తెలుగు రాష్ట్రాల విభజనకు కారకులెవరు?

ఉన్నత వర్గాలకే ఇంగ్లీష్‌ మీడియం చదువులా?

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడింది ఎన్టీఆర్‌

ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు అడగలేదు?

అమ్మ భాష, ఆంగ్ల భాష రెండూ ఉంటాయి

పేదల అభ్యున్నతి కోసమే పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం

6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూయించిన ఘనత చంద్రబాబుది

తెలుగు  అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీ పార్వతి

తాడేపల్లి: తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయమని కేంద్రానికి లేఖ ఇచ్చింది చంద్రబాబు కాదా అని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల విభజనకు చంద్రబాబే కారణమని, అలాంటి వ్యక్తి తెలుగుపై మమకారం ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ భాష తెలుగు, ఆంగ్లం రెండూ ఉంటాయని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతి కోసమే సీఎం వైయస్‌ జగన్‌ వచ్చే ఏడాది నుంచి  ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 35 శాతం నిరాక్షరాస్యత ఉన్న పరిస్థితుల్లో అందర్ని అక్షరాస్యులనుగా చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ పట్టుదలతో ఉన్నారని, ఈ నిర్ణయాన్ని అభినందించాల్సింది పోయి, ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీలు తమ పిల్లలను ఉన్నతంగా చదివించలేని పరిస్థితుల్లో ఉన్నారని,అందరికీ ఆంగ్ల మాద్యమం అందుబాటులోకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు.  మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారని, పేదలు ఇంగ్లీష్‌ చదువులకు దూరంగా ఉన్నారని, అందరికీ ఆంగ్ల విద్యను ఇచ్చేందుకు, పేదల కోరిక మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెడుతున్నామన్నారు. తెలుగు భాష నష్టపోతుందని ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేట్‌ స్కూళ్లలో చదువుతున్న 75 శాతం మంది పిల్లలకు తెలుగు రావడం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి చెందిన 6 వేల పాఠశాలలను మూత వేయించారని ధ్వజమెత్తారు. ఇన్‌డైరెక్ట్‌గా నారాయణ, శ్రీచైతన్య పాఠశాలలను ప్రోత్సహించారని తెలిపారు. ఆ పాఠశాల్లో కనీస సౌకర్యాలు ఉన్నాయా అని ఏనాడు చంద్రబాబు ప్రశ్నించలేదన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక చదువులకు పెద్దపీట వేశారన్నారు. అమ్మ ఒడి అనే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. రాక్షస విద్య నుంచి కాపాడుతూ..ఫీజులను నియంత్రిస్తూ గొప్ప పాలన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మీడియం ఏర్పాటు చేస్తున్నామని, మొదటి ఏడాది 1వ తేదీ నుంచి 6వ తరగతి వరకు, ఆ తరువాత ఒక్కో సంవత్సరం ఒక్కో తరగతిని ఇంగ్లీష్‌ మీడియం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలుగు భాష చదువుకుని ఇంట్లో ఉద్యోగం వస్తుందా అన్నారు. ఆంగ్లం మీడియాన్ని వ్యతిరేకించే వారు తమ పిల్లలను వేద పాఠశాలల్లో చేర్పించగలరా అని ప్రశ్నించారు. తెలుగు మీడియంలోనే అలాంటి వారికి విద్యాబోధన అందిస్తామన్నారు. రాయి వేయడానికి మాత్రమే ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. గతంలో చంద్రబాబు సీఎం హోదాలో ఉంటూ "నాకు వెంకయ్యనాయుడికి అవకాశం ఉంటే ఇక్కడ పుట్టాలని ఎందుకు కోరుకుంటామని, అమెరికాలో పుడతామని' చెప్పింది మరిచిపోయారా అన్నారు. ఇప్పుడేమో తెలుగుకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. తెలుగు భాషపై చంద్రబాబుకు ఎక్కడైనా మమకారం ఉందా అన్నారు. 
భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించమని కేంద్రాన్ని కోరింది చంద్రబాబు కాదా అన్నారు. చిదంబరాన్ని కలిసింది చంద్రబాబు కాదా అన్నారు. 2014లో తెలుగు రాష్ట్రాన్ని విభజించాలని తీర్మానం చేసింది ఆయనే అన్నారు. తెలుగు భాష కోసం స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు కృషి చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు తెలుగు భాషపై మమకారం ఉందని చెబితే నమ్ముతారా అన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించుకునే అవకాశం ఉన్నా కూడా చంద్రబాబు కేంద్రాన్ని అడగలేదన్నారు. వైయస్‌ జగన్‌ ఆరోగ్యాంధ్రప్రదేశ్‌, విద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే దిక్కూచిగా మారారని, అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం సరికాదని హెచ్చరించారు.

Read Also:  చంద్ర‌బాబుకు ఇంగ్లిష్ అవ‌స‌రం తెలిసొచ్చింది

తాజా ఫోటోలు

Back to Top