మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను తీవ్రంగా ఖండిస్తున్నాం

పేద విద్యార్ధులకు మెడికల్ విద్యను దూరం చేసి వారి ఉసురుపోసుకోవద్దు 

కూటమి ప్రభుత్వ తీరుపై శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆక్షేపణ. 

విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ.

అధికార పార్టీ అవినీతి, దోపిడీ కోసమే వైద్య కాలేజీల ప్రయివేటీకరణ

దేశంలో మరో రాష్ట్రమూ ఇలా ప్రయివేటీకరణ చేయలేదు

ప్రయివేటీకరణ అంటే చంద్రబాబు ఎనలేని ప్రీతి

మీ అనుయాయులకు కట్టబెట్టాలన్న మీ స్కెచ్ మాకు తెలుసు

ఆ వివరాలనూ బయటపెడతాం

కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మండలి విపక్ష నేత బొత్స ఫైర్

14 నెలల్లోనే రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశారు

రూ.6 వేల కోట్లు మెడికల్ కాలేజీల కోసం కేటాయించలేరా? 

మా మీద కోపాన్ని ప్రజారోగ్యం మీద చూపించొద్దు

పేద పిల్లలను వైద్య విద్యకు దూరం చేయొద్దు

వారి ఉసురు పోసుకోవద్దు

మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొండి

లేనిపక్షంలో వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం తథ్యం

కూటమి ప్రభుత్వాన్ని హెచ్చిరించిన బొత్స

రాష్ట్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు 

ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా ? 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూరియా కొరత ఎందుకు లేదు ? 

ఏపీలో ఉన్నది కూడా కూటమి ప్రభుత్వమే

బస్తా యూరియా కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 

సూటిగా నిలదీసిన బొత్స

రుషికొండ భవనాలపై అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు సరికాదు

అశోక్ వ్యాఖ్యలు రాజకీయ దుర్భిద్ధి, రాచరికపు పోకడలకు నిదర్శనం

గవర్నర్ పదవిలో ఉంటూ హుందాతనం లేకుండా మాట్లాడారు

ఆయన్నే ముందు మెంటల్ ఆసుపత్రిలో పెట్టాలి

అశోక్ గజపతిరాజు రాజకీయ వ్యాఖ్యలపై మండిపడ్డ బొత్స

రైతులకు మద్ధతుగా యూరియా కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం

ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు వినతి పత్రం 

బొత్స ప్రకటన 

విశాఖపట్నం:  అవినీతి, దోపిడీ కోసం కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తోందని...  శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం లోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇలా ప్రయివేటు పరం చేయడం లేదని తేల్చి చెప్పారు. ప్రయివేటీకరణ చేయడం ద్వారా పేద విద్యార్ధులను మెడికల్ విద్యకు దూరం చేస్తూ వారి ఉసురుపోసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతులకు బస్తా యూరియా ఇవ్వడం కూడా చేతకాని ప్రభుత్వ అసమర్ధతను ప్రశ్నిస్తే... కేసులు పెడతామంటూ బెదిరిస్తున్న చంద్రబాబు వైఖరిని బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన చేపడతామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

దోపిడీ ప్రభుత్వమిది

ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేయడానికి ఏకంగా కేబినెట్ లోనే నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, ప్రజల పట్ల నిర్లక్ష్యంతో వారి దోపిడీ కోసం ప్రయివేటీకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ రంగంలో వైద్య విభాగాన్ని ఏ రాష్ట్రంలో ఇలా ప్రయివేటు పరం చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికే ప్రారంభమైన వాటిని ప్రయివేటు పరం చేయాలనుకోవడం దుర్మార్గం. 

