బాబూ.. నీకెందుకింత ఓర్వలేనితనం

చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నాడు

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను ఇప్పటికైనా గౌరవించు

రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ధ్యేయం

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌

విశాఖపట్నం: ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కి ప్రజల్లో మంచిపేరు వస్తుందనే ఓర్వలేనితనంతో చంద్రబాబు దొంగ యాత్రలు, నీచ రాజకీయాలు చేస్తున్నాడని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. కుల, మత, ప్రాంతం చివరకు పార్టీలు కూడా చూడకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. మరోపక్క అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, టీడీపీ ఉనికి కాపాడుకునేందుకు చంద్రబాబు కుట్రా రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ను వ్యతిరేకించినందుకే చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారన్నారు. దీన్ని టీడీపీ నేతలు ప్రభుత్వం, పోలీసులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించాలని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు.

విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ఐదు సంవత్సరాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు చరిత్రలో జరగని దోపిడీ చేశారు. విశాఖలో జరిగిన దోపిడీపై సాక్షాత్తు అప్పటి మంత్రి ఇంకో మంత్రిపై సిట్‌కు ఫిర్యాదు చేశాడు. నీరు–చెట్టు, ఇసుకతో భారీగా దోచుకున్నారు. భూములున్న వారిని ఇబ్బందులు పెట్టడం, కబ్జాలు చేసి డబ్బులు లాక్కున్నారు. ఇవన్నీ ఉత్తరాంధ్ర ప్రజలు మర్చిపోయారని చంద్రబాబు భ్రమపడుతున్నాడు. 

చంద్రబాబు ప్రతిసారి విశాఖకు వచ్చి నోవాటెల్‌లో మీటింగ్‌లు పెట్టి సూటూబూటు వేసుకున్న వారిని పిలుచుకొచ్చి రెండు ఫొటోలు దిగి వెళ్లిపోవడం తప్ప చేసిందేమీ లేదు. ఉద్దానం ప్రాంతానికి ఐదేళ్లలో ఏమైనా చేశారా..? సీఎం వైయస్‌ జగన్‌ శ్రీకాకుళంలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. పాడేరులో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి జీఓ ఇచ్చారు. పార్వతీపురంలో ఇంజనీరింగ్‌ కాలేజీ, విశాఖకు మెట్రో రైలు, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తిచేస్తామని సీఎం ప్రకటించారని, పోలవరం నుంచి సపరేట్‌ పైపులైన్‌ వేసి విశాఖకు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ తొమ్మిది నెలల పాలనలోనే ఇన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటే.. చంద్రబాబు ఐదేళ్లలో ఎందుకు చేయలేకపోయారు.

ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇళ్లు లేని నిరుపేదలకు సెంట్‌ స్థలం ఇస్తామంటే దాన్ని కూడా చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. భీమిలిలో రూ.20 లక్షలు ఖరీదు చేసే భూమి పేదలకు ఉచితంగా ఇస్తామంటే చంద్రబాబు కడుపు రగిలిపోతున్నట్లుంది. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడోనని అనుమానంగా ఉంది. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు భూకబ్జాలకు పాల్పడ్డారని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. ఎక్కడ అక్రమాలు, కబ్జాలు చేశామో నిరూపించే దమ్ముందా..? నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు.

చంద్రబాబు హయాంలో ఏసీబీ రైడ్లు జరగలేదు. మా ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే అధికారులు అవినీతి చేయకూడదని ఎన్నో చోట్ల ఏసీబీ రైడ్లు చేయించాం. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రజల్లో ఎక్కడ మంచిపేరు వస్తుందోనని చంద్రబాబు తప్పుడు ప్రచారాలు, దొంగ యాత్రలు చేస్తున్నాడు. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా స్థాయిని తగ్గించుకొని ప్రవర్తిస్తున్నాడు. చంద్రబాబు బుద్ధి ఎప్పటికీ మారదు’ అని మంత్రి అవంతి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top