కోవిడ్‌ చికిత్సలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలి

సీఎం చొరవతో రాష్ట్రానికి అదనంగా 230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌

కోవిడ్‌ కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే

ఆక్సిజన్‌ వృథా కాకుండా నోడల్‌ ఆఫీసర్స్‌ పర్యవేక్షణ ఉండాలి

విశాఖ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి ఆళ్ల నాని ఆదేశం

విశాఖపట్నం: కోవిడ్‌ ఆస్పత్రుల్లో డాక్టర్స్, వైద్య సిబ్బంది కొరత లేకుండా వెంటనే రిక్రూట్మెంట్‌ చేయాలని విశాఖ జిల్లా అధికార యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కోవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌ వేగవంతంపై తీసుకోవాల్సిన చర్యలపై విశాఖపట్నం విమ్స్‌లో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, జిల్లా జాయింట్‌ కలెక్టర్లు వేణుగోపాల్‌ రెడ్డి, అరుణ్‌ బాబు, మేయర్‌ గొలగానిహరి వెంకట కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్‌ కొరత లేకుండా ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి ఆక్సిజన్‌ సరఫరా వేగవంతమైందన్నారు. రేపటి నుంచి రాష్ట్రానికి అదనంగా  230 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రానుందని చెప్పారు. 

ఆక్సిజన్‌ కొరత లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రత్యేక దృష్టిసారించారని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం దుర్గాపూర్‌ నుంచి రెండు ట్యాంకుల్లో 40 మెట్రిక్‌ టన్నులు ఆక్సిజన్, జామ్‌నగర్‌ నుండి మరో 110 మెట్రిక్‌ టన్నులు ఆక్సిజన్‌ ప్రత్యేక రైళ్లలో రాష్ట్రానికి వస్తుందన్నారు. అదేవిధంగా జమ్‌షెడ్‌పూర్‌ నుంచి మరో 80 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వస్తుందని చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కోవిడ్‌ ఆస్పత్రుల్లో పేషెంట్స్‌ డిశ్చార్జ్‌లు పెరుగుతున్నాయన్నారు. 

కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి ఫీవర్‌ సర్వే చేపట్టామన్నారు. జ్వరం ఉన్న వాళ్లను గుర్తించి వెంటనే వారికీ వైద్య సదుపాయం, మెడికల్‌ కిట్స్‌ అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కోవిడ్‌ బాధితుల కోసం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌కు వేల సంఖ్యలో ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని, వారందరికీ సత్వర వైద్య సేవలు, బెడ్స్, మెడిసిన్‌ అందజేస్తున్నామని వివరించారు. జిల్లాలో ప్రతి కోవిడ్‌ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ వృథా కాకుండా నోడల్‌ ఆఫీసర్స్‌ పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. వ్యాక్సిన్‌ కేంద్రాలు వద్ద రద్దీ లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top