తాడేపల్లి: కుటుంబ తగాదాకి రాజకీయ రంగు పులిమి అందులో నిందితుడిగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్తని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తగా నమ్మించాలని చూసిన మంత్రి నారా లోకేష్ బొక్కబోర్లా పడ్డాడని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడి పెంపుడు మీడియా కారణంగా ఆంధ్ర్రప్రదేశ్ ప్రతిష్ట రోజురోజుకీ దిగజారిపోతోందని, షాడో సీఎంగా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ రెడ్ రాజ్యాంగం అమలు చేస్తూ నియంత పాలనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ని మించిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవారి పల్లెలో సంధ్యారాణి అనే మహిళకు తన మరిది అజయ్ దేవ్ తో ఉన్న వివాదాల నేపథ్యంలో జరిగిన కుటుంబ తగాదాని వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదిస్తూ మంత్రి నారా లోకేష్ వికృత రాజకీయాలు చేస్తున్నాడని వివరించారు. అతడు జనసేన పార్టీ కార్యకర్తేనని నిర్ధారించేలా ఉన్న సోషల్ మీడియా పోస్టులు, ఆ గ్రామ జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ ఆడియో టేపును నాగార్జున యాదవ్ ప్రెస్‌మీట్‌లో వినిపించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. మొన్న ఆదివారం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ గారి జన్మదిన వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా సంబరంలా నిర్వహించారు. సోషల్ మీడియాలో ఈ వేడుకలు దేశమంతా ట్రెండింగ్‌లోకి రావడంతో నారా లోకేష్‌కి ఈర్ష్య కలిగింది. వెంటనే దీనికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే బాధ్యతను ఎల్లో మీడియాకి అప్పగించాడు. అందులో భాగంగానే నారా లోకేష్ డైరెక్షన్‌లో అనంతపురంలో జరిగిన ఒక కుటుంబ తగాదాని వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదించి ఎల్లో మీడియా వికృత రాజకీయం మొదలుపెట్టింది. వైయస్ జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా టపాసులు పేల్చవద్దన్నందుకు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త గర్భిణిని కాలితో తన్ని దాడి చేశాడని ఒక కట్టు కథ అల్లి దుష్పచారం మొదలుపెట్టారు. వదిన, మరిది మధ్య జరిగిన కుటుంబ తగాదాని వైయస్‌ఆర్‌సీపీకి ఆపాదించే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని, జనసేన పార్టీకి చెందిన అజయ్ దేవ్ ని వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తగా ప్రచారం మొదలుట్టారు. ● అజయ్ దేవ్ జనసేన కార్యకర్తే అజయ్ దేవ్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో ఆ వ్యక్తి పాల్గొన్న ఫొటోలు, మొన్న ఎన్నికల్లో జనసేన గెలవాలని కోరుకుంటూ షేర్ చేసిన వీడియోలు కనిపిస్తాయి. వైయస్‌ఆర్‌సీపీకి సంబంధం లేని వ్యక్తి అని ఇన్ని ఆధారాలు కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నా ఎలాగైనా బురదజల్లాలనే కుట్రతో నారా లోకేష్ ఒక ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు. వైయస్‌ఆర్‌సీపీ మీద బురదజల్లి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యంగా ఎస్సీ కులానికి చెందిన అజయ్ దేవ్‌ను నారా లోకేష్ బలి చేశాడు. పోలీసులతో దారుణంగా కొట్టించి నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లిన వీడియోలు వైరల్ చేయించాడు. కుటుంబ తగాదాను పెద్దదిగా చేసేందుకు ముత్యాలవారిపల్లెకి 30 మంది పోలీసులను, ఒక డీఎస్పీని పంపించి వారి కుటుంబ పరువును రోడ్డున పడేశారు. ● చేతి మీద పచ్చబొట్టుగా పవన్ కళ్యాణ్ ఫొటో ఆ గ్రామానికే చెందిన జనసేన పార్టీ ఎంపీటీసీ అమర్ కూడా ఆ వ్యక్తి జనసేన పార్టీ కార్యకర్తేనని అతడి చేతి మీద పవన్ కళ్యాణ్ పచ్చ బొట్టు కూడా ఉందని చెబుతున్నాడు. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అతడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నాడు (ఆడియో ప్రదర్శించారు). జనసేన పార్టీ కార్యకర్త అజయ్ దేవ్ మీద పవన్ కళ్యాణ్ కి ఎందుకంత కోపమో అర్థం కావడం లేదు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ రాష్ట్రంలో అమలు చేయాలని పవన్ కళ్యాణ్ అన్నాడోలేదో జనసేన పార్టీ కార్యకర్తకి నారా లోకేష్ ఆ ట్రీట్మెంట్ ఇప్పించాడు. వైయస్ జగన్ గారి మీద బురదజల్లడం కోసం సొంత పార్టీ కార్యకర్తలను నారా లోకేష్, పవన్ కళ్యాణ్ బలి తీసుకోవడం సిగ్గుచేటు. దీనిపై పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఒకరిద్దరికి ప్రమాదం. కానీ నారా లోకేష్ చేతిలో అధికారం ఉంటే రాష్ట్రమంతటికీ ప్రమాదమని ఈ ఘటనతో అర్థమైపోయిందని నాగార్జున యాదవ్ స్పష్టంచేశారు.