మా ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం

జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ ప్రభుత్వ వైద్య కళాశాలల స్థాపనకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 5 వైద్య కళాశాలల నిర్మాణం పూర్తై తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన 12 కాలేజీలలో మరో 5 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మరో 7 కాలేజీలు నిర్మాణ పనులుకు టెండర్లు పూర్తికాబోతున్న దశలో ఉన్నాయి. వీటి నిర్మాణానికి మొత్తం రూ.8 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని నిర్ణయించగా వీటిలో 3 కళాశాలలకు కేంద్రం నిధులు సమకూర్చగా, మిగిలిన వాటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నాబార్డ్ రుణ సౌకర్యంతో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించాం. దురదృష్టవశాత్తూ 2022 వరకు దాదాపు రెండేళ్ల పాటు కోవిడ్ మహమ్మూరి వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తాయి. ఇవాళ పెద్ద, పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు, వ్యక్తులు ఎవరూ కూడా ఆ రోజు ఇంట్లోంచి బయటకే రాలేదు. అయినా కూడా రెండేళ్లలో రూ.2వేల కోట్లకుపైగా మెడికల్ కాలేజీల కోసం ఖర్చు చేసి.. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల జిల్లాల్లో మెడికల్ కాలేజీలలో అడ్మిషన్లు కూడా ప్రారంభించాం. ఇది మా ప్రభుత్వానికి గర్వకారణమైన అంశం.

ప్రయివేటు రంగం అంటే చంద్రబాబుకి ప్రీతి

ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఆలోచన చేయాలే తప్ప.. వారి దోపిడీ, స్వార్ధం కోసం ప్రయివేటీకరణ చేయాలనుకోవడం అత్యంత దురదృష్టకరం. ప్రయివేటు రంగం అంటే చంద్రబాబుకి ఎనలేని ప్రీతి. అందుకే వామపక్షాలు చాలా ఏళ్ల క్రితమే చంద్రబాబును ప్రపంచబ్యాంకు జీతగాడు అని మాట్లాడిన విషయం అందరికీ తెలుసు. ఆ రోజు నుంచి కూడా ప్రభుత్వ రంగంలో ప్రజాసౌలభ్యం కోసం ఏదైనా కార్యక్రమం జరిగితే దాన్ని ప్రయివేటు రంగానికి కట్టబెట్టడం చంద్రబాబు నైజం. 10 మెడికల్ కాలేజీలనీ ప్రయివేటుకి అప్పగించాలన్నకేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ప్రారంభం కాని కాలేజీలు 5 ఉన్నాయి... పులివెందులలో మెడికల్ కాలేజీకి సీట్లు ఎంసిఐ కేటాయిస్తే మాకు వద్దు అని తిరస్కరించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే. ఇది చాలా దురదృష్టకరం. ప్రజారోగ్యాన్ని తీసుకెళ్లి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వారి దయాదాక్షిణ్యాల మీద సామాన్యుల ఆరోగ్యాన్ని నెట్టే దీనస్థితికి తీసుకెళ్లడం మంచి సాంప్రదాయం కాదు.

ఆరోగ్యశ్రీ దివంగత వైయస్సార్ స్వప్నం

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరో  ఆరోగ్యశ్రీ ద్వారా  కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. తొలిఏడాది ఇన్సూరెన్స్ కంపెనీలతో టై అప్ అయ్యారు. ఇన్సూరెన్స్ కంపెనీల అరాకొర సౌకర్యాల కల్పన వల్ల  చాలా మంది సామాన్యులు ఇబ్బంది పడుతుంటే.. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం 14 నెలల పాలనలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. పేదవాడికి కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల.. వారు చికిత్సకు నిరాకరిస్తున్నారు. అడిగితే గత ప్రభుత్వ బకాయిలు అంటున్నారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికే గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు వదిలి వెల్లింది. అయినా మేం వచ్చిన తర్వాత వాటిని తీర్చి.. మా హయాంలో ఆరోగ్యశ్రీని సక్రమంగా నడిపించాం. ఇది నిరంతర ప్రక్రియ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2 లక్షల కోట్లు అప్పులు చేశారు. మీరు తెచ్చిన అప్పులో కేవలం ఓ రూ.6వేల కోట్లు ప్రజారోగ్యం దృష్ట్యా ఆసుపత్రుల నిర్మాణానికి ఖర్చు పెట్టడానికి మీ మనస్సు ఎందుకు అంగీకరించడం లేదు. అక్కడ కూడా కమిషన్లు కోసం కక్కుర్తేనా ? ఇదేనా పరిపాలన?
 ఇందుకేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చారు?  ప్రజలు మిమ్నల్ని క్షమించరు. సంపద సృష్టి అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన మెడికల్ కాలేజీలను మీ తాబేదార్లకు చేతిలో పెట్టడమా ?  దేశ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ జరగలేదు. ఆయా మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారో, మీ స్కెచ్ ఏంటో తెలుసు. ఏ కాలేజీని ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారో ఆ వివరాలు కూడా బయటపెడతాం. సామాన్య ప్రజలకు మేలు జరిగే సంస్ధలు మీకు ఆదాయాలా ?  మీరు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు ముందు కచ్చితంగా ఉంచుతాం. 

