తెలుగు భాషాభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కృషి

మంత్రి అవంతి శ్రీ‌నివాస్‌

విశాఖ‌లో ఘ‌నంగా తెలుగు భాషా దినోత్సవం

విశాఖ‌:  తెలుగు భాషాభివృద్ధికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పేర్కొన్నారు. ఆదివారం విశాఖ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.   ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ వై.వి.ఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన  తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు అవంతి శ్రీనివాసరావు, విశాఖ మేయర్ హరి వెంకట కుమారి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యేలు, ఎంపీలు,నెడ్ క్యాప్ చైర్మన్ కేకే రాజు, జాయింట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి అవంతి శ్రీ‌నివాస్ మాట్లాడుతూ..  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి తెలుగుభాషాభివృద్ధికి, విద్యాభివద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ తెలుగు, సంస్కృతి అకాడమీకి ప్రత్యేక ప్రాధన్యత ఇచ్చారని చెప్పారు. విద్య, భాష, సాహిత్యాభివద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. క‌డ‌ప న‌గ‌రంలో ఇటీవ‌ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రఖ్యాత సీపీ బ్రౌన్‌ స్మారకార్థం గ్రంథాలయ ఆవరణంలో నూతన భవనానికి రూ.5.50 కోట్లతో శంకుస్థాపన చేశార‌ని తెలిపారు.తిరుపతిలో తెలుగు, సంస్కృతి అకాడమీ భవనానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. అకాడమీతో పాటు భాషా అధ్యయన సంస్థను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్‌ పుస్తకాలను అకాడమీ తరపున ప్రచురించామని, డిగ్రీ పుస్తకాలనూ ప్రచురిస్తామని చెప్పారు.    

Back to Top