ఉత్తరాంధ్రను అనేక ప్రాజెక్టులతో అభివృద్ధి చేస్తున్నాం 

రేపు సీఎం చేతుల మీదుగా భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఎయిర్‌పోర్టు, డేటా సెంటర్‌ పార్కు, ఐటీ పార్కుకు శంకుస్థాపన

డేటా సెంటర్‌ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి

విశాఖ నుంచి భోగాపురం కనెక్ట్‌ చేస్తూ 6 లేన్ల రహదారి

ట్విన్‌ సిటీస్‌ మాదిరిగా విశాఖ– విజయనగరం అభివృద్ధి చెందుతాయి

ఇప్పటికే మూలపేట పోర్టుకు శంకుస్థాపన జరిగింది

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అనేక ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి చేస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే మూలపేట పోర్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారని, ఆ పోర్టు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి జరిగి, ఆ ప్రాంత ముఖచిత్రం మారుతుందన్నారు. మూలపేట పోర్ట్‌ పనులు మరో రెండున్నరేళ్లలో పూర్తవుతాయని చెప్పారు. రేపు భోగాపురం ఇంట‌ర్నేష‌న‌ల్‌ ఎయిర్‌పోర్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారని, విశాఖపట్నం రిషికొండలోని హిల్‌–4లో అదానీకి సంబంధించిన వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ పేరిట డేటా సెంటర్‌ పార్కు, ఐటీ పార్కు, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలను మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వివరించారు. 

విలేకరుల సమావేశంలో మంత్రి అమర్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ మరింత వెనుకబాటుతనంలో ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలని శ్రీకృష్ణ కమిటీ ప్రస్తావించింది. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ అనేక ప్రాజెక్టులను సీఎం వైయస్‌ జగన్‌ చేపడుతున్నారు. ఏప్రిల్‌ 19వ తేదీన శ్రీకాకుళంలో రూ.4,265 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకమైన మూలపేట పోర్టు నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అత్యంత వెనుకబాటుకు గురైన శ్రీకాకుళం జిల్లా ముఖచిత్రం మూలపేట పోర్టు ద్వారా మారుతుందని, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని నమ్మి దాదాపు రూ.4,265 కోట్లను ఖర్చు చేసి మరో రెండున్నర సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయబోతున్నాం. 

మే 3వ తేదీన భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయబోతున్నారు. దాదాపు 2,203 ఎకరాల్లో నిర్మించనున్న ఎయిర్‌పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ.3500 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మాణం జరగబోతుంది. సెప్టెంబర్‌ 2025లోపు పూర్తిచేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 2025 సెప్టెంబర్‌ నాటికి మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ని భోగాపురంలో ల్యాండ్‌ చేయాలని ప్రభుత్వ నిర్ణయంగా డెవలపర్‌కు చెప్పారు. మొదటి డొమస్టిక్‌ ఫ్లైట్‌ ల్యాండ్‌ అయిన తరువాత నాలుగు మాసాల్లో ఇంటర్నేషనల్‌ ల్యాండింగ్‌ పర్మిషన్స్‌ వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. రేపు ఉదయం భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపనతో పాటు మధ్యాహ్నం విశాఖపట్నంలో రిషికొండలోని హిల్‌–4లో అదానీకి సంబంధించిన వైజాగ్‌ టెక్‌ పార్కు లిమిటెడ్‌ పేరిట డేటా సెంటర్‌ పార్కు, ఐటీ పార్కు, స్కిల్‌ యూనివర్సిటీ, రిక్రియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు కానున్నాయి. వారికి కేటాయించి డెవలప్‌చేసిన దాదాపు 130 ఎకరాల్లో ఈ నాలుగు ఏర్పాటు చేసేందుకు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 

ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్‌కు ఉన్న ప్రాముఖ్యత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 4–5 లక్షల కోట్ల వ్యాపార అవకాశాలు ఉన్న విభాగం డేటా సెంటర్‌. రానున్న కాలంలో డేటా సెంటర్‌ పార్కుకు సంబంధించి దశల వారీగా దాదాపు రూ.14,500 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించే ప్రాజెక్టుకు సీఎం వైయస్‌ జగన్‌ రేపు శంకుస్థాపన చేయనున్నారు. 

విశాఖపట్నం నుంచి భోగాపురం కనెక్ట్‌ చేస్తూ 6 లేన్ల రోడ్డు దాదాపు రూ.6500 కోట్లతో నిర్మించనున్నట్టు గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023లో కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించారు. దానికి రూ.12 వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్‌ సపోర్టు కావాలని చెప్పారు. కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సపోర్టు చేస్తామని సీఎం చెప్పారు. ఈ 6 లేన్ల రహదారి ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేందుకు, ఎకనామిక్‌ యాక్టివిటీ పెరిగేందుకు పూర్తిస్థాయిలో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయ్యే నాటికి రోడ్డు కూడా పూర్తి చేయాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన. హైదరాబాద్‌–సైబరాబాద్‌ మాదిరిగా వైజాగ్‌–విజయనగరం అభివృద్ధి చెందడానికి ఎయిర్‌పోర్టు, 6 ౖలేన్ల రోడ్డు ఉపయోగపడతాయని సీఎం నమ్ముతున్నారు. 

ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్, పాడేరులో మెడికల్‌ కాలేజీ, నర్సీపట్నంలో మెడికల్‌ కాలేజీ, పార్వతీపురంలో ట్రైబల్‌ యూనివర్సిటీ, కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ.. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు బహుశా గతంలో ఎప్పుడూ ఎవరి హయాంలో జరిగి ఉండవు. 

టీడీపీ నేతలు, చంద్రబాబు మాట్లాడటం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు గతంలో శంకుస్థాపన చేశామని చెబుతున్నారు. మీ హయాంలో జరిగింది ఏంటీ..? ఎన్నికలు వస్తేనే శంకుస్థాపనలు గుర్తుకువస్తాయా..? భోగాపురం ఎయిర్‌పోర్టుకు 2019 ఫిబ్రవరి 15లో శంకుస్థాపన చేశాడు. ఎన్నికల నోటిఫికేషన్‌కు 20 రోజుల ముందు శంకుస్థాపన చేశాడు. రామాయపట్నంలో ఒక సిమెంట్‌ దిమ్మె కట్టించి శిలాఫలకం ఓపెన్‌ చేసి వెళ్లిపోయాడు. భూమి లేదు, కాంట్రాక్టర్‌ లేడు, క్లియర్స్‌ లేవు, పర్మిషన్లు లేవు.. తాపీ మేస్తీ్ర, ఒక పలక ఈ రెండూ ఉంటే చంద్రబాబు ఎంత పెద్ద ప్రాజెక్టు అయినా శంకుస్థాపన చేస్తాడు’’ అని మంత్రి అమర్‌నాథ్‌ ఎద్దేవా చేశారు. 

 

Back to Top