ఇరిగేషన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు

మంత్రి అంబటి రాంబాబు

 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదు

 ఎక్కువ డబ్బు ఖర్చు చేశామంటున్నారు. చేస్తారు..

కమిషన్ల కోసమే ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చు చేశారు

 ఉద్యమం పేరుతో దైవాన్ని అడ్డం పెట్టుకుని యాత్ర 

గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం యాత్ర

ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి వరకు యాత్ర

నేరుగా చేయకుండా, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు

రాజకీయాలు మాట్లాడుతూ, సీఎంగారిని విమర్శిస్తున్నారు

తొడలు గొడుతూ, రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు

గుర్తు చేసిన మంత్రి  అంబటి

 ఒళ్లు బలిసిన పాదయాత్ర వల్ల ఉత్తరాంధ్రకు మేలు

అక్కడి ప్రజలకు జ్ఞానోదయం అవుతోంది

వారూ చైతన్యవంతులు అవుతున్నారు. అందుకే పోరాటం

ఇకనైనా పాదయాత్ర విరమించండి. అది మంచిది

లేకపోతే సూర్యభగవానుడి వేడికి మాడి మసైపోతారు

ప్రెస్‌మీట్‌లో మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి: ఇరిగేషన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేద‌ని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.  14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదని మండిప‌డ్డారు. ఉత్తరాంధ్రలోనే కాదు. రాష్ట్రంలోనూ మీది అదే పరిస్థితి ఉంద‌న్నారు. బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

*అందుకే చర్చ. అది మంచికే:*
    ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఉత్తరాంధ్ర వైపు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం. అమరావతి మాత్రమే రాజధాని కావాలి. మూడు రాజధానులు వద్దంటున్న ఒక బ్యాచ్‌. అక్కడ భూములు కొన్న వారు, తెలుగుదేశం నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కోటీశ్వరులు.. ఇలా ఉద్యమం పేరుతో దైవాన్ని అడ్డం పెట్టుకుని యాత్ర చేస్తున్నారు. గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ తిరుపతి వెళ్లారు. ఇప్పుడు అమరావతి నుంచి అరసవెల్లి అంటూ సూర్య దేవాలయానికి యాత్ర మొదలు పెట్టారు. కానీ అది కూడా నేరుగా చేయకుండా, ఎక్కడెక్కడో తిరుగుతూ, రాజకీయాలు మాట్లాడుతూ, జగన్‌గారిని విమర్శిస్తూ, తొడలు గొడుతూ, రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ యాత్ర చేస్తున్నారు. దీంతో దీనిపై చర్చ జరుగుతోంది. నిజానికి ఆ చర్చ కూడా జరగాలి.

*ఈ యాత్రతో వారికి జ్ఞానోదయం:*
    వారు చేస్తున్న ఒళ్లు బలిసిన పాదయాత్ర వల్ల ఉత్తరాంధ్ర ప్రజలకు జ్ఞానోదయం అవుతోంది. వారూ చైతన్యవంతులు అవుతున్నారు. అమరావతి నుంచి వచ్చి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందవద్దని అనడాన్ని వారు గుర్తించారు. ఇప్పుడు పోరాటం మొదలు పెట్టారు.
    ఇక ఎల్లో మీడియా. అదే పనిగా ఉత్తరాంధ్రపై కధనాలు రాస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కధనాలు రాస్తే, మా ఈఎన్సీగారు చక్కగా వివరణ ఇస్తే, దాన్ని కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో మరో కోణంలో రాశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై మా ప్రభుత్వం కంటే, చంద్రబాబు ఎక్కువ ఖర్చు చేశారని రాశారు.

