విజయవాడ: టీడీపీ హయాంలో కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్‌ను కట్టారని ఇదే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి కారణమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ హయాంలో చేసిన ఘోర తప్పిదాల కారణంగానే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మంత్రి మండిపడ్డారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం తప్పిదం వల్లే పోలవరం జాప్యం పార్లమెంట్‌లో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి చెప్పిన సమాధానానికి వక్రభాష్యాలు చెబుతూ.. ‘పోలవరం జాప్యానికి ఏపీ సర్కార్, జగన్ సర్కారే కారణం’అంటూ అంటూ టీడీపీకి చెందిన ఆ రెండు పత్రికలు పెద్ద ఎత్తున వైయస్సార్ సీపీ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం చేశాయి. ఎంపీ కనకమేడల అడగటం, వాళ్లు చెప్పడం దాన్ని తీసుకు వచ్చి, ఎల్లో మీడియాలో మెయిన్ పేజీలో వేసి జగన్‌గారి ప్రభుత్వంపై బురదచల్లేలా రాతలు రాయడం చూస్తుంటే, టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇతర ఎల్లో మీడియా అంతా కలిసి రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణాన్ని సృష్టించేలా, ప్రజలను గందరగోళపరిచేలా కుట్ర పన్నారని అర్థమవుతుంది. వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్ట్ పనులు సాగడం లేదని, అంతకు ముందు టీడీపీ హయాంలో పనులు అద్భుతంగా జరిగాయని ఒక బ్రాండింగ్ చేసే ప్రయత్నం చేశారు. అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగడం లేదనేది వాస్తవం. ఎందుకు జరగడం లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పిదాల వల్లే ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆలస్యం అవుతుంది తప్ప మరొకటి కాదని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే, ఏదోరకంగా దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి, జగన్ గారి సర్కార్ వచ్చిన తర్వాతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కుంటుపడిపోయిందని, పనులేమీ జరగడం లేదనేలా, వారికి కొమ్ముకాసే పత్రికలు, టీవీ ఛానళ్ళ ప్రాబల్యంతో ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నారనేది అందరూ గమనించాలి. ఏ ప్రభుత్వం చేయకూడని పని టీడీపీ చేసింది ఏ ప్రభుత్వం కూడా చేయకూడని పని, ఇంజినీరింగ్ శాఖ చేయకూడని పనిని గత టీడీపీ ప్రభుత్వం చేసింది. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాకుండా డయాఫ్రం వాల్ కట్టిన ప్రబుద్దులు బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండరు. ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్ప. స్పిల్ వే పనులు నిలిపేసి, కాఫర్ డ్యామ్ నిర్మాణం పూర్తి చేయకుండా, డయాఫ్రం వాల్ కట్టేశారు. ఆ తర్వాత వరద వచ్చింది స్పిల్ వే నుంచి నీళ్లు వెళ్లలేదు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. కాఫర్ డ్యామ్‌లు కంప్లీట్ కాలేదు. గ్యాప్‌లు పెట్టారు. గ్యాప్‌ల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి టీడీపీ హయాంలో రూ. 400 కోట్లతో కట్టిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదా, కొట్టుకుపోయిందా.. అసలు దాని పరిస్థితేమిటో, ఎలా కనిపెట్టాలో అర్థం కాక దేశంలో ఉన్న మేధావులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి కారణం గత టీడీపీ ప్రభుత్వం తెలివి తక్కువ తనం. ఇది దుర్మార్గమైన తెలుగుదేశం ప్రభుత్వం చర్య కాదా? బాబు ప్రభుత్వాన్ని జాతి క్షమించదు ప్రపంచంలో ఎవ్వరూ చేయని తప్పు పోలవరం ప్రాజెక్టు విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ పూర్తి చేసి గాలికి వదిలేసిన, చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుది. చంద్రబాబు సర్కార్ చేసిన ఈ తప్పును జాతి ఎప్పటికీ క్షమించదు. దీనిపై నిపుణులను చెప్పమనండి. డయాఫ్రం వాల్ ఎలా కడతారో, మొదట్లో నాకు తెలియకపోయినా, తర్వాత అధికారులను, ఇరిగేషన్ ఎక్స్ పర్ట్ లను అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నాను. - పోలవరం ప్రాజెక్ట్ దగ్గరకు దేవినేని ఉమ 90సార్లు, చంద్రబాబు నాయుడు 40సార్లు వెళ్లారంట. వాళ్లిద్దరూ అన్నిసార్లు ఎందుకు వెళ్లారో?. సింగడు అద్దంకి వెళ్లాడు... వచ్చాడు అన్నట్టు వారు అన్నిసార్లు వెళ్ళి ఏం లాభం..?. వీళ్లు వెళ్లి ఏం చేశారు?. ఏదైనా చేస్తే ప్రయోజనం ఉండాలి కదా? మా ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత పునాదుల్లో ఉన్న స్పిల్‌వే, స్పిల్ ఛానల్‌ను పూర్తి చేశాం. అప్రోచ్ ఛానల్‌ను పూర్తి చేశాం. - చిత్రమైన విషయం ఏంటంటే...మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నది డైవర్ట్ చేశాం. పోలవరం వైవిధ్యం కలిగిన ప్రాజెక్ట్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నది డైవర్ట్ చేయబడింది. స్పిల్‌వేతో నీళ్లు వదలబడ్డాయి. ఇవాళ వచ్చిన 26 లక్షల క్యూసెక్కలు వరద నీటిని కూడా స్పిల్‌వే ద్వారా దిగువకు పంపించిన ప్రభుత్వం మాది. ఈ వాస్తవాలు చెప్పకుండా, ఏదోదే మాట్లాడటం, తెలుగుదేశం అనుకూల పత్రికల్లో అబద్ధాలు రాయడం మంచిది కాదు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంపై ఇన్వెస్టిగేషన్ చేసి వాస్తవాలు రాయగలరాఃఈనాడు రామోజీకి సవాల్ డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై.. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇన్వెస్టిగేషన్ చేసి రాయాలని ఛాలెంజ్ చేస్తున్నా. దీనిపై జర్నలిస్టులు కూడా పూర్తిగా విచారణ జరిపి, మీ ఈనాడు పత్రికలోనే ఫ్రంట్ పేజీలో ప్రచురించండి. పోలవరం ప్రాజెక్టుపై సందు దొరికినప్పుడల్లా అసత్య కథనాలు రాస్తున్న మీరు ఈ పని ఎందుకు చేయడం లేదు.. అంటే టీడీపీతో మీరు కుమ్మక్కయ్యారని ఎవరికైనా అర్థం అవుతుంది. - లోయర్ కాఫర్ డ్యామ్ ఎందుకు మునిగిపోయింది?. డయాఫ్రం వాల్ కట్టకుండా కాఫర్ డ్యామ్ కట్టడం వల్లే జరిగింది. ఇదంతా టీడీపీ సర్కార్ నిర్వాకం వల్లే జరిగింది. తద్వారా పోలవరం నిర్మాణం జాప్యమైంది. టీడీపీ ప్రభుత్వం చేతగానితనాన్ని, మా మీద రుద్ది ఈరోజు డ్రామాలు ఆడుతున్నారు. దేవినేని ఉమ మాటలు వింటుంటే నవ్వొస్తొంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో అన్నిసార్లు వెళ్ళాం, ఇన్నిసార్లు వెళ్ళాం.. అంత కాంక్రీటు వేశాం.. ఇంత వేశాం.. అని అరిగిపోయిన రికార్డులా పదే పదే చెబుతున్నారు. అన్నిసార్లు వెళ్ళి వాళ్ళు ఏం చేశారు..?. చంద్రబాబు, దేవినేని ఉమాలు వారే స్వయంగా రాళ్లుకొట్టి మోసినట్లు పోలవరం క్రెడిట్ తమదే అన్నట్టుగా చెబుతున్నాడు. రూ. 400 కోట్లు ఖర్చుపెట్టి డయాఫ్రం వాల్ కట్టిస్తే మీ తెలివితక్కువ, మీ ప్లానింగ్ లేమి వల్ల తుస్సున కొట్టుకుపోయింది కదా?. అదే మీరు సాధించిన ఘనత. దొంగలు పడ్డ ఆర్నెల్లకు... దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగినట్లు చంద్రబాబు నాయుడు వరద యాత్రకు బయల్దేరాడు. వరద యాత్రకు బయల్దేరే ముందు ఎల్లో పత్రికల్లో ప్రిపరేషన్ అంతా చేసుకుని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైన వార్తలు రాయించి, ఈరోజు ఆయన వరదల మీద మాట్లాడుతున్నాడు. వరద బాధిత ప్రాంతాల పేరుతో వరద తగ్గిన తర్వాత ప్రజలను రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నాయుడు నీచమైన కుట్రతో పర్యటన చేస్తున్నాడనే విషయంతో పాటు, వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి. ఆయన శాసనసభకు రాడు. బీజేపీ బలపరిచిన రాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేయడానికి మాత్రం శాసనసభకు వస్తాడు. - వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటిస్తున్నాడు. