బాబు జీవితమంతా రోడ్ల మీద తిరగడమే..

భారతీయుడులో కమల్‌హాసన్‌ని చూడలేదా చంద్రబాబూ..?

నీలాంటి దుర్మార్గులను రాజకీయంగా గొంతు కొయ్యడానికి వచ్చిన భారతీయుడులో కమల్‌హాసన్‌ సీఎం వైయస్‌ జగన్‌ 

వరద బాధితులకు రూ.2 వేలు సాయం అందించిన చరిత్ర ఎక్కడైనా ఉందా..?

హుద్‌హుద్‌ సమయంలో చంద్రబాబు ఎంత సాయం చేశాడు..?

ఎన్టీఆర్‌ నిర్మించిన భద్రాచలం కరకట్టను బాబు తన ఖాతాలో వేసుకుంటున్నాడు

జాతీయ ప్రాజెక్టును ఎందుకు టేకోవర్‌ చేశావ్‌.. సమాధానం చెప్పు

నా రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ విసురుతున్నా

చంద్రబాబుపై ఇరిగేషన్‌ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం

విజయవాడ: వరద బాధితుల పరామర్శ పేరుతో ప్రతిపక్షనేత చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నాడని, పరామర్శకు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో శభాష్‌ అనిపించుకునేలా వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేసిందని, అది చూసి కడుపుమంటలతో నోటికి వచ్చినట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కోడి కత్తి కమల్‌హాసన్‌ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబుకు.. భారతీయుడులో కమల్‌హాసన్‌ గురించి తెలియదా..? దుర్మార్గులకు, దుష్టులను, చంద్రబాబు లాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి వచ్చిన భారతీయుడిలో కమల్‌హాసన్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని ప్రజలు చెబుతున్నారన్నారు. 1986లో భద్రాచలంలో కరకట్ట కట్టానని చంద్రబాబు సొరకాయలు కొయ్యడం హాస్యాస్పదమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 

విజయవాడలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

‘‘వరదల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా ప్రజలను ఆదుకునేందుకు అధికార యంత్రాంగమంతా నిమగ్నమై శభాష్‌ అని అనిపించుకునే రీతిలో అండగా నిలబడింది. దీన్ని చూసి ఓర్వలేక, ప్రజలు శభాష్‌ అంటుంటే కడుపుమంటతో చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడు. ఈనెల 22, 23 తేదీల్లో వరద ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.. ఏమి అందలేదో ప్రభుత్వాన్ని నిలదీయండి.. సీఎం వైయస్‌ జగన్‌ గాల్లో తిరుగుతున్నాడు. వరదల కంటే, గాలి, వాన కంటే నేను ముందువస్తానని మాట్లాడాడు. నిజంగానే ఆయనొస్తే కరువు, కాటకాలు, వరదలు, గాలులు వస్తాయని ఆయన భావన. ప్రభుత్వంపై విషం కక్కే ప్రయత్నంతో ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఈనెల 26, 27 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలకు అన్ని సక్రమంగా అందాయో లేదో అని తెలుసుకోవడానికి వెళ్లారు. సహాయ కార్యక్రమాలు అందుతున్న సమయంలో వెళ్తే.. కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది.. అధికారులు సీఎం చుట్టు తిరుగుతారు అనే ఉద్దేశంతో సహాయ కార్యక్రమాలు అందిన తరువాత ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి సీఎం వెళ్లారు. తాను వెళ్లి రెచ్చగొడితే.. ఎవరూ రెచ్చిపోకుండా ముఖ్యమంత్రిని మెచ్చుకుంటున్నారేంటని చంద్రబాబుకు కడుపుమంట మొదలైంది. 

సీఎం పర్యటన తరువాత చంద్రబాబు మళ్లీ బయల్దేరాడు. సీఎం వస్తే తిట్టరేంటీ..? అని మాట్లాడుతున్నాడు. కోడి కత్తి కమలహాసన్‌ అని మాట్లాడుతున్నాడు. భారతీయుడిలో కమల్‌హాసన్‌ కూడా ఉన్నాడు. అది చూశారో లేదా చంద్రబాబూ.. భారతీయుడులో కమల్‌హాసన్‌ దుర్మార్గులకు, దుష్టులను, నీలాంటి 420 గాళ్లను రాజకీయంగా గొంతు కోయడానికి వచ్చిన భారతీయుడిలో కమల్‌హాసన్‌ సీఎం వైయస్‌ జగన్‌ అని ప్రజలు చెబుతున్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేలు  అందించిన ప్రజలు ఏనాడైనా ఉందా..? చంద్రబాబు పాలనలో ఎప్పుడైనా రూ.2 వేలు బాధితులకు ఇచ్చారా..? హుద్‌హుద్‌ తుపాన్‌లో వెళ్లారు అని మాట్లాడుతున్నాడు. ఆపదలో సహాయక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి వెళితే అధికారులు కన్ఫ్యూజ్‌ అవుతారు. కాబట్టి సహాయ కార్యక్రమాలు అందిన తరువాత లోపాలు తెలుసుకోవడానికి వెళ్తే.. ఇష్టం వచ్చినట్టుగా కడుపుమంటతో మాట్లాడుతున్నాడు. 

