పులిచింతల గేటు మరమ్మత్తులకు యుద్ధప్రాతిపదికన చర్యలు

 
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్

 రేపు సాయంత్రానికి గేటు మరమ్మత్తులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం

  పులిచింతల గేటు సాంకేతిక సమస్యపై నిపుణులతో కమిటీ వేసి, నివేదిక తెప్పిస్తాం

 ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసిన ప్రభుత్వ యంత్రాంగం

 పులిచింతల  ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

విజ‌య‌వాడ‌:  పులిచింత‌ల గేటు మ‌ర‌మ్మ‌త్తుల‌కు యుద్ధ‌ప్రాతిపదిక‌న చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  పి. అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టు 16వ నంబరు గేటు వద్ద సాంకేతిక సమస్య ఏర్పడి, గేటు విరిగిపోయిన ప్రదేశాన్ని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురువారం పరిశీలించారు. దీనికి సంబంధించి ప్రాథమిక సమాచారాన్ని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గేటు మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి తక్షణ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. అలానే ప్రాజెక్టు దిగువ ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు వివరించారు.  ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 
పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోయిన ప్రాంతంలో తక్షణ మరమ్మత్తులు చేపట్టేందుకు అధికారులు  సిద్ధమయ్యారు. మరోవైపు వరద ఉద్ధృతి తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. పోలవరం ప్రాజెక్ట్ నుంచి కూడా నిపుణులు ఇక్కడకు వస్తున్నారు. రేపు సాయంత్రానికి మరమ్మత్తులు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తే సమయంలో హైడ్రాలిక్ గడ్డర్‌ విరిగిపోయింది. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు ఇంజనీర్లు, ఇంజనీరింగ్ నిపుణుల బృందాలు పరిశీలించాయి. 6 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో సముద్రంలోకి నీటి విడుదల చేస్తున్నాం.

స్టాప్‌ లాక్‌ గేట్లను పెట్టాలన్నా నీటిని కిందకు విడుదల చేయాల్సి ఉంటుంది. విరిగిపడిన గేటు స్థానంలో స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు అవకాశం ఉంది.  స్టాప్‌ లాక్‌ గేటును దించేసమయంలో మళ్లీ నీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
అవసరం అయితే అయిదు లక్షల క్యూసెక్కుల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు వదిలివేయాల్సిందే. ఇందుకోసం అధికారులను కూడా సన్నద్ధం చేయడం జరిగింది.

ఎంత త్వరగా గేటు మరమ్మతులు పూర్తి చేసుకుంటే అంత మంచిది. నిపుణుల బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. రేపు సాయంత్రానికి మరమ్మత్తులు పూర్తి అవుతాయని భావిస్తున్నాం. ప్రాజెక్ట్‌లో నీళ్లు పది టీఎంసీలకు తగ్గాకే మరమ్మతులు చేపట్టే అవకాశం ఉంది.

డ్యామేజీ అంతా పది, పదిహేను సెకన్లలోనే జరిగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే దానిపై ఓ నిపుణుల కమిటీని వేసి, నివేదిక తీసుకుంటాం. 

గేటు మరమ్మత్తు నిమిత్తం నీటిని కిందకు వదిలినా, రానున్న రోజుల్లో వర్షాలు పడి, వరదనీరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ప్రాజెక్టులో నీటిని స్టోర్‌ చేసుకోవచ్చు అని మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top