యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు 
 
మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌
 
వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయం

టీడీపీకి ఒక శనిలా దాపురించిన వ్యక్తి లోకేష్

అనపర్తి :  టీడీపీ నేత నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఓ కామెడీ షో అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మ్యానిపెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బుధవారం అంబటి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కరోనా కష్ట కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు అల్లాడిపోతుంటే ఒక్క వైయ‌స్ జ‌గ‌న్ మాత్రమే వెనకడుగు వేయకుండా సంక్షేమ పధకాలు అమలు చేశారు. విద్య, వైద్యం విషయంలో సీఎం చాలా స్పష్టతతో ఉన్నారు. ప్రతీ పేద విద్యార్థి కార్పొరేట్ విద్య అభ్యసిస్తున్నాడంటే కారణం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే. వెల్‌నెస్‌ సెంటర్ల ద్వారా  ప్రతీ గ్రామంలోనూ వైద్యం అందుబాటులోకి వచ్చింద‌ని అంబటి తెలిపారు.

 పోలవరం ప్రాజెక్టు ప్రారంభంపై ఎప్పుడు ఒక ముహూర్తమంటూ నేనెప్పుడూ చెప్పలేదు. గత ప్రభుత్వాలు చేసిన పనుల ఆధారంగా ఈ ఐదేళ్లలో పనులు పూర్తవుతాయనుకున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డైరెక్టుగా వెళ్లి చూస్తే అక్కడ మొత్తం అవకతవకలే. ఏదేమైనా మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం. వైయ‌స్ జ‌గ‌న్‌ ముఖ్యమంత్రిగా పోలవరం ప్రాజెక్టు ప్రారంభించడం ఖాయం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ముసుగులో టీడీపీ కోవర్టుగా ఉన్న వ్యక్తి పురంధేశ్వరి. లోకేష్ యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో’ అని అంబటి ఎద్దేవా చేశారు. 

‘ఎన్టీఆర్ మనవడు అన్న ఒకే ఒక్క కారణంతో రాజకీయాల్లో చెలామణి అవుతున్న వ్యక్తి లోకేష్. టీడీపీకి ఒక శనిలా దాపురించిన వ్యక్తి లోకేష్. రాష్ట్రం గురించి అవగాహన లేని ప్యాకేజ్ స్టార్ పవన్ కళ్యాణ్ అతనికి వత్తాసు పలుకుతున్నాడు. ప్రస్తుతం ఏపీలో ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా మళ్ళీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నార‌ని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

Back to Top