భద్రాచలం వద్ద ఏపీకి చెందిన గ్రామాలకు వెళ్లాడు. 1986 వరదలో పెద్ద కరకట్ట చంద్రబాబు కట్టారంట. అప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడు..? 1983లో టీడీపీ పెట్టినప్పుడు ఇందిరా కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు. 1986లో భువనేశ్వరి చెంగు పట్టుకొని వంట గదిలో నుంచి చొరబడి టీడీపీలో చేరాడు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. టీడీపీ జనరల్‌ సెక్రటరీగా ఉండి కరకట్ట కట్టాడంట. ఎన్టీఆర్, ఆరోజున్న  ప్రభుత్వం ఆ కరకట్టను కట్టారు. దాన్ని చంద్రబాబు క్రెడిట్‌ తీసుకుంటున్నాడు. సొరకాయలు కోస్తుంటే వినాల్సిన కర్మ మాకు పట్టింది. 

ఇండియా టీవీ సర్వేలో వివరంగా వచ్చింది. ఎన్ని వైయస్‌ఆర్‌ సీపీకి వస్తాయో.. ఎన్ని టీడీపీకి వస్తాయో క్లియర్‌గా ఉంది. అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదో విధంగా సీఎం వైయస్‌ జగన్‌పై బురదజల్లాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు హెలికాప్టర్‌లో వెళ్లలేదా..? చంద్రబాబు జీవితమంతా రోడ్డు మీద తిరగడమే తప్ప రెండో పని ఉండదు. 

పోలవరం గురించి చాలా వివరంగా చెప్పినప్పటికీ మళ్లీ రాజకీయాలు చేస్తున్నాడు. పోలవరంలో విధ్వంసం జరిగింది. సర్వనాశనం అయిపోయింది అని మాట్లాడుతున్నాడు. మీరు తప్పుకోండి.. నేను చూపిస్తా అని మాట్లాడుతున్నాడు. ఇదేమైనా హెరిటేజ్‌ పాల వ్యాపారమా..? తప్పుకుంటే రావడానికి.. లేకపోతే ఎన్టీఆర్‌ ట్రస్టు భవనా..? ఎన్టీఆర్‌ కేన్సర్‌ ఆస్పత్రి అనుకుంటున్నాడా..? ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలించే అవకాశం మాకిచ్చారు. 2014–19 వరకు ఐదేళ్ల పాలనలో పోలవరం పూర్తిచేశావా..? ఎందుకు పూర్తిచేయలేదో చెప్పాలి..? బస్సుల్లో జనాలకు తీసుకెళ్లి చంద్రన్న చంద్రన్న అని భజన చేయించాడు. చంద్రబాబు వస్తే వెలుగులు చూపిస్తాడంట.. ఐదేళ్ల పాటు ఇంద్రధనస్సులాంటి వెలుగు చూశారు రాష్ట్ర ప్రజలు. 

2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని అసెంబ్లీలో చెప్పిన టీడీపీ.. ఎందుకు పూర్తిచేయలేకపోయింది.. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా.. ఇన్ని సార్లు అడుగుతున్నా అది చెప్పడు. 

కాపర్‌ డ్యామ్‌లు కంప్లీట్‌ కాకుండా డయాఫ్రం వాల్‌ కట్టడం ధర్మమా..? శాస్త్రమా..? సింపుల్‌గా చెప్పాలంటే సెంట్రింగ్‌ వేయకుండా స్లాబ్‌ వేసినట్టు. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి ఏదైనా మాట్లాడాలని సవాల్‌ చేస్తున్నా. 

పోలవరం జాతీయ ప్రాజెక్టు. దాని నిర్మాణం, నిధుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నువ్వు ఎందుకు పోలవరాన్ని టేకోవర్‌ చేశావ్‌..? ఎందుకు ఎదురెళ్లి తీసుకున్నావ్‌..? కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును తీసుకొని డబ్బులు కాజేయాలని దుర్బుద్ధితో తీసుకొని 2018కి పూర్తిచేస్తానని చెప్పి.. సర్వనాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్టును బాగుచేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై నిందులు వేస్తున్నాడు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. 
 

Back to Top