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టేందుకే. వరద సాయం అందాయా అంటూ అడిగితే ఎవరైనా తమకు వరద సాయం చేయడం లేదని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటే... అక్కడ ఓ బాధితుడిని పట్టుకుని ఏడుస్తాడు. దాన్ని ఫోటో తీసి పెద్ద ఎత్తున ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తారు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చంద్రబాబుకు మొర పెట్టుకున్నారంటూ.. మరో వార్తను తమ వర్గం మీడియాలో ఫ్రంట్ పేజీలలో వార్తలు ప్రచురిస్తారు. ఇప్పటికైనా దుర్మార్గమైన ప్రచారాలు మానుకుని, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే మంచిది. - ఇంత పెద్ద ఎత్తున వరదలు వస్తే తెలంగాణకు తలమానికం అయిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఎంత పెద్ద ఆపద వచ్చిందో చూశారు. కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. పోలవరం నిర్మాణం పనులు జరుగుతున్నా, 26 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినా, క్షేత్రస్థాయిలో ఉండి అధికారులతో పనిచేసి, ప్రాజెక్ట్‌కు ఎలాంటి నష్టం లేకుండా చేసుకోగలిగాం. కారణం మా చిత్తశుద్ధి వల్లే. మా శాఖ అధికారులను, సిబ్బందిని అభినందిస్తున్నా. ఒక టీమ్ వర్క్‌లా అందరం కలిసి పనిచేసి సాధ్యమైనంత త్వరలో పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనుకుంటున్న ప్రభుత్వం మాది. వరద బాధితులను ఆదుకున్న ప్రభుత్వం ఇది వరద బాధితులకు రెండువేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మాదే. అందరికీ నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపించిన సర్కార్ మాది. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ సమిష్టిగా పనిచేసి, నిర్వాసితులను, వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశామని గర్వంగా చెబుతున్నాం. గోదావరికి పెద్ద ఎత్తున వరద వచ్చినా.. ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రజలను కాపాడుకోగలిగాం. ఇంత పెద్ద విపత్తు వచ్చినా కూడా, వరద బాధితుల్ని ఆదుకోవడంలో అధికారులు, సచివాలయ సిబ్బంది, మా పార్టీ కార్యకర్తలు నిత్యం పనిచేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పనిచేసినవారిని అందర్నీ అభినందిస్తున్నాం. అలాంటి మా ప్రభుత్వంపై విమర్శలు చేయడమా?. సిగ్గుచేటు. మీ బాబు ఆంధ్రప్రదేశ్ లోనే లేడుగా.. వరద సహాయ చర్యలన్నీ సమర్థవంతంగా జరిగితే.. టీడీపీ నాయకులకు ఏం మాట్లాడాలో అర్థం కాక, డ్రామాలు ఆడుతున్నారు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటలు అంటూ దేవినేని ఉమా, బోండా ఉమలు వల్లెవేస్తున్నారు. నాకు పోలవరం గురించి తెలియదని మాట్లాడుతున్నారు. మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఓ ఛానల్‌లో మాట్లాడుతూ నాకు బుద్ధి, జ్ఞానం లేదంటున్నాడు. ఆయనకు బాగా ఉందికదా? కర్ణుడు కవచకుండలాలుతో పుట్టినట్లుగా దేవినేని ఉమను, ఆయన తల్లిదండ్రులు బుద్ధి, జ్ఞానంతోనే పుట్టించారు. బుద్ధి, జ్ఞానం అమ్ముతాడో లేక కిడ్నీ దానం చేసినట్లు బుద్ధి, జ్ఞానం దానం చేస్తాడేమో కనుక్కోండి. మాట్లాడితే.. ఏవయ్యా రాంబాబు తెలుసుకో అంటున్నాడు. మరొక్కసారి ఏవయ్యా రాంబాబు అంటే ఊరుకునేది లేదు. ఆ విషయాన్ని దేవినేని ఉమ గుర్తుపెట్టుకోవాలి. మరోసారి, ఏవయ్యా రాంబాబు అంటే ఒరేయ్, తురేయ్ అని మాట్లాడాల్సి ఉంటుంది. మాటలు జాగ్రత్తగా రానివ్వు దేవినేని ఉమా. మా ముఖ్యమంత్రి గారి గురించి తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చున్నాడు. కుర్చీలో నుంచి లేవడం లేదు. హెలికాప్టర్లతో తిరుగుతున్నారంటూ వాగుతున్నాడు. అసలు మీ కడుపు మంట ఏంటని అడుగుతున్నాను. ఆయన తాడేపల్లిలోనే ఉన్నారు. మరి మీ మహానుభావుడు చంద్రబాబు ఎక్కడ ఉన్నాడు? ఆంధ్రప్రదేశ్‌లోనే లేడుగా? హైదరాబాద్‌లో నివాసం ఉంటూ ఏపీలో వరదలు వస్తే, నాలుగు రోజులు తర్వాత తీరిగ్గా పరుగెత్తుకుంటూ వస్తాడు. రాష్ట్రంలో నివాసమే లేనటువంటి వ్యక్తి నాయకత్వంలో నువ్వుండి... ఇక్కడ ఆంధ్రరాష్ట్రంలో ఉండి నిత్యం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిపై అవాకులు, చెవాకులు పేలడానికి నీకు సిగ్గులేదా అని ప్రశ్నిస్తున్నా. - మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ బ్యాటరీ డౌన్ అయ్యిందేమో. రెండో కృష్ణుడు బొండా ఉమ వచ్చి... నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటలు, నాలుగు బంగాళదుంపలు ఇస్తే అయిపోయిందా? ఇదేనా ప్రభుత్వం చిత్తశుద్ధి అంటున్నాడు. నిత్యావసర సరుకులతో పాటు వరద సాయం కింద ప్రతి బాధితుడికి రెండువేల రూపాయిలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందా? చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన చేశారు కదా? తిత్లీ తుఫాన్‌లో మీరు అధికారంలో ఉండి కోతలు కోశారుగా?, ఎప్పుడైనా ఇచ్చారా? దానికి మాత్రం దేవినేని ఉమ సమాధానం చెప్పడు దేవినేని ఉమా మహేశ్వరరావును మళ్లీ మళ్లీ అడుగుతున్నా. ఎన్నిసార్లు అడిగినా, దానికి మాత్రం సమాధానం చెప్పడు. అసెంబ్లీ సాక్షిగా బల్ల గుద్ది 2018లో పోలవరం పూర్తి చేసి, చంద్రబాబు నాయుడు అపర భగీరధుడు అని చాటిచెబుతామని చెప్పిన దేవినేని ఉమా మహేశ్వరరావు పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఎందుకు సమాధానం చెప్పరని సూటిగా ప్రశ్నిస్తున్నా. సిగ్గులేదా నీకు? మరి నీకు సిగ్గు, బుద్ధి ఉంటే చెప్పు. పోలవరం నిర్మాణం గురించి కానీ, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అయిదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉండి పోలవరం పూర్తి చేస్తామని శపథం చేసి దాన్ని పూర్తి చేయలేనివాడివి నువ్వు అసమర్థుడివా? నేనా?. - చంద్రబాబు నాయుడు పోలవరం మీద శ్రద్ధ పెట్టాడు. అనేకసార్లు తిరిగారని టీడీపీ వాళ్లు చెబుతున్నారు కదా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి శంకుస్థాపన చేసేవరకూ చంద్రబాబు నాయుడు గుడ్డి గుఱ్ఱాలకు పళ్లు తోముతున్నారా? అంతకు ముందు ఆయనకు కనీసం, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనే ఆలోచన రాలేదా? 1995లో ఎన్టీఆర్‌గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏంచేశారు...?. వైయస్సార్ గారు పోలవరానికి శంకుస్థాపన చేసేవరకూ బాబు ఏం చేస్తున్నాడు?. మీ చెత్తవాగుడుకు తందానా అంటూ రాసే పత్రికలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నమ్మేందుకు ప్రజలేమీ అమాయకులు కారని టీడీపీ నేతలు, చంద్రబాబు గ్రహించాలి. ఇప్పటికైనా చంద్రబాబు డ్రామాలు ఆపితే మంచిది. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. - సంస్కారం లేకుండా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారా..?. తెలంగాణాకు ఏ నష్టమూ లేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణకు నష్టం కలుగుతుందని తెలంగాణ మంత్రులు, తెలంగాణ ప్రాంతాల వారు మాట్లాడుతున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. అన్నింటిని చర్చించిన తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ డిజైన్లకు ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల లెవెల్ వరకూ నీటిని సామర్థ్యం ఉంచినా తెలంగాణకు నష్టం జరగదు. నష్టం జరిగే ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ఇచ్చారు. - అయిదు ముంపు గ్రామాలు తమకు ఇచ్చేయాలని తెలంగాణవాళ్లు అడుగుతున్నారంటున్నారు. వాళ్ళను కేంద్రాన్ని వెళ్లి అడగమనండి. ఎనిమిదేళ్లుగా అడగని తెలంగాణ శాసనసభ్యులు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారనేది కూడా మా ప్రశ్న.