి మూలన సమస్యలుంటే వాటిని వదిలేసి వైయస్‌ఆర్‌సీపీ మీద నోరుపారేసుకుంటారా. మమ్మల్ని తిడితే సమస్యలు పరిష్కారం అవుతాయా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకుని హామీ సంతకాలు చేసి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? పవన్ ని నమ్ముకున్న కాపు సామాజికవర్గాన్ని ఎందుకు గాలికొదిలేశారు? పవన్ ని నమ్ముకున్నందుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నాయకుల చేతుల్లో చావు దెబ్బలు తింటుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? వారికి భరోసా కల్పించకుండా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? వారి ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?... వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికేగా వైయస్‌ఆర్‌సీపీని నోటికొచ్చినట్టు మాట్లాడేది. ● పవన్ స్థితి.. ఓవరాక్షన్, ఇరిటేషన్, కన్ఫ్యూజన్ మధ్యమధ్యలో నాకు ముప్పుందని చెబుతాడు. ఎవరి వల్ల ఆయన ప్రాణాలకు ముప్పు ఉంటుంది? అదికారంలో ఉండి పోలీస్ వ్యవస్థ మొత్తం చేతిలో ఉంటే ప్రాణభయం ఎందుకు కలుగుతోంది? రాష్ట్రంలో రౌడీయిజం చేస్తున్నది ఎవరు? జనం ప్రాణాలు పీల్చి పిప్చి చేస్తున్నది ఎవరు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయడం లేదా? ఉత్తరాంధ్రలో భూదందా చేస్తున్నది ఎవరు? పబ్లిక్‌గా కేసినోలు, పేకాట క్లబ్బులు నడపడం లేదా? గంజాయి అమ్ముతున్నది మా పార్టీ ఎంపీ కేశినేని చిన్ని మునుష్యులేనని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేరుగా ఏబీఎన్ ఛానెల్‌లోనే చెప్పలేదా? వారిలో ఎవరినైనా అరెస్ట్ చేశారా? వారి రోమాలు తీశారా? రాజమండ్రిలో ఫ్లెక్సీలు కట్టినందుకు వారిని కొట్టిన వారి చేతిలో రేఖలు అరగదీశారా? పవన్ విధానం గురించి సినిమా భాషలో చెప్పాలంటే ఓపెనింగ్ లో ఓవరాక్షన్, ఇంటర్వెల్‌లో ఇరిటేషన్, క్లైమాక్స్‌లో కన్ఫ్యూజన్ అన్నట్టుగా తయారైంది. ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆయన విధానాలేంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో కనీసం ఆయనకైనా క్లారిటీ ఉన్నట్టు కనిపించడం లేదు. కాసేపు రౌడీయిజం సహించను అంటాడు. సినిమా ఈవెంట్‌లో సైలెన్సర్లు తీసేసి దుమ్ముదులపమని యువతని రెచ్చగొడతాడు. పవన్ కళ్యాణ్ పరిస్థితి చూస్తే నిజంగా బాధనిపిస్తుంది. ఆయనకు మేత కూత మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ కాల్షీట్లకు ఖరీదు కట్టే షరీబు చంద్రబాబు కాబట్టి కూత కూసి మేత తీసుకుంటాడు. ప్రభుత్వ వైఫల్యాలపై, ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైయస్ జగన్ గారు చేస్తున్న ఉద్యమాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అందుకే చంద్రబాబు దగ్గర మేత తిని రోడ్డెక్కి కూతలు కూస్తున్నాడు. సింపతీ కోసం కట్టుకథలు చెబుతున్నాడు. ● కేనింగ్ పనిష్మెంట్ మీ పార్టీ ఎమ్మెల్యేలతోనే మొదలుపెట్టాలి ప్రైవేట్ సెటిల్మెంట్లు జాగ్రత్తగా చేయడం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ చెప్పాలి. అంటే, సెటిల్మెంట్లు చేసి వాటాలు తనకి తెచ్చి ఇవ్వాలని చెబుతున్నాడా? ఐఏఎస్, ఐపీయస్ అధికారులే మిమ్మల్ని చూసి భయపడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులున్నాయో అర్థమవుతుంది. రౌడీయిజాన్ని సహించను అంటూనే లా అండ్ ఆర్డర్‌ని చేతిలోకి తీసుకోవాలని అంటాడు. సింగపూర్ తరహా పాలన రావాలంటాడు. కేనింగ్ పనిష్మెంట్ గురించి చెప్పిన పవన్ కళ్యాణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ చేసిన జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ తోనే మొదలుపెట్టి ఉంటే బాగుండేది కదా. అవినీతికి రశీదులు ఇస్తున్నానని చెప్పిన బొలిశెట్టి శ్రీనివాస్‌కి, రేషన్ మాఫియా నడుపుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్‌కి, ఉత్తరాంధ్రలో భూకబ్జాలు చేస్తున్న ఎమ్మెల్యేలకు ఈ కేనింగ్ పనిష్మెంట్ ఇవ్వాల్సింది. పవన్ కళ్యాణ్‌కి నీతి నిజాయితీ ఉంటే అన్ని అంశాల మీద మాట్లాడాలి. ప్రభుత్వ వైఫల్యాల మీద చర్చించాలి. స్పెషల్ ఫ్లైట్‌లో తిరగడం, చంద్రబాబు కోరినప్పుడల్లా వచ్చి వైయస్‌ఆర్‌సీపీ నాయకులను తిట్టడం తప్పించి 18 నెలల కాలంలో ఆయన చేసిన ఒక్క పనైనా ఉంటే చూపించాలి. ● సినిమా, రాజకీయాల్లోకి పవన్ వారసత్వంగానే వచ్చాడు జనసేనలో పదవులు ఇవ్వడానికి వేరే పార్టీకి సిఫార్సు లేఖలు ఇవ్వాల్సిన దౌర్భాగ్యస్థితిలో ఉండి వైయస్‌ఆర్‌సీపీ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటు. పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నవాడు చంద్రబాబు. అన్న చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చి ఆ తర్వాత ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చినవాడు పవన్ కళ్యాణ్. అలాంటి వీరికి వారతస్వ రాజకీయాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉంటుందా? వైయస్ జగన్ గారు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఎవరి సపోర్టు లేకుండా పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ ఒక్క పార్టీతో పొత్తు లేకుండానే వైయస్‌ఆర్‌సీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సొంత పార్టీ, సొంత ఎజెండాతో ముఖ్యమంత్రి అయిన వైయస్ జగన్ గారి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్‌కి ఉందా? సొంత పార్టీనాయకులకే పదవులు ఇచ్చుకోలేని పవన్ కళ్యాణ్ కి మాజీ సీఎం వైయస్ జగన్ పేరెత్తే అర్హతే లేదు. ఉపాధి హామీ పథకానికి కొత్తగా అనేక మార్పులు చేసి జీ రామ్‌జీ పేరుతో కొత్తగా అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలంటే రూ. 4వేల కోట్లు కావాలి. ఇది ప్రభుత్వానికి భారం కాదా? ఆ లోటును ఎలా భర్తీ చేస్తారు? 18 లక్షల జాబ్ కార్డులు తీసేస్తే ఎందుకు స్పందించలేదు? తన శాఖలో జరుగుతున్న దారుణాలపై ఆయన ఎందుకు నోరెత్తడం లేదు? బాధ్యతలను వదిలేసి ఏడ్చి పెడబోబ్బలు పెట్టి చంద్రబాబు చెప్పిన డైవర్షన్ స్కీమ్‌ను అమలు చేయడం దేనికి? పవన్ కళ్యాణ్‌కి చేతనైతే సొంత డైరెక్షన్‌లో పనిచేయాలి. తిరగడానికి ఫ్లైట్, చంద్రబాబుకి సపోర్టు చేయడానికి ఒక పార్టీ, టీడీపీ జెండాలు మోయడానికి జనసేన కార్యకర్తలు. కులం పేరుతో కుట్రలు చేసి తప్పుడు రాజకీయాలు ఇంకెన్నాళ్లు చేస్తారు? చంద్రబాబు తప్పుడు రాజకీయాలకు ఇంకెన్నాళ్లు కాపు కాస్తారో చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.