తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు కలిశారు. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేసిన శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు, వచ్చే నెలలో తిరుపతి స్కూల్ శంకుస్ధాపనకు హాజరవ్వాలని సీఎంను ట్రస్ట్ సభ్యులు కోరగా, ఇందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. సీఎంతో సమావేశం అనంతరం ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి మీడియాతో మాట్లాడుతూ..శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు ఉన్నాయి. ఈ గురుకులాల్లో 40 వేల మందికి పైగా విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. తమ విద్యాసంస్ధల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం భూములు కేటాయించడంతో సీఎంగారికి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. తిరుపతి స్కూల్ శంకుస్ధాపన తర్వాత అతి త్వరలోనే పులివెందుల, విశాఖ స్కూల్స్‌కు కూడా భూమి పూజ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ స్కూల్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆధునిక విద్యతో పాటు విలువలతో కూడిన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను నేటి తరానికి భోదించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ట్రస్టీ మెంబర్ సుఖ్‌వల్లభ్ స్వామి, ధర్మ్‌సాగర్ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు.