ఒంగోలు : టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు తప్ప, సేవా కార్యక్రమాలు చేయడం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అసలు లాక్ డౌన్ లో టిడిపి చేసిన సేవా కార్యక్రమాలు ఏంటో చెప్పాలని మంత్రి ప్రశ్నించారు. తనపై ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారాలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తనకు కరోనా వైరస్ సోకిందని కుట్రపూరితంగానే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలని మంత్రి బాలినేని హెచ్చరించారు. శుక్రవారం ఒంగోలులో కరోనా నియంత్రణా చర్యలను పర్యవేక్షించారు. బాపూజీ మార్కెట్‌లో కోవిడ్19- డిస్ ఇన్ఫెక్షన్ టన్నల్‌ను ప్రారంభించారు. జిల్లాలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డప్పు కొట్టుకోవడంలో ఆయనకు పోటీ లేరు చంద్రబాబు నాయుడు డప్పు కొట్టుకోవడంలో తనకు తానే పోటీ పడతారని బాలినేని ఎద్దేవా చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎవరికైనా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా స్వయంగా ఫోన్ చేస్తే సమస్య తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సేవా కార్యక్రమాలు చేసే సమయంలో నిరాహార దీక్షలు చేయడం కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని బాలినేని వ్యాఖ్యానించారు.