పేదల ఉసురు పోసుకోవద్దు చంద్రబాబూ.

ఒకసారి ప్రజలు ఓటేసిన తర్వాత మా చేతిలో అధికారం ఉంది,  ఐదు సంవత్సరాలు మేం ఏం చేసినా చెల్లుతుందనుకోవడం పొరపాటు. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన, దుష్ట ఆలోచనలను గమనించాలని ప్రజలను కోరుతున్నాం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పార్టీ నాయకుల మీద మీకు కోపం ఉంటే మరో రకంగా తీర్చుకొండి. అంతే తప్ప మా మీద కోపాన్ని ప్రజారోగ్యం మీద చూపిస్తూ.. ఇలాంటి దుష్టచర్యలకు పూనుకోవడం సరికాదు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రయివేటీకరణతో పేద విద్యార్ధులకు మెడికల్ విద్యను దూరం చేసి ఆ ఉసురు పోసుకోవద్దు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలి. 

యూరియా ఇవ్వలేదని ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?

మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేది లేదు చంద్రబాబూ? వాస్తవాలు మీకు కనిపించడం లేదా? మీరు మీ పార్టీ నేతలు క్షేత్రస్ధాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొండి. బాధ్యతగల ముఖ్యమంత్రిగా యూరియా కొరత ఎందుకు వచ్చిందో తెలుసుకొండి. బ్లాక్ మార్కెట్ కు యూరియా పోతుందా? గతేడాది కంటే వినియోగం పెరిగిందా ? ఇవేవీ సమీక్షించుకోకుండా యూరియా కొరత ఉందని ప్రశ్నిస్తే చర్యలు తీసుకుంటారా? ఆంధ్రప్రదేశ్ లో ముమ్మూటికీ యూరియా కొరత ఉంది. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, అవినీతి మాత్రమే. ఫలితంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. కావాలంటే రండి క్షేత్రస్ధాయిలో పరిశీలిద్దాం. ఏసీ రూముల్లో కూర్చుని ప్రకటనలు ఇవ్వడం సరికాదు. సమస్యను పరిష్కారించాల్సింది పోయి ఎదురుదాడి ఎన్నాళ్లు చేయగలరు. మా ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా యూరియా కొరత రాలేదు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ అసమర్థత మాత్రమే. 
ప్రజాసమస్యలపై మాట్లాడితే మంత్రులు అత్యంత దిగజారి మాట్లాడుతున్నారు. యూరియా కోసం రైతులు లైన్లో నిల్చుంటే... బోజనాలకు వెళ్తే బఫేలో నిల్చోమా అని వ్యవసాయశాఖ మంత్రి మాట్లాడుతున్నారు. మీ మాటలకు ప్రజలే సమాధానం చెప్తారు. కానీ అంతకంటే ముందు మీరు రైతుల సమస్యలకు పరిష్కారం చూపించండి, అది మీ బాధ్యత.  రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి తిరిగి ఎదురు దాడి చేయడం ఏ రకంగా సమంజసం. ప్రశ్నిస్తే జైల్లో పెడతామంటారా ?  ఇలాంటి మాటలతో ఎంత కాలం కాలం గడుపుతారు. ఎల్లకాలం మీరే అధికారంలో ఉండిపోరన్న విషయాన్ని గుర్తుంచుకొండి. దేశంలో బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా ?  మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎందుకు ఈ సమస్య వస్తోంది? మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యంతో ఉన్న కూటమి ప్రభుత్వమే కద, మరి ఇక్కడ ప్రజలు ఏం పాపం చేశారు ? మీ అంతర్గత రాజకీయాలకు,  మీకు ఓటేసిన పాపానికి మా రైతులను ఇబ్బంది పెట్టొద్దు.  

