జేసీ కుటుంబంతో రాయ‌ల‌సీమ‌లో ఎక్క‌డైనా చ‌ర్చ‌కు సిద్ధం

అభివృద్ధి ప‌రంగానా, రాజ‌కీయంగానే అనేది వారిష్టం

వ్య‌క్తిగ‌తంగా మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తే స‌హించ‌ను 

తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స‌వాల్ 

అనంత‌పురంలో మీడియాతో మాట్లాడిన తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి 
 
30 ఏళ్లుగా తాడిప‌త్రిలో జేసీ కుటుంబ‌మే అధికారంలో ఉంది

నా ఐదేళ్ల పాల‌న‌, వారి 30 ఏళ్ల పాలనపై చ‌ర్చ చేద్దాం

క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌ నుంచి అనుమ‌తి తెచ్చుకోవాలి 

జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డి వ్యాఖ్య‌ల‌కు దీటుగా స్పందించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి  

అనంత‌పురం: తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్ల జేసీ కుటుంబ పాలనకు, ఐదేళ్ల త‌న పాల‌న‌పై తాను రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఎక్క‌డైనా చర్చకు సిద్ధమేన‌ని.. కలెక్ట‌ర్‌, ఎస్పీతో మాట్లాడి టైమ్‌, డేట్ ఫిక్స్ చేయాల‌ని తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స‌వాల్ విసిరారు. అనంత‌పురంలోని ఓ హోట‌ల్ లో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ పౌరుషాల పేరుతో త‌న కుటుంబాన్ని టార్గెట్ చేయడం మానేసి, రాజకీయంగానో లేదా అభివృద్ధి పరంగానో ఎదుర్కోవాలని జేసీ ప్ర‌భాక‌ర్‌ రెడ్డికి సూచించారు. ఏదైనా ఉంటే రెండు కుటుంబాలం చూసుకుందాం త‌ప్ప‌, అమాయ‌కుల‌ను బ‌లి చేయ‌డం మానుకోవాల‌ని హితవుప‌లికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను పెద్దారెడ్డి స‌మ‌ర్థించారు. ఆయ‌న మాటల్లో ఏదైనా త‌ప్పుంటే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి ప్ర‌భుత్వం త‌ర‌ఫున చ‌ర్య‌లు తీసుకోవాలే కానీ మా కుటుంబాన్ని వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి మాట్లాడ‌తానంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు. ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడకుండా వ్యక్తిగత పౌరుషాల గురించి మాట్లాడటం సరికాదన్నారు.

● పోలీసులు ఎస్పీ ఆదేశాల‌నే లెక్క చేయ‌డం లేదు

తాడిపత్రి డివిజన్లో పోలీసులు ఎస్పీ ఆదేశాల‌తో కాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల‌తో ప‌నిచేస్తున్నార‌ని కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేశారు. అమాయకులపై మట్కా కేసులు బనాయిస్తూ, అసలు నిందితుల‌ను వదిలేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. పోలీసు అధికారుల‌ను అడ్డం పెట్టుకుని పౌరుషాల గురించి మాట్లాడుతున్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ అధికారంలోకి వ‌స్తే త‌న ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాల‌ని సూచించారు. అన‌వ‌స‌ర‌మైన మాట‌లు కట్టిపెట్టి ఏదైనా ముఖాముఖి తేల్చుకోవ‌డానికి సిద్ధ‌మా? అని ప్ర‌శ్నించారు. సిద్ధ‌మైతే ఏం జరిగినా కేసులు పెట్టవద్దని ముందే లేఖ రాసి పోలీసుల‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజ‌కీయాల‌కు సంబంధం లేని త‌న కొడుకు గురించి మాట్లాడే ముందు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక హైద‌రాబాద్ కి ప‌రిమిత‌మైన త‌న అన్న కొడుకు గురించి ఆలోచించాల‌ని హిత‌వు ప‌లికారు. 

● ఎర్ర‌వంక‌పై క‌లెక్ట‌ర్‌కి ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోలేదు

'ఎర్రవంక' పైన విచారణ జరిపి సర్వే చేయాలని, తాడిప‌త్రి రూరల్ మండలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు రూ. 1.20 కోట్ల స్కామ్ జరిగిందని, గ్రామంలో లేని వ్యక్తులకు బిల్లులు చేశారని ఆధారాలతో సహా కలెక్టర్ ఆఫీసులో తాను ఆధారాల‌తో ఫిర్యాదు చేసి 20 రోజులు గ‌డుస్తున్నా ఎలాంటి విచార‌ణ జ‌ర‌గ‌లేద‌ని, మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డే విచార‌ణ జ‌ర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటున్నాడ‌ని పెద్దారెడ్డి ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేగా క‌లెక్ట‌ర్‌కి నేరుగా తానిచ్చిన ఫిర్యాదుకే దిక్కు లేక‌పోతే సామాన్య ప్ర‌జానీకం ఇచ్చిన ఫిర్యాదుల‌ను ఈ ప్ర‌భుత్వం ఎలా ప‌ట్టించుకుంటుందని ప్ర‌శ్నించారు. జిల్లా క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణం ఎర్ర‌వంకపైన స‌ర్వే చేసి ప్ర‌క్షాళ‌న చేయాల‌ని కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. 

Back to Top