రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్‌

జేఏసీ నిరాహార‌దీక్ష‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌  సంఘీభావం  

అన్నమయ్య జిల్లా:  అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.  జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో రైల్వేకోడురులో చేపట్టిన నిరాహార‌దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు  పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. రాజంపేట ప్రాంతం చారిత్రకంగా, భౌగోళికంగా, పరిపాలనా పరంగా జిల్లా కేంద్రంగా అర్హత కలిగిన ప్రాంతమని స్పష్టం చేశారు. రైల్వే కోడూరు, రాజంపేట చుట్టుపక్కల నియోజకవర్గాలు, మండలాలు అనేక ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని, జిల్లా కేంద్రం హోదా కల్పిస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను, ప్రాంతీయ సమతుల్యతను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తే విద్య, వైద్యం, ఉపాధి, రవాణా వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు ఏర్పడటం వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలకు పరిపాలన మరింత చేరువ అవుతుందని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.  

Back to Top