రుషికొండ భవనాలు వాడుకోలేని చేతకాని ప్రభుత్వం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రుషికొండ టూరిజం బిల్డింగ్స్ పరిశీలిస్తూ.. సీలింగ్ ఊడిపోయిందంటూ మీడియాకు చూపించారు. అది ఊడిపోయిందో? , ఊడగొట్టారో ?  నిజంగా ఊడిపోయి ఉంటే నాసిరకం నిర్మాణం చేసినట్లే లెక్క.. అదే నిజమైతే సదరు కాంట్రాక్టరుకు మీ ప్రభుత్వ హయాంలోనే బిల్లులు చెల్లించారు, వారిపై చర్యలు తీసుకొండి. ఈ భవనాన్ని ఏం చేయాలో తెలియదంటున్నారు. పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు చెల్లిస్తున్నామని పత్రికల్లో రాయిస్తున్నారు. మీ హయాంలో ఇప్పటికే విశాఖలో లూలూ వంటి గ్రూపులకు భూపందేరం చేస్తున్నారు. రుషికొండ పర్యాటకశాఖ పవనాలను ప్రభుత్వ భవనాల కింద వాడుకోవాలన్నదే మా విధానం. అలా కాకుండా రెవెన్యూ పోతుంది, నిర్వహణా వ్యయం అవుతుందన్నప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మీకు చేతగాకపోతే... వాటికి బహిరంగ వేలం వేయడం ద్వారా... అవసరమైన వాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఏడాదికి రూ.25 కోట్లు నుంచి రూ.50 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వాటిని వినియోగించుకుంటారు. అది మీకు చేతగాదు మీ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడతారు.

రుషికొండ భవనాలపై అశోక్ వ్యాఖ్యలు అహంకారానికి నిదర్శనం

రుషికొండ భవనాలను మెంటల్ ఆసుపత్రి చేయాలని అశోక్ గజపతిరాజు గారు మాట్లాడారు. గౌరవమైన గవర్నర్ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడ్డం ద్వారా తన మానసిక స్ధితిని బయటపెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం మానసిక స్ధితి సరిగా లేని ఎలాంటి వ్యక్తులకు  గవర్నర్ పదవి కట్టబెట్టిందో అర్ధం అవుతుంది. అసలు అశోక్ గజపతిరాజునే ముందు మెంటల్ ఆసుపత్రిలో పెట్టాలి. గౌరవప్రదమైన గవర్నర్ పదవిలో ఉండి కూడా.. హుందాతనం లేకుండా, రాజకీయ దుర్భిద్ధితో, రాజకీయ కోణంలో మాట్లాడిన అలాంటి వ్యక్తిని మెంటల్ ఆసుపత్రిలో పెట్టాలి. రాచరికపు పోకడలు, అహంకారం అదే ఆయన ఆలోచనా ధోరణి.   

స్టీల్ ప్లాంట్ పై మా పోరాటం ఆగదు - మీ బెదిరింపులకు లొంగేది లేదు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎవరు పోరాటం చేయమన్నారని అడుగుతారా ? విశాఖ ఉక్కు ఆంధ్రలు హక్కు నినాదానికి మీరు తూట్లు పొడుస్తున్న నేపధ్యంలో.. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడానికి మరో మార్గం లేక పోరాటం చేస్తున్నాం. కేంద్రంలో మీరు భాగస్వామిగా ఉన్న బీజీపీతో పార్లమెంటులో విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ లేదు అని ప్రకటన ఇప్పించండి చంద్రబాబూ,  మీకు జేజేలు కొట్టి పోరాటం ఆపేస్తాం. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం మినహా మాకు మరే ఇంట్రెస్ట్ లేదు. మీ బెదిరింపులకు లొంగేది లేదు. 

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే రైతు సంక్షేమం

వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో సకాలంలో ఇన్ పుట్ సబ్సిడీ, విత్తనాలు, ఎరువులు ఇంటివద్దకే అందించాం. రైతు పెట్టేవాడిగా ఉండాలే తప్ప చేయిచాచకూడదన్నది మా ప్రభుత్వ నినాదం. మరలా కూటమి ప్రభుత్వంలో రైతు చేయి చాచే పరిస్థితికి దిగజార్చారు. అడిగితే ఎదురు దాడి చేస్తున్నారు. మీ ఎల్లో మీడియాలోనే బారులు తీరిన రైతులు అని రాశారు. నిజాలు రాయాల్సిన పరిస్థితి.  వారిది తప్పైతే వారి మీద కూడా చర్యలు తీసుకొండని బొత్స ప్రభుత్వానికి సవాల్ విసిరారు.  ప్రభుత్వ తీరుకు నిరసనగానే ఈనెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద రైతులు, రైతు సంఘాలతో కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ఒత్తడి తీసుకొచ్చి... రైతులకు యూరియా అందేవరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

Back to Top