*ఆ నైతిక హక్కు లేదు:*
    నేను అడుగుతున్నాను. బాబు కానీ, ఆయనను సమర్థిస్తున్న దుష్ట చతుష్టయాన్ని. వారికి ఇరిగేషన్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఏనాడూ ఎక్కడా ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఉత్తరాంధ్రలోనే కాదు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదు. డబ్బు ఎక్కువ ఖర్చు చేశామంటున్నారు. చేస్తారు. ఎందుకంటే కమిషన్ల కోసం. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయనందుకు చంద్రబాబు సిగ్గు పడాలి. 
    నిజానికి రాష్ట్రంలో ఆనాడు ప్రాజెక్టుల గురించి ఆలోచించింది, వాటికి డిజైన్‌ చేసింది వైయస్సార్‌గారు. ఆ పనులే ఇవాళ కూడా జరగుతున్నాయి. అందుకే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు.
    ఇక కొన్ని ప్రాజెక్టులపై మనకు ఒడిషాతో వివాదాలు ఉన్నాయి. వాటి గురించి చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. కానీ జగన్‌గారు ఒడిషా సీఎంతో భేటీ అయ్యారు. వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. అలా వంశధార, ఉద్ధానం ప్రాజెక్టులు ఎలాగైనా పూర్తి చేయాలని ఆయన చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.

*యాత్ర మానండి. లేకపోతే..:*
    ఇవాళ ఉత్తరాంధ్ర మీద చర్చ జరగడానికి కారణం అమరావతి పాదయాత్ర. రాజకీయంగా కుట్ర చేసి, స్వలాభం కోసం చేస్తున్న ఈ యాత్ర సూర్య దేవాలయం వరకు చేరుతుందా? భగభగ మండే సూర్యుడి దగ్గరకు మీరు పోలేరు. మాడి మసైపోతారు. అందుకే మానుకొండి. మీ చంద్రుడి దగ్గరకు తిరిగి పొండి.
    మరోసారి చెబుతున్నాను. ఈ పాదయాత్ర వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు మరింత చైతన్యవంతులవుతారు. మీకు మరింత గట్టిగా సమాధానం చెబుతారు.

*వారిని చూస్తే జాలేస్తోంది:*
    ఇక జనసేన. ఆ పార్టీ ప్రస్థానం. పవన్‌కళ్యాణ్‌ స్టేట్‌మెంట్లు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే జాలి కలుగుతోంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టడానికి సత్తా ఉండాలి. లేదా పూర్తిస్థాయిలో పని చేయాలి. ఎలాగైనా పోరాడి అధికారంలోకి రావాలన్న తపన ఉండాలి. అంతేతప్ప, ఎవరో అధికారంలోకి రావాలన్న లక్ష్యం ఉండడం కాదు. ఎవరి కోసమో పని చేయడం కోసం కాదు. దీని వల్ల ఆ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వాళ్లు తీవ్రంగా నష్టపోతారు. గతంలోనూ అలాగే జరిగింది.
    పవన్‌కళ్యాణ్‌ను నమ్మి, చిత్తశుద్ధితో పని చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని నేను చూస్తున్నాను. చాలా సిన్సియర్‌గా పని చేస్తున్నారు. వారు జన సైనికులని పవన్‌ అంటారు. వారిని చూస్తే జాలి కలుగుతుంది. అలాగే వీర మహిళలను అడుగుతున్నాను. వారిపైనా జాలి కలుగుతోంది. మిమ్మల్ని అడుగుతున్నాను. మీ సైన్యం ఎవరితో యుద్ధం చేసే ప్రయత్నం చేస్తోంది? వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపైనే కదా! దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసు. మాకు క్లారిటీ ఉంది.

*ఎవరి కోసం పోరాటం?:*
    అయితే వీర మహిళలు. జన సైనికులు..ఎవరి కోసం పోరాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఎవరి కోసం ఇంకా పోరాటం చేయాలని అనుకుంటున్నారు? ఎవరిని అందలం ఎక్కించాలని చూస్తున్నారు? అసలు మీ నాయకుడికి క్లారిటీ ఉందా? ఇప్పుడు మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారని మీ నాయకుడు చెబుతున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి కన్ను కొడుతున్నారు. 

*ఆ ధైర్యం ఉందా?:*
    మీకు ధైర్యం ఉంటే చెప్పండి. మేము బీజేపీతో లేము. చంద్రబాబుతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నాం అని చెప్పండి. అసలు మీకు 175 సీట్లలో పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా? కనీసం మీకు ఆ ఆలోచన అయినా ఉందా? చివరకు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దానిపై అయినా మీకు క్లారిటీ ఉందా? పవన్‌కళ్యాణ్‌ను సీఎం చేయాలని మీరు అనుకుంటే ముందు క్లారిటీ తీసుకొండి. 

