ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఎవరిచ్చారు?

 స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌  ఆలోచన 

ఈసీ రమేష్‌కుమార్‌ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి 

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

 తాడేపల్లి: ఎన్నికలను వాయిదా వేసే హక్కు ఈసీ రమేష్‌కుమార్‌కు ఎవరిచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రశ్నించారు. మంగళవారం ఆయన వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల నిలుపుదల అనేది రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఎన్నికలను వాయిదా వేయడాన్ని ప్రజలు కూడా తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. గవర్నర్‌ చేత ఆమోదం పొందిన షెడ్యూల్‌ను గౌరవించకుండా.. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని దుయ్యబట్టారు. ఆయన తన పరిధి దాటి వ్యవహరించి.. రాజ్యాంగ వ్యవస్థలను కాల రాశారని మండిపడ్డారు.  

స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన అని సురేష్‌ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడలిపెట్టు అని ధ్వజమెత్తారు. కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని 2018లో కోర్టు ఆదేశిస్తే ఎందుకు నిర్వహించలేదని సురేష్‌ ప్రశ్నించారు. ఈసీ రమేష్‌కుమార్‌ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top