సీఎం మాట ఇస్తే తప్పడని ప్రజలకు తెలుసు

ఇంగ్లీష్‌ మీడియం అమలుపై హైకోర్టు ప్రోసిడింగ్స్‌ ఇంకా అందలేదు

హైకోర్టు తీర్పును టీడీపీ రాజకీయం చేస్తోంది

ఇంగ్లీష్‌ మీడియం కావాలని పేరెంట్స్‌ కమిటీలు తీర్మానం చేశాయి

ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్వాగతించారు

హైకోర్టు అభ్యంతరం చెప్పిందని సంబరపడుతున్నారు

బడుగు, బలహీన వర్గాలు ఇంగ్లీష్‌ మీడియం చదవడం టీడీపీకి ఇష్టం లేదు

ప్రతి మండలంలో తెలుగు మీడియం స్కూల్‌

ప్రతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి

ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చాం

సీఎం వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైన వెళ్తాం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

తాడేపల్లి: బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఆంగ్ల మాద్యమంలో చదువు చెప్పించాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తపన పడుతున్నారని, సీఎం ఇచ్చిన మాటను తప్పన నెరవేర్చుతారని ప్రజలు విశ్వసిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ ఆలోచనలు అమలు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. సీఎం ఇచ్చిన మాట కోసం ఎంతదూరమైన వెళ్తారని, తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేసి తీరుతామని వెల్లడించారు. ఇంగ్లీష్‌ మీడియం అమలుపై హైకోర్టు అభ్యంతరం చెప్పినట్లు టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని, కోర్టు తీర్పును రాజకీయం చేయడం తగదని మంత్రి ఖండించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదిమూలపు సురేష్‌ మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయాలని, ఆ తరువాత దశల వారిగా పదో తరగతి వరకు ఆంగ్ల మాద్యమంలో చదువులు చెప్పాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన చేశారన్నారు. ఇదే అంశంపై అన్ని పాఠశాలల్లోని పేరెంట్స్‌ కమిటీలు కూడా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాయన్నారు. విశాఖ జిల్లాలో 96 శాతం, నెల్లూరులో 95, చిత్తూరు జిల్లా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పేరెంట్స్‌ కమిటీలు 90 శాతం తీర్మానం చేశాయని వివరించారు. పేరెంట్స్‌ కమిటీ తీర్మానాలను పరిగణలోకి తీసుకొని ఈ ఏడాది నుంచి ఆంగ్ల మాద్యమం అమలు చేయాలని ఇప్పటికే అసెంబ్లీలో చర్చించామన్నారు. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంగ్లీష్‌ మీడియాన్ని వ్యతిరేకించినా, ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన కూడా స్వాగతించారని గుర్తు చేశారు. ఇప్పుడు హైకోర్టు అభ్యంతరం చెప్పిందని చంద్రబాబు, టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేయడం వారి ఆలోచన ఏంటో అర్థమైందన్నారు. బడుగు, బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదవడం, ఆంగ్ల మాద్యమంలో విద్యనభ్యసించడం టీడీపీకి ఇష్టం లేదన్నారు. పేరెంట్స్‌ కమిటీలు ఆమోదించాయంటే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలని కోరుకుంటున్నట్లు కాదా అని ప్రశ్నించారు. వారి పిల్లలను ఏ మీడియంలో చదివించాలో తల్లిదండ్రుల హక్కు ఉందని చెప్పారు. పేరెంట్స్‌ కమిటీల సూచనల మేరకు ప్రభుత్వం రెండు జీవోలను విడుదల చేసిందని తెలిపారు.

ప్రతి మండలంలో ఒక తెలుగు మీడియం స్కూల్‌
తెలుగు మీడియం చదివే విద్యార్థుల కోసం ప్రతి మండలంలో ఒక పాఠశాల ఏర్పాటు చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి ఈ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వమే రవాణా ఖర్చులు భరిస్తుందన్నారు. అలాగే ప్రతి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశామన్నారు. అన్ని భాషల్లో ప్రాథమిక విద్యను అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు ఇప్పటికే లక్ష మంది టీచర్లకు ట్రైనింగ్‌ ఇచ్చామని, బ్రిడ్జి కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు వివరించారు.

 కోర్టు తీర్పును విజయం, అపజయంగా చూడొద్దు
ఇంగ్లీష్‌ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎవరూ కూడా విజయంగానో, అపజయంగానో చూడొద్దని మంత్రి ఆదిమూలపు సురేష్‌ సూచించారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తరువాత ఏం చేయాలో ఆలోచన చేస్తామన్నారు. ఇంగ్లీష్‌ మీడియం అమలు విషయంలో వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని, ఇందుకోసం ఎంతదూరమైన వెళ్తారని, ప్రజలు కూడా వైయస్‌ జగన్‌ ఇచ్చిన మాట నెరవేర్చుతారని విశ్వాసిస్తున్నారని పేర్కొన్నారు. విప్లవాత్మక నిర్ణయాన్ని అమలు దిశగా కోర్టుకు అన్ని సమర్పిస్తామని, కోర్టు కూడా ఆమోదం తెలుపుతుందని మంత్రి సురేష్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Back to Top