*ఏ మాత్రం స్పష్టత లేదు:*
    తొలుత చెగువీరా బొమ్మ పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిపి పని చేశారు. అంతకు ముందు టీడీపీకి అనుకూలంగా పని చేశారు. గత ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడానికి పని చేశారు. 
ఇప్పుడు మమ్మల్ని రోజూ తిట్టడం తప్ప, మీకు వేరే పని లేదు.
    మీకు ఒక పాలసీ, సిద్ధాంతం లేదు. ఎవరి గెలుపు కోసమో పని చేస్తున్నారు. అమరావతి ఎవరి రాజధాని? అన్న పుస్తకం ఆవిష్కరించినప్పుడు ఏం మాట్లాడారు? కర్నూలులో ఏమన్నారు? విశాఖలో ఏం మాట్లాడారో? ఒక్కసారి గుర్తు చేసుకొండి.
    మీకు స్పష్టత లేదు. ఒక స్పష్టత ఉంటేనే నిలబడగలుగుతారు. లేకపోతే కాలగర్బంలో కలిసి పోతారు. అంతే తప్ప మామీద విమర్శలు మాత్రమే చేయడం కాదు.
    నీవు దత్తపుత్రుడికి అంటున్నాం. ఔను. అది నిజం. కాదంటే, మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించు. అంటే మొత్తం సీట్లలో పోటీ చేసే ధైర్యం, ఆలోచన నీకు లేవు. ఇప్పుడు ఒక 15 ట్వీట్లు పెట్టారు. రేపో, ఎల్లుండో అరసవెల్లి వెళ్తారు. ఎందుకంటే, తెలుగుదేశం వారికి మద్దతు ఇవ్వడమే పవన్‌కళ్యాణ్‌ పని.

 *చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకేమిటి?:*

    విశాఖను, ఉత్తరాం«ధ్రను రెచ్చగొడితే.. మాడి మసైపోతారు. అందులో సందేహం లేదు. యాత్రలో తొడలు కొడతారా?. అది సరైన పనేనా?.
    మూడు ప్రాంతాల్లో చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకేముంది? ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అందుకే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అంటున్నాం. 

*దిగజారిన రాజకీయం:*
    రాజకీయంగా మామీద బురద చల్లడం కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ప్రయత్నిస్తున్నారు. ఎల్లో మీడియా కధనాలు రాస్తోంది.
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారు? రాళ్లు రప్పలతో కూడుకుని ఉన్న హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని చెబుతున్నారు. 
    మాయల ఫకీరు ప్రాణం ఎక్కడో ఏడు సముద్రాల ఆవల ఒక గుహలో ఉన్నట్లు.. చంద్రబాబు ప్రాణం ఈనాడు, జ్యోతి, దుష్ట చతుష్టయంలో ఉంది. ఎన్టీ రామారావు నుంచి పదవి లాక్కోవడం కూడా అప్పుడు సరైన నిర్ణయమని అంటున్నారు. అంతకంటే దిగజారుడు ఇంకేమైనా ఉందా?

*ఆ నిర్మాణం సాధ్యం కాదు:*
    రాజధానిని ఎవరూ నిర్మించరు. మనలాంటి దేశంలో అసలు అది సాధ్యం కాదు. నిన్ననే చూశాను. ఆస్ట్రేలియాలో క్యాన్‌బెర్రా వద్ద రాజధాని కట్టారు. ఎందుకంటే వారిది ధనిక దేశం. వారికి డబ్బుంది. అందుకే రాజధాని కట్టారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. మొత్తం డబ్బు తీసుకుపోయి ఇక్కడ రాజధానిని సృష్టించడం సాధ్యం కాదు. దేశంలో ఎక్కడైనా రాజధానిని కొత్తగా కట్టారా? సృష్టించారా? ఎక్కడైనా సరే, ఏదైనా నగరంలో రాజధాని పెట్టాలి. అంతే తప్ప, ఎక్కడో 30 కి.మీ బయట కట్టడం కాదని మంత్రి శ్రీ అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.
 

Back to Top