విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలన్నదే వైఎస్‌ జగన్‌ లక్ష్యం

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

విజయవాడ : విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తేవాలన్నదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. అందుకు అనుగుణంగా సంస్కరణలు తీసుకువస్తామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. త్వరలోనే 10,224 లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. గురువారం విజయవాడలో ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. దీర్ఘకాలంగా అపరిషృతంగా ఉన్న సమస్యలపై ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పారిశుధ్య కార్మికుల జీతాలను పెండింగ్‌లో పెట్టిందని గుర్తుచేశారు. రెండేళ్లలో రూ. 63వేల కోట్ల నిధులను టీడీపీ తప్పుదారి పట్టించిందని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఆ నిధులను పసుపు కుంకుమ పథకానికి మళ్లించిందని మండిపడ్డారు.

పారిశుధ్య కార్మికుల సమస్యపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్ది పరిస్థితిని గాడిలో పెడతామని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. రెండు నెలల్లోనే మేనిఫెస్టోలోని 80 శాతం అంశాలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 6,267 మందికి ప్రమోషన్‌లు ఇచ్చామని, బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ. 33వేల కోట్లు కేటాయించామని.. ఇది విద్యాశాఖకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇస్తున్న ప్రాధాన్యత అని పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న హాస్టల్స్‌పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య రంగానికి 152 కోట్లు కేటాయించమని వెల్లడించారు. యూనిసెఫ్‌ సౌజన్యంతో కెరీర్‌ కౌన్సిల్‌ పోర్టల్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోర్టల్‌..
ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌ పోర్టల్‌ అనే ఆన్‌లైన్‌ సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు తెలిపారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేస్తే 25 రోజుల్లో పరిష్కారం చూపుతామని వెల్లడించారు. త్వరలో మూతబడిన పాఠశాలలను రీ ఓపెన్‌ చేయిస్తామని ప్రకటించారు. 18004252428 టోల్‌ ఫ్రీ నెంబర్‌ ద్వారా దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు. 72,73,74 జీవోలపై ఉన్న స్టేల పక్కన పెట్టి ప్రమోషన్స్‌ ఇవ్వాలని చూస్తున్నామని అన్నారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. 

తాజా ఫోటోలు

Back to Top