అమరావతి: ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పెనుమాకలో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరి అదృష్టం. ఈ కార్యక్రమం మూడో రోజు ప్రారంభిస్తున్నాం. అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విద్యాశాఖలో అక్షరసత్యంగా ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌కు ధీటుగా రూపొందిస్తాం. అన్ని వసతులు కల్పిస్తాం. మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందిస్తాం. రాజన్న రాజ్యంలో పిల్లలు చదువుకోవాలి. చదువుతోనే అభివృద్ధి సాధ్యమన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఆ ఆలోచనతోనే రాజన్న బడి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.