ఇళ్ల పట్టాలు ఇవ్వమంటారా?.. వద్దా?

చంద్రబాబుకు మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూటి ప్రశ్న

లోకేష్‌ నాయుడు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

పోలీసులు లేకుంటే బాబు క్షేమంగా హైదరాబాద్‌ వెళ్లేవాడా..?

ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహం ఇప్పటికైనా అర్థమైందా బాబూ

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

 

విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వమంటారా..? వద్దంటారా..? అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అసూయ పరాకష్టకు చేరిందని మంత్రి ఫైర్‌ అయ్యారు. విశాఖలో శుక్రవారం అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు.  విశాఖ జిల్లాలో 1.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నాం. దాంట్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన నాలుగు నియోజకవర్గాల్లోనే సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వమంటారా..? వద్దంటారా..? అని చంద్రబాబుకు మంత్రి అవంతి సూటి ప్రశ్న వేశారు. 
విశాఖకు పరిపాలన రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబును ఉత్తరాంధ్ర ప్రజలు ఆగ్రహంతో అడ్డుకుంటే దాన్ని ప్రభుత్వం, వైయస్‌ఆర్‌ సీపీపై నెడుతున్నారని, పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్‌ వారితో పోరాడి ప్రాణాలు అర్పించిన నేల ఇది. ఎవరికీ భయపడే నేల కాదు అని సూచించారు.
 
‘చంద్రబాబు పులివెందుల రౌడీలు వచ్చారని గోబెల్స్‌ ప్రచారం చేయిస్తున్నాడు. పోలీసుల గురించి చాలా చులకనగా చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడారు. టీడీపీ హయాంలో పనిచేసిన పోలీసులే ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. శాంతిభద్రతలకు పాటుపడే పోలీసుల గురించి చులకన మాట్లాడడం మంచిది కాదు. నిన్న పోలీసులు లేకుండా చంద్రబాబు క్షేమంగా హైదరాబాద్‌ వెళ్లగలిగేవాడా..? పోలీసులు చంద్రబాబు చాలా భద్రత కల్పించారు. ఆరు గంటలు ప్రజలు కడుపు మంటతో ధర్నా చేశారంటే ప్రజల ఆగ్రహం ఏ విధంగా ఉందో చంద్రబాబు, ఎల్లో మీడియా గుర్తించాలి.

పులివెందుల గుండాలు, రౌడీలు వచ్చారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్లి తంతామని లోకేష్‌ మాట్లాడుతున్నాడు. ఎవరి ఇంటికి వెళ్లి తంతాడో లోకేష్‌ను రమ్మనండి. సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. లోకేష్‌ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. ప్రజల వారి అసంతృప్తిని, అసహనాన్ని రకరకాలుగా వ్యక్త పరుస్తుంటారు. దానిపై సమన్వయంతో వ్యవహరించాలి కానీ ప్రాంతాలు, నాయకులు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లోకేష్‌ వ్యవహార శైలి ఉంది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ల్యాండ్‌ పూలింగ్‌కు సంబంధించి 1.75 లక్షల మందికి విశాఖపట్నంలో మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనే సుమారు లక్ష మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వమంటారా.. వద్దంటారా..? సూటి ప్రశ్న. చంద్రబాబుకు ఎంతసేపు పదవి గోల తప్పితే ప్రజల సంక్షేమం అవసరం లేదు. లూలూ అనేది షాపింగ్‌ మాల్‌కు సిటీ సెంట్రల్‌లో కోట్లు విలువ చేసే స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టాడు. అబద్దాలు చెప్పడం మాకు చేతకాదు.. ఉన్న వాస్తవాలు చెబుతాం అని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
 
 

Back to Top